తాకట్టులో ఆర్థిక స్వాతంత్య్రం

ABN , First Publish Date - 2022-08-11T09:51:07+05:30 IST

భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా పాలకులు, వారి వందిమాగధులు దేశం ప్రగతి గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ స్థితిగతులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

తాకట్టులో ఆర్థిక స్వాతంత్య్రం

భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా పాలకులు, వారి వందిమాగధులు దేశం ప్రగతి గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ స్థితిగతులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. దేశంలో దారిద్య్రం పెరిగిపోతున్నది. ప్రపంచబ్యాంకు గణాంకాల ప్రకారం 2017లో ప్రపంచంలో కటికదారిద్య్రం అనుభవిస్తున్న ప్రజలు దాదాపు 69కోట్ల మంది ఉండగా వారిలో 14 కోట్ల మంది భారతీయులే. అంటే 20.17 శాతం. తర్వాత కొవిడ్ మహమ్మారి వలన భారతదేశంలో పేదలసంఖ్య 7కోట్ల 50లక్షలు అదనంగా పెరిగింది. మొత్తం ప్రపంచంలో పెరిగిన దారిద్ర్యంలో ఇది సుమారు 60 శాతంగా ఉన్నది. కొవిడ్ వలన మధ్యతరగతి ప్రజల జీవన స్థితిగతులు దిగజారిపోయాయి.


అంతర్జాతీయ ఆకలి సూచిక (జిహెచ్ఐ) ప్రకారం ఇండియాలో 5ఏళ్ళలోపు ఉండే పిల్లలు 35శాతం మంది పెరుగుదల విషయంలో సమస్య ఎదుర్కొంటున్నారు. పోషకాహార లోపం ప్రధానసూచిక ఇది. ఇప్పటికే 2020లో ఇండియా అంతర్జాతీయ ఆకలి సూచీ 107 దేశాలలో 94వ స్థానంలో ఉంది. 


నేషననల్ శాంపిల్ సర్వే 2007–08 ప్రకారం దేశంలోని మొత్తం వర్క్‌ఫ్లోలో 28.3 శాతం మంది వలస కార్మికులున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం జనాభాలో 37శాతం వలస కార్మికులున్నారు. ఇంతమంది వలస కార్మికులు రోజువారీ కూలి పనులపై ఆధారపడుతూ ఇబ్బందులు పడుతున్నారు. వేరొకవైపు నేడు నిరుద్యోగ రక్కసి మునుపెన్నడూ లేనంతగా భారత యువతను పట్టిపీడిస్తున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలపైన, ప్రజా ఉద్యమాలపైన పోలీసుల అకృత్యాలు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అనేక అప్రజాస్వామిక చట్టాలు, నిర్బంధ విధానాలు దేశంలో రాజ్యమేలుతున్నాయి. దేశంలోని యువతను నిర్వీర్యం చేయటానికి పాలకులు భూస్వామ్య, సామ్రాజ్యవాద విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. ధరలు నిత్యం ఆకాశాన్ని అంటుతున్నందున అన్ని జీవన రంగాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


ఒక్కమాటలో చెప్పాలంటే 75 సంవత్సరాల స్వతంత్రదేశంలో పాలకులు ప్రజలకు ఇచ్చింది ఆకలి, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, పోలీసురాజ్యం, పతనసంస్కృతి, అధికధరలు. ఈ 75 సంవత్సరాల కాలంలో ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క మౌలిక సమస్య పరిష్కారం కాలేదనేది నగ్నసత్యం.


దేశంలో భూస్వామ్య దోపిడీ, విదేశీ, స్వదేశీ బడా పెట్టుబడిదారుల దోపిడీలు కొనసాగుతున్నాయి, స్వాతంత్య్రంవచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్నప్పటికీ ఈ దోపిడీ పీడనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. అత్యధికశాతం భూమి కేవలం కొద్దిమంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమై, అశేష ప్రజానీకం భూమిలేనివారుగా ఉంటూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఫ్యూడల్ దోపిడీ కొనసాగుతూనే వుంది.


వేరొకవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలో పెరిగిపోతున్నాయి. 1948లో దేశంలో రూ.314.7కోట్ల విదేశీ పెట్టుబడులు ఉండేవి. 2020–21లో దేశంలోకి ప్రవేశించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ.6లక్షల 14వేల 775కోట్లు. గత 7 ఆర్థిక సంవత్సరాలలో రూ.33లక్షల కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. దేశంలో కొనసాగుతున్న ఈ విదేశీ దోపిడీ తీరుతెన్నులను కమ్యూనిస్టు విప్లవయోధుడు తరిమెల నాగిరెడ్డి ‘తాకట్టులో భారతదేశం’ అనే గ్రంథంలో ప్రతిభావంతంగా వివరించారు. మనకంటూ ఒక స్వతంత్ర ఆర్థిక వ్యవస్థ లేకపోవటంతో దేశంలోకి ప్రవేశించిన ఈ విదేశీ పెట్టుబడులు దేశాభివృద్ధికి తోడ్పడటంలేదు. వేరొకవైపు చైనా 1949లో తమ దేశంలోని భూస్వామ్య, విదేశీ, స్వదేశీ బడా పెట్టుబడిదారుల దోపిడీలను రద్దు చేసుకుని స్వతంత్రమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నేడు విదేశీ పెట్టుబడులను తమ దేశాభివృద్ధికి సమర్థంగా వినియోగించుకుంటున్నది.


ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం మన దేశంలో 10శాతం మంది దగ్గర 77శాతం దేశ సంపద పోగై ఉంది. అలాగే దేశంలోని వందమంది అగ్రశ్రేణి సంపన్నుల ఆదాయం 2020 మార్చి నుంచి 35శాతం అంటే 13 లక్షల కోట్ల రూపాయల మేరకు పెరిగింది. ధనిక పేదల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోంది. ఈ విధంగా దేశంలో విదేశీ అప్పు, విదేశీ పెట్టుబడులు, బడా పెట్టుబడిదారుల ఆస్తులు, లాభాలు ఈ 75 ఏళ్ళకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి.


‘స్వతంత్ర’ భారత ప్రజలు నేడు భూస్వామ్య దోపిడీ, విదేశీ దోపిడీ, స్వదేశీ బడా పెట్టుబడిదారుల దోపిడీ – అనే మూడు బరువులను మోస్తున్నారు. భారత ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని మౌలిక సమస్యలకు ఈ మూడు దోపిడీలే ప్రధానకారణమని, ఈ మూడు దోపిడీలను నిర్మూలించకుండా భారత ప్రజలు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదని కమ్యూనిస్టు విప్లవకారుల అగ్రనాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు 1970లోనే చెప్పారు.


ఆర్థిక స్వాతంత్ర్యం, రాజకీయ స్వాతంత్య్రం రెండూ వస్తేనే ఏ దేశానికైనా సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్లు లెక్క. మన దేశానికి 1947లో అధికారమార్పిడి జరిగి కేవలం రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే వచ్చింది. ఆర్థిక స్వాతంత్య్రం ఇప్పటికీ రాలేదు. ఆర్థిక స్వాతంత్య్రం లేని ఈ రాజకీయ స్వాతంత్య్రం నామమాత్రమైనది, బూటకమైనది. కాబట్టి భారత ప్రజలు నిజమైన స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఇంకా సాధించుకోవలసే ఉంది.


సి. భాస్కర్

యు.సి.సి.ఆర్.ఐ (యం–యల్)

Updated Date - 2022-08-11T09:51:07+05:30 IST