ఆర్థిక విధ్వంసం

ABN , First Publish Date - 2021-11-27T08:10:21+05:30 IST

ఇది తీరని రుణ దాహం! ఎంతకీ తీరని అప్పుల ఆకలి! కట్టు తప్పిన ఆర్థిక క్రమశిక్షణ! ప్రస్తుతాన్నీ, భవిష్యత్తునూ తాకట్టు పెట్టేంత దా‘రుణం’....

ఆర్థిక విధ్వంసం

అప్పుల కోసం సర్కారు మరో తప్పుడు విన్యాసం

కార్పొరేషన్ల ద్వారా అదనంగా లక్ష కోట్ల అప్పు!

గ్యారెంటీ స్పేస్‌ 90% నుంచి 180 శాతానికి పెంపు

ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం

ఇప్పటికే రూ.1.10 లక్షల కోట్లకు సర్కారు గ్యారెంటీ

ఆ పరిమితి ముగిసిపోవడంతో కొత్తగా పెంపు

కేంద్రం పాలసీకి విరుద్ధంగా రాష్ట్రం నిర్ణయం

భవిష్యత్తు రెవెన్యూ లోటుపైనా వింత లెక్కలు


ఇది తీరని రుణ దాహం! ఎంతకీ తీరని అప్పుల ఆకలి! కట్టు తప్పిన ఆర్థిక క్రమశిక్షణ! ప్రస్తుతాన్నీ, భవిష్యత్తునూ తాకట్టు పెట్టేంత దా‘రుణం’! అప్పుల మీద అప్పులు చేస్తూ... దొడ్డిదారిలో తప్పులు చేస్తూ... అన్ని పరిమితులు దాటేసి, రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్‌ల ద్వారా అప్పుల వేట ప్రారంభించిన ఏపీ సర్కారు... అన్ని కట్టుబాట్లనూ తెంచేస్తోంది. స్వీయ క్రమశిక్షణ గీతను చెరిపేసింది. గ్యారెంటీల (హామీ) గోల్‌మాల్‌తోపాటు... ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులనూ మార్చేసింది. రాష్ట్ర సర్కారు ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతోందని తేల్చిన ‘కాగ్‌’ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రోజే... మరో లక్ష కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు ‘కల్పించుకుంటూ’ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.


అప్పులు చేయడంలో ప్రభుత్వం అన్ని గీతలనూ దాటేసింది. దీంతో... ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కార్పొరేషన్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌, రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌... ఇలాంటి సంస్థల ద్వారా అప్పులు తెచ్చుకుంటోంది. వీటికి కూడా గ్యారెంటీల పరిమితి ముగిసిపోవడంతో... కొత్త అప్పుల కోసం సరికొత్త ఎత్తు వేసింది. అదే... గ్యారెంటీల పరిమితిని రెట్టింపు చేయడం!


కేంద్రం రూపొందించిన గ్యారెంటీ పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం  రూ.5600 కోట్ల రుణానికి మాత్రమే హామీ ఇవ్వగలదు. కానీ... సొంతంగా చేసుకున్న చట్టం ప్రకారం ఇప్పటికే రూ.1,10,000 కోట్లకు గ్యారెంటీ ఇచ్చింది. ఇది కూడా సరిపోదని ఇప్పుడు చట్టాన్ని సవరించింది. మరో రూ.లక్ష కోట్లకు హామీ ఇచ్చే వెసులుబాటు తనంతట తాను ‘సృష్టించుకుంది’.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మీ ఆదాయం వంద రూపాయలు! కానీ... ఇంకెవరో తీసుకునే 180 రూపాయల రుణానికి మీరు గ్యారెంటీ ఇస్తే చెల్లుతుందా? మీ గ్యారెంటీకి విలువ ఉంటుందా? మామూలు లెక్కల్లో అయితే... ఉండదు. కానీ... ఏపీ సర్కారువన్నీ వింత లెక్కలు! అప్పులు తెచ్చుకోవడమే లక్ష్యంగా సాగే తప్పుడు లెక్కలు! అందులో భాగంగానే... కార్పొరేషన్ల ద్వారా మరో రూ.లక్ష కోట్లు అప్పు తెచ్చుకునేందుకు ‘స్కెచ్‌’ గీసింది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.3,00,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చిన జగన్‌ సర్కారు.. ఇంకో లక్ష కోట్ల అప్పులకు తనకు తానే వీలు కల్పించుకుంటూ అసెంబ్లీ సాక్షిగా రాజముద్రవేసింది. కార్పొరేషన్ల ద్వారా కాసులు దండుకునేలా శుక్రవారం అసెంబ్లీలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి సవరణలు చేసింది.


ఇదీ తిర‘కాసు’

కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఆర్థిక అవసరాలకు అప్పులు చేయాల్సి వస్తుంది. అయితే... బ్యాంకులు వాటికి నేరుగా రుణాలు మంజూరు చేయవు. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు (గ్యారెంటీ) మేరకే కార్పొరేషన్లకు అప్పులు పుడతాయి. అయితే... ప్రభుత్వం ఎడాపెడా గ్యారెంటీలు ఇచ్చేందుకు వీల్లేదు. దీనికీ ఒక పరిమితి ఉంటుంది. దీనినే ‘గ్యారెంటీ స్పేస్‌’ అంటారు. ఇప్పటిదాకా ఉన్న చట్టం ప్రకారం... గడచిన ఆర్థిక సంవత్సరంలో తనకు వచ్చిన ఆదాయంలో 90 శాతం మొత్తానికి మాత్రమే ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వగలదు. ఉదాహరణకు... గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం లక్ష కోట్ల రూపాయలైతే, రూ.90వేల కోట్లకు మించి గ్యారెంటీలు ఇవ్వకూడదు. శుక్రవారం ఈ చట్టాన్ని సవరించేశారు. ఇప్పటిదాకా 90 శాతం ఉన్న గ్యారెంటీ స్పేస్‌ను ఏకంగా 180 శాతానికి పెంచారు. అంటే... కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం మరో రూ.లక్ష కోట్ల అప్పులు చేయవచ్చు! 


90 శాతమే తప్పంటుంటే....

గ్యారంటీల పరిమితిని ఉమ్మడి ఏపీలో... 2005లో సవరించారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంలో 90 శాతం వరకు పెంచారు. అయితే.. కార్పొరేషన్లకు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్యారెంటీలు, కార్పొరేషన్ల స్థితిగతులపై ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిక ఇస్తుంది. ఇలా 2009లో ఆర్‌బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్రం గ్యారెంటీలపై ఒక విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం ఏ రాష్ట్రమైనా తను ఇచ్చే గ్యారెంటీలు ఏ ఏడాది చూసినా, ఆ ఏడాదిలో నమోదైన జీఎ్‌సడీపీలో 0.5ు మించరాదు. ఇదే అంశాన్ని ఆర్బీఐ తన నివేదికల్లో తరచూ గుర్తుచేస్తోంది. దీనిని ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాతా పట్టించుకోలేదు. ‘90 శాతం’ వెసులుబాటునే ఉపయోగించుకుంటున్నారు. ఇదే తప్పని కేంద్రం చెబుతుండగా... ఇప్పుడు  ఆ 90 శాతాన్ని జగన్‌ సర్కారు 180 శాతానికి పెంచేసింది. 


ఏపీ వాస్తవిక పరిమితి రూ.5,600 కోట్లే

2010లో కేంద్రం రూపొందించిన గ్యారెంటీ పాలసీ ప్రకారం... ప్రభుత్వం రూ.5600 కోట్లకు మించి రుణాలకు హామీ పడే అవకాశం లేదు. ఎందుకంటే... ఈ ఏడాది జీఎ్‌సడీపీ రూ.11.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా! ఇందులో 0.5 శాతం అంటే రూ.5,600 కోట్లు మాత్రమే. కానీ, బడ్జెట్‌ పుస్తకాల లెక్కల ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం రూ.1.19 లక్షల కోట్ల రుణాలకు గ్యారెంటీ ఇచ్చింది. ఇప్పుడు గ్యారెంటీ స్పేస్‌ను 90 నుంచి 180 శాతానికి పెంచడంతో ఇంకో లక్ష కోట్లు అప్పు తెచ్చుకునే అవకాశాన్ని ‘సృష్టించుకుంది’.


‘లోటు’కూ ఒక లెక్క...

కేంద్రం చేసిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్రాల రెవెన్యూ లోటు ‘సున్నా’ ఉండాలి. అది తమకు కుదరని పని అని అసెంబ్లీ సాక్షిగా జగన్‌ సర్కారు తేల్చేసింది. 2025-26 వరకు వార్షిక రెవెన్యూ లోటు పరిమితులను నిర్దేశించుకుంటూ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో కొత్త క్లాజ్‌లను చేర్చింది. ఈ ఏడాది రెవెన్యూ లోటు రూ.36,000 కోట్లు ఉంటుందని తెలిపింది.  వచ్చే ఏడాది 33 వేల కోట్లు... 2025-26 నాటికి రూ.24,000 కోట్లు ఉంటుందని ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి సవరణలు చేసి, అసెంబ్లీలో ఆమోదింప చేసుకుంది. తెచ్చుకుంటున్న అప్పులను కాస్తయినా సక్రమం చేసుకోవడం కోసమే ఈ విన్యాసం చేసినట్లు తెలుస్తోంది.


బుగ్గన సమర్థన ఇది: ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం-2005 సవరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ అవసరం ఎందుకు వచ్చిందో కూడా తెలిపారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో ఆస్తుల విభజన సవ్యంగా జరగలేదు. నవ్యాంధ్ర ఆర్థిక పరిస్థితిపై దీని ప్రభావం సుదీర్ఘకాలం ఉంటోంది. మరోవైపు... కరోనా కట్టడికి తీసుకున్న చర్యలతో రాష్ట్ర ఆర్థిక వనరులపై భారం పడింది’’ అని తెలిపారు.

Updated Date - 2021-11-27T08:10:21+05:30 IST