FinCare బ్యాంకు లూటీ..

ABN , First Publish Date - 2022-05-28T06:37:34+05:30 IST

శ్రీకాళహస్తిలో గురువారం రాత్రి దొంగలు సినీఫక్కీలో బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.... పట్టణంలోని పెద్ద మసీదు వీధిలో ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ పేరుతో ప్రైవేటు బ్యాంకు ఉంది.

FinCare బ్యాంకు లూటీ..
బ్యాంకు భవనం, సిబ్బందిని ఆరా తీస్తున్న ఎస్పీ పరమేశ్వరరెడ్డి

  • రూ.85లక్షల నగలు, నగదు దోపిడీ  
  • బ్యాంకు సిబ్బంది సహకారంతోనే...?


శ్రీకాళహస్తి, మే 26 : శ్రీకాళహస్తిలో గురువారం రాత్రి దొంగలు సినీఫక్కీలో బ్యాంకు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు....  పట్టణంలోని పెద్ద మసీదు వీధిలో ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ పేరుతో ప్రైవేటు బ్యాంకు ఉంది. ఖాతాదారులకు బంగారు నగలపై రుణాలు ఇస్తుంటారు.గురువారం రాత్రి బ్యాంకు సిబ్బంది లావాదేవీలు చెక్‌ చేసే పని చేపట్టారు.కాసేపటి తర్వాత మేనేజర్‌ అభయ్‌రెడ్డి సహా ఆరుగురు సిబ్బంది పైన వున్న గదికి భోంచేసేందుకు వెళ్లారు.బ్యాంకులో ఆపరేటింగ్‌ మేనేజర్‌ స్రవంతి మాత్రమే మిగిలారు. సుమారు 10.30గంటల సమయంలో 40 ఏళ్ల వయసున్న ముగ్గురు వ్యక్తులు లోపలకు వచ్చి ఆమెకు కత్తులు చూపించి బెదిరించారు. తరువాత ఆమె చున్నీ తోనే చేతులు కట్టేసి రుమాలు నోట్లో కుక్కారు.సేఫ్‌ లాకర్‌లో ఉన్న 2.85కేజీల బంగారం, రూ.5లక్షల నగదు బ్యాగులో వేసుకున్నారు.స్రవంతి సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. సీసీ టీవీ దృశ్యాలు నిక్షిప్తం అయ్యే హార్డుడిస్క్‌ లాక్కుని  పచ్చ రంగు నాప్కిన్‌తో స్రవంతి కాళ్లు కట్టేసి షట్టర్‌ మూసేసి పరారయ్యారు.


కాసేపటికి స్రవంతి ఎలాగోలా కట్లు విప్పుకుని  మిద్దెపైన ఉన్న సిబ్బంది వద్దకు వెళ్లి విషయం వివరించింది.అర్ధరాత్రి 12.20గంటలకు పోలీసులకు ఫోన్‌లో విషయం చెప్పడంతో డీఎస్పీ విశ్వనాథ్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు.స్రవంతి ఫిర్యాదు మేరకు ఎక్స్‌ప్రెస్‌ ఘటన కింద కేసు నమోదు చేశారు.సీఐలు శ్రీనివాసులు, కృష్ణమోహన్‌, విక్రమ్‌, ఎస్‌ఐలు సంజీవ్‌కుమార్‌, వెంకటసుబ్బయ్య, వెంకటేష్‌ బృందాలుగా గాలింపు చేపట్టారు.తిరుపతి నుంచి క్లూస్‌ టీం విచ్చేసి వేలి, పాదముద్రల నమూనాలు సేకరించారు. ఆ తరువాత డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా దొంగల కదలికలపై దృష్టి పెట్టారు. శుక్రవారం ఉదయం తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఘటానా స్థలాన్ని పరిశీలించారు. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి కూపీ లాగారు.పక్కా పథకం ప్రకారం రెక్కీ వేసి దోపిడీ చేసినట్లు అనుమానిస్తున్నామని మీడియాకు చెప్పారు.డాగ్‌ స్క్వాడ్‌ పయనించిన మార్గంలో సీసీ కెమెరాలను పోలీసులు తనిఖీ చేశారు.బ్యాంకు సిబ్బంది మాటలను విడివిడిగా నమోదు చేసుకున్నారు.


కొందరి మాటలు పొంతన లేకుండా ఉండటంతో అందరినీ అదుపులోనే ఉంచుకుని ఆరా తీశారు. అసలు అర్ధరాత్రి బ్యాంకు ఎందుకు తెరచి ఉంచారు?నగలు మొత్తం ఒక్కసారిగా రాత్రి వేళ ఎందుకు తీశారు?కలెక్షన్‌ లెక్కలకు బంగారు బయటకు తీయాల్సిన అవసరం ఏంటి? ముగ్గురు వ్యక్తులు బ్యాంకుకు వచ్చి దర్జాగా దోపిడీ చేస్తుంటే ఎందుకు చప్పుడు కాలేదు? సిబ్బంది మాటల్లో ఎందుకు పొంతన కుదరలేదు?స్రవంతి కాళ్లకు మాతమ్రే ఎందుకు కట్లు ఊడిపోయాయి...ముందు చేతులు కట్టేసమయంలో ఎందుకు అరవలేదు? ఘటన తరువాత స్రవంతి మిద్దె పైకి వెళ్లే వరకూ సిబ్బంది ఏం చేస్తున్నట్టు.....ఇలా లెక్కలేనన్ని అనుమానాలు పోలీసులను తొలిచాయి. 


అమ్మ దొంగలారా..!

పోలీసులు తమదైన విచారణతో దోపిడీకి కొందరు బ్యాంకు సిబ్బందే సహకరించారని కనుగొన్నట్లు సమాచారం.గురువారం రాత్రి రెండు గంటల నుంచి  విశ్రాంతి లేకుండా కేసు ఛేదనలోనే తలమునకలైన పోలీసులు శుక్రవారం రాత్రివేళకు దోపిడీకి పాల్పడ్డ నిందితులను, సహకరించిన సిబ్బందిని గుర్తించినట్లు తెలిసింది.ఉదయం నుంచి బ్యాంకులోనే పోలీసు అధికారులు, మహిళా పోలీసులు, సిబ్బంది తిష్ట వేసి పలు రకాలుగా కూపీ లాగారు.సాయంత్రం బ్యాంకు సిబ్బందిని మళ్లీ పట్టణంలోని బుచ్చినాయుడు కండ్రిగ సర్కిల్‌ కార్యాలయానికి తరలించి ఆరా తీసినట్టు సమాచారం.దీంతో 16 గంటల వ్యవధిలోనే కేసు కొలిక్కి వచ్చిందని తెలిసింది.

Updated Date - 2022-05-28T06:37:34+05:30 IST