ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుంటే రూ.10,000 జరిమానా, జైలు

ABN , First Publish Date - 2022-05-01T23:13:27+05:30 IST

రవాణా వాహనాల యజమానులు, డ్రైవర్లు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా వాహనాలు..

ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుంటే రూ.10,000 జరిమానా, జైలు

న్యూఢిల్లీ: రవాణా వాహనాల యజమానులు, డ్రైవర్లు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా వాహనాలు నడిపితే రూ.10,000 జరిమానా విధిస్తామని, జైలు శిక్ష కూడా పడుతుందని ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఆదివారంనాడు హెచ్చరించింది. ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలకు కూడా జరిమానా వర్తిస్తుందని తెలిపింది. మోటార్ వాహనాల చట్టాన్ని (1988) ఉల్లంఘించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా అనేక వాహనాలు రోడ్లపై నడుస్తున్నట్టు రవాణా శాఖ గుర్తించడంతో ఈ హెచ్చరికలు జారీ చేసింది.


ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగే వాహనాలపై దృష్టి సారించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను రవాణా శాఖ కోరింది. ఉల్లంఘనదారుల ఆటకట్టించేందుకు త్వరలోనే ఒక డ్రైవ్ కూడా నిర్వహించనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పబ్లిక్ సర్వీస్ వాహనాలు, గూడ్స్ క్యారేజీ వాహనాలు, బస్సులు, స్కూళ్లు-కాలేజీల క్యాబ్‌లతో సహా అన్ని వాహనాల యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా గుర్తింపుపొందిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని రవాణా శాఖ ఇటీవలే పబ్లిక్ నోటీసు జారీ చేసిన్టటు చెప్పారు.


మోటార్ వాహనాల చట్టం 56 ప్రకారం, రవాణా వాహనం తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ జారీ చేసే ఫిటెనెస్ సర్టిఫికేట్ తప్పనిసరి. కేంద్ర మోటార్ వాహనాల చట్టం 1989 ప్రకారం, ఎనిమిదేళ్లుగా వాడకంలో ఉన్న వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెండేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఎనిమిదేళ్ల కంటే పాతబడిన వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటుంది.


కాగా, ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ నోటిఫికేషన్ ప్రకారం, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలకు మొదటి నేరంగా పరిగణించి రూ .2000 నుంచి 5000 వరకూ జరిమానా విధిస్తారు. రెండోసారి కూడా ఉల్లంఘనలకు పాల్పడితే రూ.5,000 నుంచి 10,000 వరకూ జరిమానా ఉంటుంది. జైలుకు పంపే నిబంధన కూడా ఇందులో ఉంది. ఇ-రిక్షాలు, ఇ-కార్ట్స్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. సెంట్రల్ మోటార్ వెహికల్  రూల్స్ ప్రకారం, ఫిటెనెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత నుంచి రోజుకు 50 రూపాయల చొప్పున అదనపు లెవీ కూడా యజమానులు చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-05-01T23:13:27+05:30 IST