తప్పని ఎదురుచూపులు..
వినతుల సంగతేంటో?
కొత్త జిల్లా సరిహద్దుల్లో మార్పులు ఉంటాయా?
ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు సిద్ధం
శాఖలకు చాంబర్లు కేటాయింపు పూర్తి
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
కొత్త జిల్లాల ఫైనల్ నోటిఫికేషన్కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే జిల్లానుంచి వందలాది అభ్యంతరాలు, వినతులు ఉన్నాయి. ఉగాదిరోజునుంచి అంటే ఏప్రిల్ 2వతేదీ నుంచే కొత్త జిల్లాలు అమలులోకి రానున్నాయి. ఇక ఐదురోజులు మాత్రమే ఉంది. జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు కూడా సిద్ధమైపోతున్నాయి. ఉద్యోగుల విభజన కూడా పూర్తయింది. ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం కొత్త జిల్లాలకు మ్యాప్‌లు కూడా సిద్ధం చేసి వాటి ప్రకారమే ఉద్యోగుల విభజన, పరిధులు నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని ప్రజల ఆకాంక్షల మేరకు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది తేలాలంటే ఫైనల్ నోటిఫికేషన్ రావాల్సిందే. ఇక కేవలం ఐదురోజులే సమయం ఉంది. కాబట్టి ఈనెల 31న కానీ, అంతుకుముందే కానీ నోటిఫికేషన్ రావచ్చని భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా, అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాలను ముసాయిదా నోటిఫికేషన్లో ప్రతిపాదించారు. దీనిపై కొన్ని అభ్యంతరాలు, సలహాలు, వినతులు వచ్చాయి.
సరిహద్దు మండలాల మార్పు డిమాండ్లు ఏం చేస్తారో..?
రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాకు కాటన్ తూర్పుగోదావరి జిల్లాగా మార్చాలనే డిమాండ్ ఉంది. ఈ కొత్త జిల్లాలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు ముసాయిదా నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అందువల్ల ద్వారకాతిరుమల మండలం ఈ జిల్లాలో ఉంది. అది వాస్తవానికి ఏలూరుకు దగ్గర. అందువల్ల దాన్ని ఏలూరులో కలపాలనే డిమాండ్ ఉంది. ఇక రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో ఉండే గోకవరం మండలం కాకినాడ జిల్లాలోకి వెళ్లింది. దాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న జిల్లాలోనే ఉంచాలని కోరుతున్నారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పెదపాడు మండలం కాకినాడకు దగ్గరగా ఉంది. అందువల్ల దాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని కోరుతున్నారు. ఇక కోనసీమ జిల్లా పరిధిలో ప్రతిపాదించిన మండపేట నియోజకవవర్గాన్ని రాజమహేంద్రవరంలో కలపాలని కోరుతున్నారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకికాడలో కలపాలనే డిమాండ్ ఉంది. ఇక ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, చింతూరు డివిజన్లను పాడేరు కేంద్రంగా ఏర్పడిన జిల్లాలో కలిపారు. అక్కడ కలెక్టరేట్‌కు వెళ్లాంటే 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పైగా గిరిజన ప్రాంతాలంటే మౌలిక సదుపాయాలు ఉండవు. రవాణా సౌకర్యాలు ఉండవు. ప్రస్తుతం పోలవరం పునరావాసం, ఆర్అండ్ ప్యాకేజీలు తదితర అంశాలు పరిష్కారం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాటి కోసం పాడేరు వెళ్లాలంటే సమస్య కానున్న నేపథ్యంలో ఏజెన్సీని రంపచోడవరం జిల్లాగా కలపాలని లేదా రాజమహేంద్రవరం కేంద్రంగా ఉండే జిల్లాలో కలపానే డిమాండ్ ఉంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ కూడా బలీయంగా ఉంది. ఇంకా అనేక వినతులు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తికంగా మారింది. ఇవన్నీ తేలాలంటే తుది నోటిఫికేషన్లో ఏం ఉంటుందో అదే ఫైనల్ అవుతుంది. నోటిఫికేషన్‌కు ఆలస్యం అవుతుంది కాబట్టి, ముఖ్యమైన అభ్యంతరాలను పరిగణనలోకి ప్రభుత్వం తీసుకుంటుందనే ఆశ కూడా ఉంది. లేకపోతే ఫైనల్ నోటిఫికేషన్ ఎవరి అభ్యంతరాలు పరిష్కారం కాకపోయినా వాటిపై కోర్టుకు కూడా వెళ్లే సమయం లేకుండా కొద్దిగా రెండుమూడు రోజుల ముందే ఇవ్వనున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ నోటిఫికేషన్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క కొత్త జిల్లాల పాలనకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరిగిపోతున్నాయి.