ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2021-03-15T09:29:18+05:30 IST

దారుల్ని కూల్చేసిన తరవాత రోడ్డునపడ్డ వాడికి ఏమేం చెప్తావో నువ్వు చెప్తూనే వుండు. గడ్డి శుభ్రంగా తొలగిపోయిన తెల్లచారల దారో, మనుషుల్నీ, వీధుల్నీ, బతుకుల్నీ చదును చేసి...

ఎఫ్ఐఆర్

1 దారుల్ని కూల్చేసిన తరవాత రోడ్డునపడ్డ వాడికి ఏమేం చెప్తావో నువ్వు చెప్తూనే వుండు. గడ్డి శుభ్రంగా తొలగిపోయిన తెల్లచారల దారో, మనుషుల్నీ, వీధుల్నీ, బతుకుల్నీ చదును చేసి రాజ్యం సాఫీగా అందంగా కట్టుకున్న రోడ్డో, ఫ్లై వోవరో, ఆదివాసీల గుండెల్ని చీల్చుతూ సర్కారీ బండ్లు చెక్కుకున్న మెటల్‌ రహదారులో- నువ్వు ఏ దారి గురించి కలగన్నా దాన్ని ధ్వంసం చేస్తూ వెళ్లిపోయే రెండు విచిత్రమైన నేత్రాలున్న వాణ్ని నేను. ఆ అనార్కలీ నేత్రాల్ని సిమెంటుతోనో, మేకుల్తోనో కప్పేేస చేతులింకా పుట్టనే లేదు జహాపనా! 


2 దూరంగా యెక్కడో విసిరేసిన డిన్నర్‌ టేబుల్‌ ముందు కూర్చొని, పళ్ళెంలో అన్నం మెతుకుల్నిండా శిలువల్ని ఈడ్చుకొస్తున్న క్రీస్తుల్ని చూస్తూ వుంటున్నా ఈ కాసిని రోజులుగా- యెన్ని కడుపుల్లో ఈ మెతుకులు మేకులై దిగబడుతున్నాయో నాకు తెలీదు గానీ, వొళ్ళంతా హూనమయిన దేహాల రాస్తారోకోలు నడుస్తున్నాయ్‌ లోపలి నరాల్లో! పొట్టు వొలిచీ వొలిచీ తింటున్న గింజల అస్థిపంజరాలు వేలాడుతున్నాయ్‌ మూసుకున్న కలల నిండా, తెరచుకున్న కళ్ల నిండా- 


3 యేం చేయాలో తెలీదురా అని పగలూ రాత్రీ వొక్కటే ప్రశ్న ముందు శరీరాల్ని ప్రశ్న గుత్తుల్లా నిలబెట్టే అమ్మా నాన్న గుర్తొస్తే నిన్ను యెట్లా క్షమించుకోవాలో నీకు తెలీదు. తెలీదు. తేలదు. తేలదు. యెవరు యెవరి మాఫీలూ అడగడం లేదు యిక్కడ యీ కాలంలో. మరచిపోవడం అనే కనికట్టు విద్యలో అందరికందరమూ మాస్టరీ సాధించేసి, శిఖరాలెక్కి వున్నాం కాబట్టి- 


4  యే లెక్కా యెవరూ అడగరు, యెటూ తేలనే తేలదుగా! కళ్లని చివరాగ్గా సాగదీసి చూస్తూనే వుండమని ఛానెళ్లు కీచుమని అరవ్వు. రాత్రిళ్ళు యెవరి వొంటినీ పాపాల సర్పాలు చుట్టిముట్టి నాగబంధనాలవ్వవ్‌. తలకిందులు స్వర్గనరకాల వాకిట్లో యిదిగో యిదిగో యిట్లా కాసింత అపనమ్మకాల భక్తిగీతాలు పాడుకుంటూ వెళ్లిపోయే నీకూ నాకూ శవాలు దైవప్రసాదాలు కాదా!?!


5  కాదా!! కాదా!!

అఫ్సర్‌

Updated Date - 2021-03-15T09:29:18+05:30 IST