అతడు భయపడిందే జరిగింది.. అగ్నిమాపక అధికారి ఇంట విషాదం..

ABN , First Publish Date - 2022-08-08T15:46:31+05:30 IST

అమెరికాలోని పెన్సిల్‌వేనియాలో అగ్నిమాపక దళ సభ్యుడిగా పనిచేస్తున్నారు హరోల్డ్‌ బేకర్‌. శుక్రవారం ఉదయం డూయీ వీధిలో ఒక ఇల్లు కాలిపోతోందన్న సమాచారం రావడంతో తన సిబ్బందితో కలిసి ఆ వీధికి చేరుకున్నారు. వీధి చివరకు వచ్చేసరికే అది

అతడు భయపడిందే జరిగింది.. అగ్నిమాపక అధికారి ఇంట విషాదం..

ఆహుతైనవారిలో కన్నబిడ్డలు కూడా!

హారిస్‌బర్గ్‌, ఆగస్టు 7: అమెరికాలోని పెన్సిల్‌వేనియాలో అగ్నిమాపక దళ సభ్యుడిగా పనిచేస్తున్నారు హరోల్డ్‌ బేకర్‌. శుక్రవారం ఉదయం డూయీ వీధిలో ఒక ఇల్లు కాలిపోతోందన్న సమాచారం రావడంతో తన సిబ్బందితో కలిసి ఆ వీధికి చేరుకున్నారు. వీధి చివరకు వచ్చేసరికే అది తన బావమరిది ఇల్లు అని బేకర్‌ గుర్తించారు. అంతేకాక, తన బిడ్డలిద్దరూ తమ మావయ్యను చూసేందుకు ఆరోజు అక్కడికే రావడంతో అతడి మనసు కీడు శంకించింది. తీరా అగ్నిమాపక వాహనం ఆ ఇంటి వద్దకు చేరుకునేసరికి అతడు భయపడిందే జరిగింది. మొత్తం 10మంది అగ్నికి ఆహుతయ్యారు. అందరూ బేకర్‌ సంబంధీకులే. 


అతడి కుమారుడు, కుమార్తె, మావయ్య, బావమరిది, మరదలు, ముగ్గురు మనవలు, మరో ఇద్దరు సంబంధీకులు మృతుల్లో ఉన్నారు. మొత్తంగా ఏడుగురు పెద్దవారు, ముగ్గురు చిన్నపిల్లలు ప్రమాదంలో కన్నుమూశారని అధికారులు ప్రకటించారు. మృతుల్లో ఉన్న బేకర్‌ తనయుడు డేల్‌ సైతం అగ్నిమాపక సంస్థలోనే పనిచేస్తుండటం గమనార్హం. ఘటన పట్ల పెన్సిల్‌వేనియా గవర్నర్‌ టామ్‌ వోల్ఫ్‌ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ట్విటర్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. బిడ్డలు సహా ఆత్మీయులైన 10మందిని కోల్పోవడం పట్ల బేకర్‌ రోదించడం, చూపరులను కలచివేసిందని స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి.


Updated Date - 2022-08-08T15:46:31+05:30 IST