బూడిదైన హెరిటేజ్‌ భవనం

ABN , First Publish Date - 2022-01-17T15:40:34+05:30 IST

సికింద్రాబాద్‌ క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం జరిగింది. రూ.2 కోట్ల విలువైన మద్యం కాలిపోయినట్లు సమాచారం. అయితే, క్లబ్‌లో లెక్కకు

బూడిదైన హెరిటేజ్‌ భవనం

అలనాటి వైభవానికి ప్రతీక 

వర్షం కురుస్తుండగానే మంటలు 


హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌ క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం జరిగింది. రూ.2 కోట్ల విలువైన మద్యం కాలిపోయినట్లు సమాచారం. అయితే, క్లబ్‌లో లెక్కకు మించి మద్యం ఎందుకుందనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. 


నిమిషాల్లో మంటలు

హెరిటేజ్‌ భవన నిర్మాణంలో అప్పట్లో టేకు, ఇతర ఉడ్‌లతో నిర్మించారు. వీటికి మంటలు అంటుకోవడంతో నిమిషాల్లోనే ఆ ప్రాంతమంతా విస్తరించినట్లు భావిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతుండటం.. కాలిపోయిన కర్ర, చెక్కలు కిందపడుతుండటంతో మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సుమారు మూడు గంటలపాటు కష్టపడి ఏడు ఫైరింజన్లతో ఆదివారం ఉదయం ఆరుగంటలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.


తీవ్రతను దాచే యత్నం 

సికింద్రాబాద్‌ క్లబ్‌లో రెండు వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. క్లబ్‌ మూసి ఉన్నప్పటికీ, మద్యం తాగేందుకు వీలుగా హెరిటేజ్‌ భవనం తెరిచి ఉంటుందని, అప్పుడప్పుడు సభ్యులు వస్తుంటారని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. క్లబ్‌ విషయాలు ఎవరికీ చెప్పకుండా క్లబ్‌ అధ్యక్షుడు రఘురామిరెడ్డి ప్రయత్నించడం కనిపించింది.  క్లబ్‌పై ఎలాంటి చర్చ పెట్టవద్దని, మీడియాకు ఎలాంటి విషయాలను వెల్లడించవద్దని ఆయన చెప్పడం గమనార్హం. ప్రమాదంలో రూ. 2కోట్ల విలువైన మద్యంతో పాటు మరో రూ. 2కోట్ల వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నట్లు సికింద్రాబాద్‌ అగ్నిమాపకశాఖాధికారి మోహన్‌రావు మీడియాకు తెలిపారు.


సెలవుతో తప్పిన ప్రమాదం..  

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆదివారం సికింద్రాబాద్‌ క్లబ్‌ను మూసివేశారు. కరోనా కారణంగా కూడా రెండు వారాలుగా ఎలాంటి ఈవెంట్లు నిర్వహించడం లేదు. క్లబ్‌లో సుమారు 400 మంది వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. ఇందులో 300 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు. శనివారం రాత్రి విధుల్లో కేవలం సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉన్నారు. క్లబ్‌లో పెట్రోల్‌ బంక్‌ ఉన్నప్పటికీ మంటలు ఆ వైపు వ్యాపించలేదు. ఒకవేళ మంటలు పెట్రోల్‌ బంక్‌కు వ్యాపించి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. 


ఓ వైపు వర్షం.. మరో వైపు మంటలు

వర్షం కురుస్తున్నా.. క్లబ్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే నార్త్‌జోన్‌ పరిధిలోని దాదాపు వంద మందికి పైగా హోంగార్డులు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బం ది, నార్త్‌జోన్‌ ఏసీపీలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 


పాత భవనాల్లో తీగలెంత భద్రం?

నగరంలో పురాతన కట్టడాలు.. బహుళ అంతస్తుల భవనాల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ ప్రమాదాలకు షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని చెబుతున్నారు. పాత భవనాల్లో విద్యుత్‌ తీగల పరిస్థితిని అధికారులు పట్టించుకోవడం లేదు. కొత్తగా కట్టే బహుళ అంతస్తుల భవనాల్లో విద్యుత్‌ తీగల నాణ్యత, స్విచ్‌బోర్డులు, వైరింగ్‌ ఇలా ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండగా, పైపై తనిఖీలు చేస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 50 ఫీట్లకు పైగా ఉండే బహుళ అంతస్తులు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు హెచ్‌టీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు సీఈఐజీ (చీఫ్‌ ఎలక్ర్టికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ జనరల్‌) అప్రూవల్‌ చేసిన సర్టిఫికెట్‌ తప్పనిసరి తీసుకోవాలి. గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో సీఎ న్‌జీ సర్టిఫికెట్లు లేకుండా విద్యుత్‌కనెక్షన్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీఈఐజీ, టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాలకు కారణమని కొందరు రిటైర్డ్‌ ఎలక్ర్టిసిటీ అధికారులు అంటున్నారు.  


హెరిటేజ్‌ భవనాల బాధ్యత ప్రభుత్వానిదే.. 

సికింద్రాబాద్‌ క్లబ్‌లోని హెరిటేజ్‌ భవనం షార్ట్‌సర్క్యూట్‌లో కాలిపోవడం బాధాకరం అని మాజీ ఎంపీ వీహెచ్‌ పేర్కొన్నారు. నగరంలోని హెరిటేజ్‌ భవనాలకు పూర్తి, శాశ్వత మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.


కారణాలను తెలుసుకున్న సాయన్న

ఎమ్యెల్యే సాయన్న సంఘటనా స్థలానికి వచ్చి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే కుమార్తె నివేదిత ఉన్నారు.


గతంలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే..

 గత సంవత్సరం జూన్‌ 13న నిజాం క్లబ్‌లో అడ్మినిస్ట్రేషన్‌ చాంబర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఫర్నిచర్‌తోపాటుగా విలువైన కంప్యూటర్‌లు, ఇతర సామగ్రి బూడిదైంది. 

 గత ఏడాది జనవరి 9న హైకోర్టు ప్రాంగణంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. అలాగే జూబ్లీహాల్‌లో కూడా 2-3 సంవత్సరాల క్రితం అగ్ని ప్రమాదం జరిగి నష్టం వాటిల్లింది.

 సికింద్రాబాద్‌ క్లబ్‌లో జరిగిన ప్రమాదం నగరంలోని హెరిటేజ్‌ కట్టడాలలో జరిగిన భారీ ప్రమాదంగా పేర్కొంటున్నారు. నిజాం క్లబ్‌, సికింద్రాబాద్‌ క్లబ్‌ రెండింటిలోనూ ఆదివారం నాడే ప్రమాదాలు జరగడం గమనార్హం.

Updated Date - 2022-01-17T15:40:34+05:30 IST