అగ్ని ప్రమాదంలో చిన్నారి సజీవ దహనం

ABN , First Publish Date - 2022-05-27T05:58:08+05:30 IST

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి బాలుడు తమ కళ్లెదుటే మంటల్లో కాలిపోతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు ఆగినంత పనైంది. కన్నవారు కాపాడేలోపే అగ్నికీలలు అభంశుభం తెలియని ఆ బాలుడిని ఆవహించి అనంత లోకాలకు తీసుకువెళ్లాయి.

అగ్ని ప్రమాదంలో చిన్నారి సజీవ దహనం
పూర్తిగా దగ్ధమై న ఇల్లు

పూరింటిపై తెగిపడిన విద్యుత్‌ తీగలు

సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో బాధితులు

నరసరావుపేట రూరల్‌, మే 26 : అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి బాలుడు తమ కళ్లెదుటే మంటల్లో కాలిపోతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు ఆగినంత పనైంది. కన్నవారు కాపాడేలోపే అగ్నికీలలు అభంశుభం తెలియని ఆ బాలుడిని ఆవహించి అనంత లోకాలకు తీసుకువెళ్లాయి. కడుపుకోతతో ఆ తల్లిదండ్రులు పెట్టిన రోధనలతో  ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. పూరింటిపై విద్యుత్‌ తీగలు తెడిపడి అగ్ని ప్రమాదం సంభవించి ఘటనలో ఐదేళ్ల చిన్నారి సజీవ దహనమైన హృదయ విధార ఘటన మండలంలోని రావిపాడు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచే సుకుంది. స్థానికుల కథనం మేరకు గ్రామంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో నివశించే అనపర్తి కోటేశ్వరరావు, కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్నారు. సుమారు రాత్రి 12గంటల తర్వాత వారి పూరింటిపై నున్న విద్యుత్‌ తీగలు తెగిపడటంతో పైకప్పుకు మంటలు అంటుకు న్నాయి. ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు భయంతో ఎవరికివారు బయటకు పరుగులు తీశారు. ఆసమయంలో బాలుడు కిరణ్‌కుమార్‌ తమ వద్ద లేడనే విషయాన్ని గమనించి కాపాడాలని ప్రయత్నించేలోపే మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. బాలుడు అగ్నికి ఆహుతయ్యాడు. ప్రాణాలతో బయటపడిన వారిలో నెహేమియా, భూలక్ష్మీ, కరుణకుమారికు స్వల్ప గాయాలయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో కన్న కొడుకును, సర్వస్వాన్ని కోల్పోయి కట్టుబట్టలతో అనపర్తి కోటేశ్వరరావు దంపతులు, కుటుంబ సభ్యులు నిల్చున్నారు. వీరి స్వగ్రామం పమిడిపాడు కాగా 20 ఏళ్ళ కిందట జీవనోపాది కోసం రావిపాడు గ్రామానికి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించి రూ.50 వేలు ఆర్థికసాయం అందజేశారు. నరసరావు పేట టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, ఆర్‌డీవో శేషిరెడ్డి, తహీసీల్దారు ఆర్‌వీ రమణానాయక్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు కొంత ఆర్ధిక సాయం అందజేశారు.


Updated Date - 2022-05-27T05:58:08+05:30 IST