బాణసంచా కర్మాగారంలో పేలుడు

ABN , First Publish Date - 2022-06-24T13:27:25+05:30 IST

కడలూరు జిల్లా ఎం.పుదూర్‌ గ్రామంలోవున్న బాణసంచా తయారీ కర్మాగారంలో గురువారం సంభవించిన పేలుడు కారణంగా ముగ్గురు మృతిచెందగా, మరో

బాణసంచా కర్మాగారంలో పేలుడు

                         - ముగ్గురి మృతి, మరో ఇద్దరికి గాయాలు


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 23: కడలూరు జిల్లా ఎం.పుదూర్‌ గ్రామంలోవున్న బాణసంచా తయారీ కర్మాగారంలో గురువారం సంభవించిన పేలుడు కారణంగా ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. తారాజువ్వలు, రాకెట్లు తయారుచేసే కర్మాగారంలో పెరియకరైకాడుకు చెందిన చిత్ర (35), నెల్లికుప్పంకు చెందిన అంబిక (50), వసంత, మూలకుప్పంకు చెందిన సత్యరాజ్‌ (34) సహా మరొకరు పనిచేస్తున్నారు. ఉదయం వీరు రసాయనాల మిశ్రమం కలుపుతున్న సమయంలో హఠాత్తుగా పెద్దశబ్దంతో పేలి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు ఆర్పేలోపే చిత్ర, అంబిక, సత్యరాజ్‌లు ఘటనా స్థలంలోనే సజీవదహనం కాగా, తీవ్రంగా గాయపడిన వసంత, మరొకరిని రక్షించి కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్ధికసాయం: సీఎం

కడలూరు జిల్లా ఎం.పుదూర్‌లో సంభవించిన బాణసంచా ప్రమాదంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సచివాలయం విడుదల చేసిన ప్రకటనలో, ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపడంతో పాటు తలా రూ.3 లక్షల ఆర్ధికసాయం అందజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం వైద్యులు, అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-06-24T13:27:25+05:30 IST