నీళ్ల శాఖలో నిప్పు!

ABN , First Publish Date - 2022-05-29T08:35:13+05:30 IST

నీటిపారుదల శాఖలో ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌ఫ (ఈఎన్‌సీ-జనరల్‌) పోస్టు కోసం పోరు తారస్థాయికి చేరింది.

నీళ్ల శాఖలో నిప్పు!

ఈఎన్‌సీ మురళీధర్‌రావు పదవికి రాజీనామా చేశారంటూ ప్రచారం

కేఆర్‌ఎంబీలో వ్యతిరేక ఫలితాల వల్లే..

సీఎం కేసీఆర్‌ మందలించారంటూ 

కథనాలు రావడమే నేపథ్యం

కేసు పెడతానని ఈఎన్‌సీ హెచ్చరిక

ప్రచారం వెనక ఓ అధికారి?


గౌరవంగా వైదొలిగే యోచనలో ఈఎన్‌సీ

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖలో ఇంజనీర్‌-ఇన్‌-చీ్‌ఫ (ఈఎన్‌సీ-జనరల్‌) పోస్టు కోసం పోరు తారస్థాయికి చేరింది. దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలు ఆ శాఖలో అధికారులను రెండు వర్గాలుగా చీల్చాయి. ఈఎన్‌సీ (జనరల్‌) పదవికి సి.ముర ళీధర్‌రావు రాజీనామా చేశారని శుక్రవారం రాత్రి పలు ప్రసార మాధ్యమాల్లో కథనాలు ప్రసారమయ్యాయి. దాంతో, అలాంటిదేమీ లేదని, ఎవరో కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెనువెంటనే మురళీధర్‌ రావు ఖండించారు.


ప్రచారాన్ని కొనసాగిస్తే పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా పెడతానని హెచ్చరించారు. నిజానికి, ప్రస్తుత ఈఎన్‌సీ (జనరల్‌) మురళీధర్‌రావు 2011లో పదవీ విరమణ చేశారు. అధికార పార్టీ నేతల సామాజిక వర్గం కావడం, వ్యూహాలు అమలు చేయడంలో దిట్టగా పేరుండడంతో అప్పటి నుంచీ ప్రభుత్వం ఆయన సేవలను కొనసాగిస్తూ వస్తోంది. దాంతో, ఈఎన్‌సీ పదవిపై ఎప్పటి నుంచో కన్నేసిన కొందరు.. మురళీధర్‌రావు సీటు కిందికి నీళ్లు తెచ్చేందుకు పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఆయన కూడా గౌరవప్రదంగా శాఖ నుంచి నిష్క్రమించాలనే యోచనలో ఉన్నారని సమాచారం.


రేసులో ఒకే ఒక్కడు

ఈఎన్‌సీ జనరల్‌ రేసులో ఒకే ఒక్కడు ఉన్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా ప్రచారం వెనక ప్రధానంగా ఆయనే ఉన్నారని మురళీధర్‌రావు కూడా అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. తెలంగాణ సర్కారు నిర్మించిన కీలక ప్రాజెక్టు కార్యరూపం దాల్చడంలో కీలక భూమిక పోషించిన ఆయనే తదుపరి ఈఎన్‌సీ (జనరల్‌) రేసులో ఉంటారని అధికారులు చెబుతున్నారు. నేడో రేపో మురళీధర్‌రావును సీఎం కేసీఆర్‌ సాగనంపనున్నారని, ఇక తానే తదుపరి ఈఎన్‌సీ (జనరల్‌) అని గత కొన్నేళ్లుగా ఆయన చేసుకుంటున్న ప్రచారం ఆ నోటా ఈ నోటా పడి ఉన్నతస్థాయికి చేరుకుంది. రానున్న ఎన్నికల్లో పూర్వ వరంగల్‌ జిల్లాలోని గిరిజన నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరఫున ఆయన బరిలోకి దిగుతారని కూడా ప్రచారం జరుగుతోంది. సీఎం వీర విధేయుడిగానూ ఆయనకు పేరుంది. దాంతో, తదుపరి ఈఎన్‌సీ రేసులో ఆయన ఉన్నప్పటికీ ఎప్పట్లోగా ఈ వ్యవహారం కార్యరూపం దాల్చుతుందో వేచిచూడాల్సిందే.

Updated Date - 2022-05-29T08:35:13+05:30 IST