డ్రెయిన్ల అధ్వానంపై ధ్వజం

ABN , First Publish Date - 2022-05-24T06:29:47+05:30 IST

డ్రెయిన్ల అధ్వానంపై ధ్వజం

డ్రెయిన్ల అధ్వానంపై ధ్వజం
డ్రెయిన్ల సమస్యను వివరిస్తున్న మహిళ

ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ భాగ్యలక్ష్మిని నిలదీసిన 43వ డివిజన్‌వాసులు



భవానీపురం, మే 23 : డ్రెయిన్లలో సిల్టుతీత సరిగ్గా లేదని 43వ డివిజన్‌లోని ప్రజలు పెద్ద ఎత్తున మాజీమంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును నిలదీశారు. నూతన పైపులైన్ల కోసం అడ్డదిడ్డంగా రోడ్లు తవ్వేసి వదిలేశారని, పనులు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఇదేమిటంటూ ఈఈ నారాయణమూర్తిని వెలంపల్లి ప్రశ్నించగా, తవ్విన సంగతి తనకు తెలియదని, పరిశీలిస్తానన్నారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం సోమవారం ఊర్మిళానగర్‌ ఆటోస్టాండ్‌ నుంచి ప్రారంభమైంది. అంతర్గత, ప్రధాన డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయని, దోమలు, పందుల బెడదతో అతలాకుతలం అవుతున్నామని ప్రజలు ఫిర్యాదు చేయగా, ఈ మాత్రం కూడా చూసుకోకపోతే ఎలా అంటూ కార్పొరేటర్‌ బాపతి కోటిరెడ్డిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పైడి కుసుమాంబ మాట్లాడుతూ ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు పట్టా రాలేదని ఫిర్యాదు చేయగా, వివరాలు రాసుకోవాలని ఎమ్మెల్యే సచివాలయ సిబ్బందికి సూచించారు. డ్రెయిన్లలో పూడికతీత, దోమల నివారణ చర్యలు చేపట్టకపోవడంపై ఏఎంహెచ్‌వో ఇక్బాల్‌ హుస్సేన్‌ను మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. యుద్ధప్రాతిపదికన ఫాగింగ్‌ చేయాలని ఆదేశించారు. ఊర్మిళానగర్‌ నాల్గో రోడ్డులో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంభం తీయకపోవడంపై స్థానికులు ప్రశ్నించారు. ఈ స్తంభం వేరేచోట వేస్తే అక్కడి ఇంటివారు ఒప్పుకోరని ఏఈ రామలింగేశ్వరరావు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి మాజీ చైర్మన్‌ పైలా సోమినాయుడు, వైసీపీ డివిజన్‌ అధ్యక్షుడు కంది శ్రీనివాసరెడ్డి, మాదాల తిరుపతిరావు, మాగం ఆత్మారామ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T06:29:47+05:30 IST