నిప్పు కణిక

ABN , First Publish Date - 2022-08-10T04:51:07+05:30 IST

చరిత్రలో నమోదు కాని తొలితరం రేనాటి వీరుడు..

నిప్పు కణిక
వడ్డె ఓబన్న

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు
తెల్లదొరలను ఎదురొడ్డి నిలిచిన ధీశాలి
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కుడి భుజం
దేశం కోసం ప్రాణాలు వదిలిన సైన్యాధిపతి
చరిత్రలో నమోదుకాని సాహసి వడ్డె ఓబన్న


చరిత్రలో నమోదు కాని  తొలితరం రేనాటి వీరుడు.. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన వలస వ్యతిరేక పోరాటంలో  సైన్యాధిపతి.. బ్రిటీష్‌ పాలకులకు వెన్ను చూపని ధీశాలి..  ఆయన ప్రస్థానం అనిర్వచనీయం. ‘నీ ప్రాధాన్యం ఏమిట‘ని బ్రిటీష్‌ పాలకులు  ప్రశ్నిస్తే - ‘మాతృదేశమే నా ఊపిరి,  బానిస బతుకు నుంచి  ప్రజలకు విముక్తి కల్పించడమే నా ప్రధాన కర్తవ్యం,  అందు కోసం ప్రాణాలను తృణ ప్రాయంగా వదులుతాన’ని చెప్పిన గొప్ప పరాక్రమశాలి. తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నిప్పు కణిక. కానీ దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఆయనకు తగిన గుర్తింపు దక్కలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాయకత్వంలో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా సాగిన రేనాటి ప్రజా పోరాటంలో ఆయన పేరు కనీసంగా ప్రస్తావించరు. ఆయనే వడ్డె ఓబన్న. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనపై ఆంధ్రజ్యోతి  ప్రత్యేక కథనం..

బనగానపల్లె, ఆగస్టు 9: ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాశారు. కానీ కొందరి పేర్లే చరిత్రకెక్కా యి. మరెందరో నాయకులు ఈ పోరాటంలో భాగస్వా ములై కీలంగా పని చేసినా వారి పేర్లు మాత్రం చరిత్రలో కనుమరుగ య్యాయి. అలాంటి కనుమరుగైన వారిలో మరో ఆణిముత్యం వడ్డె ఓబన్న. నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం మండలం నొస్సం గ్రామానికి చెందిన ఈయన బ్రిటీష్‌ పాలకులకు ఎదురొడ్డి పోరాడారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డికి అండదండలుగా ఉండి సైన్యాన్ని ముందుకు నడిపించారు. నరసింహా రెడ్డికి అంగరక్షకులుగా ఉండేవారు. ఓబన్ననే లేకుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం అంత ప్రాము ఖ్యతనే ఉండేది కాదని కొందరి వాదన. భగత్‌సింగ్‌ పేరు తలచుకోగానే చంద్ర శేఖర్‌ ఆజాద్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ గుర్తుకు వస్తారు. అల్లూరు సీతారా మారాజును తలచుకోగానే మల్లుదొర, గంటం దొర గుర్తుకొస్తారు. అలాగే ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి పేరు తలచుకోగానే వడ్డె ఓబన్న, గోసాయి వెంకన్నల పేర్లు గుర్తుకు వస్తాయి.

సైన్యాధిపతిగా విశేష సేవలు..

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈస్టిండి యా కంపెనీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా లేవదీసిన తిరుగు బాటులో వడ్డె ఓబన్న కీలక పాత్ర పోషించాడు. నరసింహారెడ్డి సైన్యాలను యుద్ధంలో నడిపిన సేనాని ఆయన.    నరసింహారెడ్డి సైన్యం 1846లో జూలై 10న కోవెలకుంట్ల సబ్‌ ట్రెజరీపై దాడి చేసింది. అప్పటి నుంచి అదే ఏడాది అక్టోబరు 6 వరకు బ్రిటీష్‌ పాలకులతో నరసింహారెడ్డి సైన్యం యుద్ధం సాగించింది. మూడోసారి జరిగిన యుద్ధంలో వడ్డె ఓబన్నను బ్రిటీష్‌వారు చంపి వేశారు. సంజామల మండలం  గిద్దలూరు  గ్రామ సమీపంలోని జగన్నాథకొండ వద్ద జరిగిన యుద్ధంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఓబన్న  బ్రిటిష్‌ లెఫ్ట్‌నెంట్‌ వాట్సన్‌, కెప్టెన్‌ రసూల్‌ సైన్యాలను ఎదుర్కొన్నారు. రెండు సేనలకు  మధ్య యుద్ధం హోరాహోరీగా సాగింది. బ్రిటీష్‌ సైన్యాలను ఓబన్న సాహసోపేతంగా ప్రతిఘటించాడు. అదే యుద్ధంలోనే బ్రిటీష్‌ సైన్యం చేతిలో ఓబన్న మృతి చెందాడు.  వడ్డె ఓబన్న మరణించగానే నరసిం హారెడ్డిని బ్రిటీష్‌ ప్రభుత్వం యుద్ధంలో బంధించి కోవెలకుంట్లలో ఉరి తీసింది.

వడ్డె ఓబన్న చరిత్ర

నంద్యాల జిల్లా సంజా మల మండ లం నొస్సం గ్రామానికి చెందిన సుబ్బన్న, సుబ్బమ్మల కుమారుడు వడ్డె ఓబన్న. ఈయన 1807వ సంవత్సరం జనవరి 11వ తేదీన జన్మించారు. స్వాతంత్య్ర పోరాటంలో అక్టోబరు 6వ తేదీన 1846లో అసువులు బాశారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మొదలు కాకముందే దక్షిణాదిన ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రథమ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన ఉద్యమాన్ని అసాధారణ ధైర్యసాహసాలతో ముందుకు తీసుకుపోయిన వీరుడు వడ్డె ఓబన్న. ఉయ్యాలవాడ నరసింహారెడ్డితొమ్మిది వేల మంది సైనికులను తయారు చేసుకున్నారు. వారంతా వడ్డెరులు, యానాదులు, బోయలు, చెంచులు, పట్ర కులాలకు చెందినవారు.

6వ తరగతి పాఠ్య పుస్తకంలో..

ప్రస్తుత 6వ తరగతి పాఠ్య పుస్తకంలో వడ్డె ఓబన్నను పోరాట పటిమను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మన మహనీయులు అనే పాఠంలో ఆయన బ్రిటీష్‌ పాలకులపై ఎలా పోరాడారో వివరించారు. దేశం కోసం ఆయన చేసిన పోరాటాన్ని విద్యార్థులకు తెలియజేసేలా ఆ పాఠం ఉంది.

ఇద్దరూ బాల్య స్నేహితులు

ఉయ్యలవాడ నరసింహారెడ్డి, ఓబన్న బాల్య స్నేహితు లు. నరసింహారెడ్డి తాత చెంచుమళ్ల జయరామిరెడ్డిది నొస్సం గ్రామం. ఓబన్న తండ్రి సుబ్బన్న నొస్సం గ్రామ తలారీగా ఉండేవారు. ఆ విధంగా నరసింహారెడ్డి, వడ్డె ఓబన్న  స్నేహితుల య్యారు. చిన్నతనం నుంచే ఇరువురు బ్రిటీష్‌ పాలకుల వైఖరిపై ఆగ్రహంతో ఉండేవారు. ఇరువురిది ఎదిరించే తత్వం. కరువు కాటకాలతో పంటలు పండకపోయినా బ్రిటీష్‌ వారు బలవంతంగా శిస్తు వసూలు చేసేవారు. వస్తు మార్పిడికి విరుద్ధంగా డబ్బులు కట్టమనేవారు. నరసింహారెడ్డికి భరణం ఇవ్వలేదు.  తలారి వంశపారంపర్యం విధానం రద్దు చేశారు. ఇలాంటి అనేక  అంశాలు ఉయ్యలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటుకు కారణాలయ్యాయి. ఆ పోరాటంలో  ఓబన్న కీలక భాగస్వామి. ఆయన మంచి గెరిల్లా యోధుడు. గిద్దలూరు వద్ద బ్రిటీష్‌  వారితో జరిగిన యుద్ధంలో చివరకు ప్రాణాలు పణంగా పెట్టారు.

ఇప్పుడిప్పుడే ఆయనకు గుర్తింపు..

వడ్డె ఓబన్న పోరాటానికి ఇప్పుడిప్పుడే గుర్తింపు లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆజాదీకా అమృత్‌ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇలాంటి నాయకుల చరిత్రను వెలుగులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఇలాంటి వారిని గుర్తించే కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులోభాగంగానే నంద్యాల జిల్లా అధికారులు వడ్డె ఓబన్న చిత్ర పటాన్ని కలెక్టరేట్‌లో ప్రదర్శనకు పెట్టారు. ఆయన జీవిత గురించి విద్యార్థులకు తెలియజేస్తున్నారు.

ఓబన్నను స్మరించుకోవడం సంతోష దాయకం

బ్రిటీష్‌ పాలకులకు ఎదురొడ్డి పోరాడిన ఓబన్నను స్మరించుకోవడం సంతోషదాయకం. స్వాతంత్య్ర పోరాటంలో అశువులు బాసిన ఇలాంటి ధీరులు ఎందరో ఉన్నారు. వారి చరిత్రను వెలుగులోకి తేవాలి. ఆనాడు వారు చేసిన త్యాగాలను నేటి తరానికి అందుబాటులోకి తేవాలి. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా మరుగున పడిపోయిన నాయకులను సేవలను గుర్తించి వారికి సముచిత గౌరవం కల్పిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు.

- వడ్డె బాల నరసింహుడు, వడ్డె ఓబన్న 6వ తరం వారసుడు

Updated Date - 2022-08-10T04:51:07+05:30 IST