తొలిరోజు 113 ఉపసంహరణలు

ABN , First Publish Date - 2021-03-03T06:56:42+05:30 IST

జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికల్లో కీలకఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది.

తొలిరోజు 113 ఉపసంహరణలు
నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన వివిధ పార్టీ నాయకులు

ఒంగోలులో 11, మునిసిపాలిటీల్లో 102

10 వార్డులను ఏకగ్రీవంగా పొందిన వైసీపీ

నేటితో ముగియనున్న గడువు

ఒంగోలు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికల్లో కీలకఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజైన మంగళవారం 113మంది ఉపసంహరించుకోగా 10 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు ఆరు మునిసిపల్‌, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. వాటిలో మొత్తం 198 వార్డులు ఉండగా 1,468మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాగా మంగళవారం 113మంది ఉపసంహరించుకున్నారు. అందులో ఒంగోలు కార్పొరేషన్‌లో 11మంది ఉన్నారు. అలాగే ఆయా మున్సిపాలిటీల్లో చూస్తే అత్యధికంగా కనిగిరిలో 35మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా చీమకుర్తిలో 20, గిద్దలూరులో 18, మార్కాపురంలో 18, అద్దంకిలో 9, చీరాలలో ఇద్దరు ఉపసంహరించుకున్నారు. వారిలో పలు పార్టీల పేరుతో వేసిన వారు, స్వతంత్రులు కూడా ఉన్నారు. తొలిరోజు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం నాలుగు మున్సిపాలిటీల్లో 10వార్డులు ఏకగ్రీవం కాగా అన్నింటినీ వైసీపీ గెలుచుకుంది. అత్యధికంగా కనిగిరిలో ఐదు వార్డులు ఏకగ్రీవం కాగా గిద్దలూరులో 3, మార్కాపురంలో ఒకటి, చీమకుర్తిలో ఒకటి ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3గంటలతో గడువు ముగియనుంది. నామినేషన్‌ ఉపసంహరణల నేపథ్యంలో ఆయా పట్టణ సంస్థల కమిషనర్‌ కార్యాలయాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. 


Updated Date - 2021-03-03T06:56:42+05:30 IST