‘శ్రీనివాస సేతు’పై తొలి ప్రమాదం.. చిన్నగాయం కూడా కాలేదు..!

ABN , First Publish Date - 2022-03-20T12:27:48+05:30 IST

‘శ్రీనివాస సేతు’పై తొలి ప్రమాదం.. చిన్నగాయం కూడా కాలేదు..!

‘శ్రీనివాస సేతు’పై తొలి ప్రమాదం.. చిన్నగాయం కూడా కాలేదు..!

తిరుపతి : తిరుపతిలో నూతనంగా నిర్మించిన శ్రీనివాస సేతుపై తొలి ప్రమాదం జరిగింది. శనివారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఓ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి చిన్నపాటి గాయమవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈస్ట్‌ ఎస్‌ఐ ప్రకాష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీవారి దర్శనార్థం తమిళనాడుకు చెందిన భక్తులు కొందరు కారు (టీఎన్‌34 ఏబీ0256)లో తిరుపతికి వచ్చారు. అలాగే తమిళనాడుకే చెందిన ఇంకొందరు భక్తులు కూడా మరో కారు (టీఎన్‌19 ఏఏ0012)లో వచ్చారు. అలిపిరి వద్దకు చేరుకునేందుకు రెండు కార్లు శ్రీనివాసం వద్ద వారధిపైకి వెళ్లాయి. ఫ్లైఓవర్‌పై ఓ చోట చెక్కతో ఏర్పాటుచేసిన స్పీడ్‌బ్రేకర్‌ ఉండటంతో ముందు వెళ్తున్న కారు (టీఎన్‌34 ఏబీ0256) డ్రైవర్‌ వేగాన్ని తగ్గించారు. 


దీన్ని వెనుక వస్తుండిన కారు (టీఎన్‌19 ఏఏ0012) డ్రైవరు గమనించలేదు. దగ్గరకు వచ్చాక గమనించి.. పక్కకు తప్పించాలని చూశాడు. అయినా కారు వస్తున్న వేగానికి ముందున్న వాహనాన్ని ఓ పక్కగా ఢీకొని బోల్తా పడింది. ఆ సమయంలో ఈ ప్రమాదాన్ని చూసిన వారంతా బోల్తా పడిన కారులోని వారికి తీవ్ర నష్టమే జరిగి ఉందని భావించారు. కానీ వాహనంలోని ఓ భక్తుడికి చేతిపై చిన్నగా గీసుకుపోవడం తప్ప.. ఇంకెవరికీ ఎటువంటి గాయాలవలేదని ఈస్ట్‌ ఎస్‌ఐ తెలిపారు. పైగా రెండు వాహనాలకు చెందిన భక్తులెవరూ ఫిర్యాదు కూడా ఇవ్వలేదని, అందరూ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారని చెప్పారు. కాగా.. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా వారధి నిర్మాణ, నిర్వహణాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2022-03-20T12:27:48+05:30 IST