సంక్షేమానికి తొలి సారథి

ABN , First Publish Date - 2022-05-28T08:53:24+05:30 IST

సంక్షేమానికి తొలి సారథి

సంక్షేమానికి తొలి సారథి

పేదలకు కూడు.. గూడు.. గుడ్డ

రూ.2కే కిలో బియ్యం, జనతా వస్ర్తాలు

పక్కా ఇళ్లు ప్రారంభించింది ఎన్టీఆరే

మహిళలకు ఆస్తి హక్కు.. మండల వ్యవస్థ ఏర్పాటు

పరిషత్‌ చైర్మన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు

పేద పిల్లలకు ఉచిత పుస్తకాలు, దుస్తులు

వ్యవసాయ మోటార్లకు స్లాబ్‌రేటు పద్ధతి

మండల వ్యవస్థతో ప్రజలకు చేరువైన ప్రభుత్వం

పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దుతో సంచలనం


(అమరావ తి-ఆంధ్రజ్యోతి)

పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే ఘన విజయం సాధించారు.  ఇందిరాగాంధీనే గడగడలాడించారు. గవర్నర్‌ వ్యవస్థను ఉపయోగించి తనను గద్దెదించినా... ప్రజా ఉద్యమంతో మళ్లీ పదవి సాధించారు. నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా జాతీయ రాజకీయాల్లో నాడే చక్రం తిప్పారు. ముఖ్యమంత్రిగా... పల్లెల్లో పాతుకుపోయిన పటేల్‌ పట్వారీ వ్యవస్థను ఒక్క కలంపోటుతో రద్దు చేసిన ఘనత! తాలూకాల స్థానంలో మండలాలను ఏర్పాటు చేసి... ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేర్చిన చరిత్ర! పాలనలో తిరుగులేని సంస్కరణలు చేసిన ఎన్టీఆర్‌... సంక్షేమానికీ సారథిగా నిలిచారు. పార్టీ పెట్టడం ఒక చరిత్ర! పాలన... ఒక ఘన చరిత్ర!


‘తొలిసారిగా ఎన్నికలకు వెళ్తున్నాం. మ్యానిఫెస్టోలో ఏం పెట్టాలి?’... దీనిపై రకరకాల చర్చలు! భారీగా ప్రతిపాదనలు! అన్నీ తీసుకెళ్లి ఎన్టీఆర్‌ ముందుంచారు నేతలు! ‘దారిద్య్రరేఖకు దిగువన మగ్గుతున్న బడుగుజీవులకు కూడు, గూడు, గుడ్డ కల్పించడం కన్నా ప్రజాస్వామ్యానికి పరమకర్తవ్యం మరొకటి లేదు’ అంటూ తమ అజెండాను సూటిగా చెప్పేశారు. ఎన్నికల్లో అఖండ విజయం సిద్ధించింది. తొలి మంత్రిమండలి సమావేశంలో... బడ్జెట్‌లో దేనికెంత కేటాయించాలన్న చర్చ. ‘మనం పేదోడికి పట్టెడన్నం పెట్టేందుకు కిలో బియ్యం రెండు రూపాయలకే ఇస్తామని చెప్పాం. పక్కా ఇళ్లు నిర్మించి నీడ కల్పిస్తామని చెప్పాం. పేదోడికి పంచె, ధోవతి ఇవ్వాలి. వీటికి ముందు డబ్బు కేటాయించి, మిగిలినవి మిగిలిన వాటికి కేటాయించండి’ అని ఉన్నతాధికారులకు ఎన్టీఆర్‌ స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో పెనుమార్పు తెచ్చిన, వారి జీవన ప్రమాణాలను పెంచిన విప్లవాత్మకమైన పథకాలకు అలా తనదైన శైలిలో ఎన్టీఆర్‌ రూపకల్పన చేయడమే కాదు, ఆచరణలోనూ పెట్టేశారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున 1.20 కోట్ల కుటుంబాలకు కిలోబియ్యం రెండు రూపాయలకే ఇచ్చారు. ఇక పక్కా ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది ఎన్టీఆర్‌తోనే. గృహనిర్మాణాల్లో దేశంలోనే తొలి స్థానంలో నాడు ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.  జనతా వస్ర్తాల పేరిట సగం ధరకు పంచలు, చీరలు అందించారు. 


బీసీలకు రిజర్వేషన్లు..

నేడు మనం చూస్తున్న మండలాలు ఎన్టీఆర్‌ ఆలోచనల్లోంచి ఏర్పడినవే. మండల, జిల్లా ప్రజాపరిషత్‌ చైర్మన్ల ఎన్నికల్లో తొలిసారి రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. మరోవైపు రైతులకు విద్యుత్‌ వినియోగంతో సంబంధం లేకుండా...అసలు ఎంత విద్యుత్‌ వాడుకున్నా ఇబ్బందిలేకుండా వ్యవసాయ మోటార్లకు స్లాబ్‌రేటు పద్ధతిని తీసుకొచ్చారు. అంటే ఒక హార్స్‌పవర్‌కు రూ.50 కడితే చాలు అన్న విధానం తెచ్చారు.  ఒకసారి ఎన్టీఆర్‌ మారుమూల ప్రాంతమైన సీతంపేట ఐటీడీఏ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొండపై ఉంటున్న గిరిజనులకు పాఠశాల ఉన్నా రెగ్యులర్‌ ఉపాధ్యాయులు వెళ్లడం లేదు. ప్రభుత్వమే ఎస్టీ వర్గానికి చెందినవారిని ఉపాధ్యాయులుగా నియమిస్తే ఈ సమస్య రాదని అప్పటికప్పుడు తేల్చారు. ‘అన్‌ట్రెయిన్డ్‌ టీచర్స్‌’ పేరుతో స్థానిక గిరిజనులను ఉపాధ్యాయులుగా నియమించారు. ఒక్కసారే ఎన్టీఆర్‌ 59 ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుకు తెరతీసి, వాటిని ఏర్పాటుచేశారు. పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, ట్రంకుపెట్టెలు ఉచితంగా అందించారు. మెస్‌ చార్జీలు, ఉపకార వేతనాలను భారీగా పెంచారు. 


వృద్ధాప్య పింఛన్లకు ఆనాడే శ్రీకారం

  వృద్ధాప్య పింఛన్ల పథకాన్ని ఎన్టీఆర్‌ ప్రారంభించారు. 1983-84లోనే నెలకు రూ.30 ఇచ్చారు. అంతేకాదు 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.30 చొప్పున పింఛను ఇచ్చే మరో పథకం, దివ్యాంగులు, వితంతువులకూ పింఛను పథకాలు పెట్టారు. 


స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రారంభం..

 1985 అక్టోబరు 10వ తేదీన స్ర్తీ ఆస్తిహక్కు చట్టాన్ని తెచ్చారు. స్ర్తీ విద్యావ్యాప్తికి తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. కులమతాలతో సంబంధం లేకుండా వితంతువులకు నెలకు రూ.50 ఫించను ఏర్పాటుచేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ 30శాతం మహిళలకే కేటాయించారు. జిల్లా, మండల ప్రజాపరిషత్తులలో 9శాతం చైర్మన్‌ పదవులు మహిళలకే రిజర్వు చేశారు. మహిళల సంక్షేమం కోసం 14 పథకాలు, అంశాల్లో కృషిచేశారు. స్ర్తీ, శిశుసంక్షేమ కార్యక్రమాలు సత్వరంగా, సక్రమంగా అమలు జరిపేందుకు మహిళాభ్యుదయ, శిశు సంక్షేమ శాఖను ఏర్పాటుచేశారు. 

Updated Date - 2022-05-28T08:53:24+05:30 IST