తొలిరోజు 65 మందికి

ABN , First Publish Date - 2021-01-17T05:58:26+05:30 IST

కొవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ను శనివారం జిల్లాలో మూడు సెంటర్లలో ప్రారంభించారు.

తొలిరోజు 65 మందికి
నంగునూరు ప్రభుత్వాస్పత్రిలో తొలి టీకా తీసుకుంటున్న పారిశుధ్య కార్మికుడు సంపత్‌

ప్రారంభమైన కొవిడ్‌–19 వ్యాక్సినేషన్‌

సిద్దిపేటలో 11 మందికి వ్యాక్సిన్‌

గజ్వేల్‌లో 25.. నంగునూరులో 29 మంది

వ్యాక్సిన్‌ తీసుకున్న వారంతా క్షేమం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జనవరి 16: కొవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ను శనివారం జిల్లాలో మూడు సెంటర్లలో ప్రారంభించారు. సిద్దిపేట, గజ్వేల్‌, నంగునూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా పంపిణీ చేశారు. ఇదివరకే ఎంపిక చేసిన లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ వేశారు.  సిద్దిపేట ప్రభుత్వ ఆసత్రిలో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి ప్రారంభించారు. తొలిరోజు వ్యాక్సిన్‌ తీసుకునే జాబితాలో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాల జనరల్‌ ఆస్పత్రి సిబ్బంది 30 మందిని చేర్చారు. వీరిలో వైద్యులు, వైద్య సిబ్బంది, కళాశాల భోధనా సిబ్బంది ఉన్నారు. కరోనా సమయంలో సేవలందించి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా వీరికి ప్రాధాన్యం కల్పించారు. జాబితాలో పేర్లున్న వారిలో 11 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 


గజ్వేల్‌లో పారిశుధ్య కార్మికురాలికి

గజ్వేల్‌ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రారంభించారు. తొలి వ్యాక్సిన్‌ను ఆస్పత్రిలో పనిచేసే పారిశుధ్య కార్మికురాలు కీర్తనకు ఇచ్చారు. ఆస్పత్రిలోని పలు విభాగాల్లో పనిచేసే 30 మందిని టీకా కోసం ఎంపిక చేయగా.. 25 మంది తీసుకున్నారు. ఇద్దరు అందుబాటులో లేకపోవడం, మరో ముగ్గురికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉన్నందున వ్యాక్సిన్‌ ఇవ్వలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఒక్కరికి మాత్రమే స్వల్ప తలనొప్పి రాగా.. మిగితా అందరు ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు లేకుండా క్షేమంగా ఉన్నారు.


నంగునూరులో సజావుగా..

నంగునూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వ్యాక్సినేషన్‌ సజావుగా సాగింది. ముందుగా నమోదు చేసిన 30 మందిలో ఒక్కరు మాత్రమే టీకా తీసుకోలేదు. ఓ అంగన్‌వాడీ టీచర్‌కు అస్తమా ఉన్నందున వైద్యులు టీకా వేయడానికి తిరస్కరించారు. మిగిలిన 29 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇందులో 12 మంది వైద్య సిబ్బంది, 15 మంది పారిశుధ్య సిబ్బంది, ఇద్దరు అంగన్‌వాడీ టీచర్లు, ఒక ఆశ కార్యకర్త ఉన్నారు. కార్యక్రమాన్ని వైద్యశాఖ ఏవో డాక్టర్‌ పవన్‌రెడ్డి, డాక్టర్లు రాధిక, రాజేశ్‌, మురళి పర్యవేక్షించారు. టీకా కేంద్రాన్ని ఎంపీపీ జాప అరుణాదేవి, జడ్పీటీసీ ఉమ, సర్పంచ్‌ మమత, ఎంపీటీసీ సునీత ప్రారంభించారు.

Updated Date - 2021-01-17T05:58:26+05:30 IST