
వ్యర్థాలను సక్రమంగా ఉపయోగించడాన్ని మీరు చూసేవుంటారు! అయితే ఉక్కు వ్యర్థాలను ఇంత అద్భుతంగా ఉపయోగించడాన్ని మీరు ఎక్కడా చూసివుండరు. దేశంలో ఉక్కు వ్యర్థాలతో అద్భుతమైన రహదారిని నిర్మించారు. చాలా సంవత్సరాల పరిశోధన తర్వాత శాస్త్రవేత్తలు సూరత్‌లోని ఏఎమ్‌ఎన్‌ఎస్ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు వ్యర్థాలను ప్రాసెస్ చేయడం ద్వారా బ్యాలస్ట్‌ను సిద్ధం చేశారు. దాని సాయంతో రహదారిని నిర్మించారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌లో ఉక్కు వ్యర్థాలతో దేశంలోనే తొలి ఉక్కు రహదారిని నిర్మించారు. దేశంలోని వివిధ ఉక్కు కర్మాగారాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు 19 మిలియన్ టన్నుల ఉక్కు వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఉక్కు కర్మాగారాల్లో ఈ వ్యర్థాల కొండలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ ఉక్కు వ్యర్థాలతో రోడ్లు వేయనున్నారు. ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాత సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఉక్కు వ్యర్థాలను ప్రాసెస్ చేసి బ్యాలస్ట్‌ను తయారు చేశారు. ఈ బ్యాలస్ట్తో గుజరాత్లో ఒక కిలోమీటరు మేర 6 లైన్ల రహదారిని సిద్ధం చేశారు. రానున్న కాలంలో దేశంలో నిర్మిస్తున్న హైవేలు కూడా ఈ ఉక్కు వ్యర్థాలతోనే తయారుకానున్నాయి. గుజరాత్‌లోని హజీరా ఓడరేవు వద్ద ఒక కిలోమీటరు పొడవైన ఈ రహదారి గతంలో అధ్వాన్న స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ రహదారి ఉక్కు వ్యర్థాలతో మంచి రోడ్డుగా మారింది. ఈ రోడ్డుపై ప్రస్తుతం ప్రతిరోజు 18 నుంచి 30 టన్నుల బరువుతో కూడిన 1000కు పైగా ట్రక్కులు ప్రయాణిస్తున్నాయి. అయినా రహదారిపై చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అయితే ఉక్కు వ్యర్థాలతో తయారైన రోడ్డు మందం 30 శాతం తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సీఆర్ఆర్ఐ తెలిపిన వివరాల ప్రకారం ఉక్కు వ్యర్థాలతో తయారైన ఈ రోడ్లు చాలా బలంగా ఉన్నాయి. నిర్మాణ ఖర్చు కూడా దాదాపు 30 శాతం మేరకు తగ్గుతుంది. ఒక అంచనా ప్రకారం 2030 నాటికి స్టీల్ ప్లాంట్ల నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ప్రతి సంవత్సరం 50 మిలియన్ టన్నులకు చేరుతాయి. ఇది పర్యావరణానికి ముప్పుగా పరిణమించనుంది. నీతి ఆయోగ్ సూచనల మేరకు, ఉక్కు మంత్రిత్వ శాఖ అటువంటి వ్యర్థాల వినియోగం కోసం ఒక ప్రాజెక్ట్‌ను రూపొందించింది.