వినూత్నం.. అద్భుతం.. చరిత్రలో మొదటిసారి Hyderabadలో ఇలా..

ABN , First Publish Date - 2022-03-11T15:13:46+05:30 IST

వినూత్నం.. అద్భుతం.. చరిత్రలో మొదటిసారి Hyderabadలో ఇలా..

వినూత్నం.. అద్భుతం.. చరిత్రలో మొదటిసారి Hyderabadలో ఇలా..

  • ఫ్లైఓవర్‌ నిర్మాణంలో స్టీల్‌ పోర్టల్‌ ఫ్రేమ్‌లు
  • ఎస్‌ఆర్‌డీపీలో ఇంజనీరింగ్‌ అద్భుతం
  • ఎంసీహెచ్‌, జీహెచ్‌ఎంసీ చరిత్రలో మొదటిసారి
  • గచ్చిబౌలి వద్ద వంతెన నిర్మాణంలో వినియోగం
  • ఒక్కో పోర్టల్‌ ఫ్రేమ్‌లో 130 టన్నుల స్టీల్‌
  • 20 శాతం ఖర్చు అధికం

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్‌డీపీ)లో మరో ఇంజనీరింగ్‌ అద్భుతం ఆవిష్కృతమవుతోంది. ఐటీ కారిడార్‌లోని  శిల్పా లే అవుట్‌ వద్ద పూర్వ ఎంసీహెచ్‌, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ చరిత్రలో మొదటి సారి వంతెన నిర్మాణం కోసం స్టీల్‌ పోర్టల్‌ ఫ్రేమ్‌లు వినియోగించనున్నారు. క్షేత్రస్థాయిలో స్థలం తక్కువగా ఉండడం, వాహనాల్లో ప్రీ కాస్ట్‌ గర్డర్లు, పియర్‌ క్యాప్‌లు తీసుకెళ్లేందుకు క్రేన్ల వాడకానికి అనువైన పరిస్థితులు లేకపోవడంతో బల్దియా ఇంజనీరింగ్‌ అధికారులు వినూత్న నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.


హైదరాబాద్‌ సిటీ : కొండాపూర్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు ఆరు లేన్లుగా, శిల్పా లే అవుట్‌ నుంచి గచ్చిబౌలి ఔటర్‌ వరకు నాలుగు లేన్లుగా రూ.330 కోట్లతో ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద ఇప్పటికే ఉన్న వంతెన మీదుగా (సెకండ్‌ లెవల్‌లో) ఈ రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణం జరుగుతోంది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ దాటిన అనంతరం శిల్పా లే అవుట్‌ నుంచి నిర్మించే వంతెన రెండుగా విడిపోతుంది. ఔటర్‌కు అనుసంధానంగా రెండు లేన్లతో అప్‌, డౌన్‌ ర్యాంప్‌లు నిర్మిస్తారు. శిల్పా లే అవుట్‌ నుంచి వెళ్లే వాహనాలు ఎడమ వైపు ర్యాంపు ద్వారా దిగి ఔటర్‌ ఎక్కుతాయి. ఔటర్‌ మీదుగా వచ్చిన వాహనాలు అప్‌ ర్యాంప్‌ ఎక్కి శిల్పా లే అవుట్‌ వద్ద దిగుతాయి.


ఏంటీ స్టీల్‌ పోర్టల్‌ ఫ్రేమ్‌లు..?

మెట్రో రైల్‌ కారిడార్‌ నిర్మాణమూ ప్రీ కాస్ట్‌ ఇంజనీరింగ్‌ విధానంలోనే జరిగింది. మెట్రో కారిడార్లలో మలుపుల వద్ద రెండు వైపులా పిల్లర్లు, మధ్యలో స్పాన్‌ కనిపిస్తుంది. దీనినే పోర్టల్‌ ఫ్రేమ్‌ అంటారు. మెట్రో కారిడార్‌లో కాంక్రీట్‌ పోర్టల్‌ ఫ్రేమ్‌లు వినియోగించగా ఎస్‌ఆర్‌డీపీలో మొదటిసారి కాంక్రీట్‌ వంతెనకు స్టీల్‌ పోర్టల్‌ ఫ్రేమ్‌లు వాడుతున్నారు. నాలుగు లేన్లుగా నిర్మించే శిల్ప లే అవుట్‌ వంతెనలో మూడు స్టీల్‌ పోర్టల్‌ ఫ్రేమ్‌లు రానున్నాయి. ఇందులో ఫౌండేషన్‌ కాంక్రీట్‌ కాగా, పిల్లర్‌, పియర్‌ క్యాప్‌లు స్టీల్‌లో ఉంటాయి. ఒక్కో ఫ్రేమ్‌ మధ్య దూరం 30మీటర్లు ఉంటుందని, స్పాన్‌, గర్డర్లు కూడా స్టీల్‌వే వినియోగించనున్నట్టు ఇంజనీరింగ్‌ విభాగం ఉన్నతాధికారొకరు తెలిపారు. కాంక్రీట్‌ ఫ్లై ఓవర్‌తో పోలిస్తే 20 శాతం ఎక్కువ ఖర్చవుతుందని, తప్పని పరిస్థితుల్లోనే స్టీల్‌ పోర్టల్‌ ఫ్రేమ్‌లు వాడుతున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో పోర్టల్‌ ఫ్రేమ్‌లో 130 టన్నుల స్టీల్‌ వినియోగించనున్నారు.


64 మీటర్ల స్పాన్‌..

ప్రతీ వంతెన నిర్మాణంలో స్పాన్‌ల మధ్య దూరం 30 మీటర్లు ఉండేలా ఇంజనీర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకుముందు నిర్మించిన ఫ్లై ఓవర్లలో స్పాన్‌ల మధ్య 10 మీటర్ల (30 అడుగులపైన) దూరం ఉంది. వాహనాల రాకపోకలు నిలిపివేయకుండా పనులు చేస్తూ జంక్షన్ల వద్ద 50మీటర్ల (150 అడుగుల పైన) స్పాన్‌లు ఏర్పాటు చేశారు. ఎస్‌ఆర్‌డీపీలో ఇప్పటి వరకు నిర్మించిన 14 వంతెనల్లో జంక్షన్ల వద్ద 50 మీటర్ల స్పాన్‌లు కనిపిస్తాయి. శిల్పా లే అవుట్‌ వద్ద మాత్రం 64 (దాదాపు 200 అడుగులు), 54 (170 అడుగులు) మీటర్ల వేర్వేరు స్పాన్‌లు ఇప్పటికే అమర్చారు. ఎస్‌ఆర్‌డీపీలో ఇంత పెద్ద స్పాన్‌ల వినియోగం గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద చేపడుతున్న వంతెనల నిర్మాణంలోనే జరిగింది. ఇది ఇంజనీరింగ్‌ అద్భుతమని నిపుణులు చెబుతున్నారు. 230 మీటర్ల మేర నిర్మించిన స్పాన్‌ ఏసియాలోనే మొదటిది కావడం గమనార్హం. ఈ వంతెనలు అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హైటెక్‌సిటీ- ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌లకు కనెక్టివిటీ పెరుగుతుంది.

Updated Date - 2022-03-11T15:13:46+05:30 IST