మృగశిర... నోరూర!

ABN , First Publish Date - 2020-06-06T05:30:00+05:30 IST

చేపల కూర ఎప్పుడో ఒకసారి రుచి చూస్తూనే ఉంటారు. కానీ మృగశిర కార్తే ప్రవేశించే రోజున తప్పనిసరిగా చేపను టేస్ట్‌ చేయాల్సిందే.

మృగశిర... నోరూర!

చేపల కూర ఎప్పుడో ఒకసారి రుచి చూస్తూనే ఉంటారు. కానీ మృగశిర కార్తే ప్రవేశించే రోజున 

తప్పనిసరిగా చేపను టేస్ట్‌ చేయాల్సిందే. 

బొమ్మిడాయిల పులుసు, వంజరం వేపుడు, కొర్రమీను కూరల పేరు చెబితే చాలు.. ఎవరికైనా నోరూరుతుంది.  మీరూ ఆ రుచులను ట్రై చేయండి.


వంజరం వేపుడు

కావలసినవి

వంజరం చేప - పావు కేజీ, కరివేపాకు - కొద్దిగా, నూనె - సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నిమ్మకాయ - ఒకటి, కారం - అర టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌.

తయారీ

ముందుగా చేపను శుభ్రం చేసుకోవాలి.

ఒక బౌల్‌లో అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, గరంమసాలా, కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించాలి.వ

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కరివేపాకు వేసి వేగించాలి.

తరువాత మసాలా పట్టించిన చేప ముక్కలు వేసి చిన్నమంటపై కాసేపు వేగనివ్వాలి.

కాసేపయ్యాక నెమ్మదిగా చేప ముక్కలు మరో వైపు తిప్పి మరికాసేపు ఫ్రై కానివ్వాలి.

చేప ముక్కలు రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక నిమ్మరసం పిండుకొని దించాలి.

వంజరం వేపుడు చపాతీలోకి లేదా అన్నంలోకి రుచిగా ఉంటుంది.


బొమ్మిడాయిల పులుసు

కావలసినవి

గోంగూర - రెండు కట్టలు, బొమ్మిడాయిలు - పావు కేజీ, ఉల్లిపాయ - ఒకటి, ఆవాలు - పావు టీస్పూన్‌, జీలకర్ర - పావు టీస్పూన్‌, మెంతులు - పావు టీస్పూన్‌, పచ్చిమిర్చి - నాలుగైదు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, గరం మసాలా - ఒక టీస్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా. 


తయారీ

గోంగూరను మిక్సీలో వేసి పేస్టు చేయాలి.

పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేగించాలి.

కాసేపు వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయలు వేయాలి. వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తగినంత ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి.

కాస్త వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. 

పసుపు, ధనియాల పొడి, తగినంత కారం, జీలకర్రపొడి, గరంమసాలా వేసి కలపాలి.

తరువాత కొద్దిగా నీళ్లు పోయాలి. ఉడుకుతున్న సమయంలో గోంగూర పేస్టు వేసి బాగా కలియబెట్టాలి.

ఇప్పుడు బొమ్మిడాయిల ముక్కలు వేసి చిన్నమంటపై ఉడికించాలి.

బొమ్మిడాయిలు ఉడికిన తరువాత వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


కొర్రమీను చేపల కూర

కావలసినవి

కొర్రమీను చేపలు - అరకేజీ, ధనియాల పొడి -  రెండు టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర టీస్పూన్‌, కారం- రెండు టీస్పూన్లు, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, మెంతిపొడి - అర టీస్పూన్‌, చింతపండు - యాభై గ్రాములు, నూనె - సరిపడా, కరివేపాకు - కొద్దిగా, 

కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ

ముందుగా చేపలను ఉప్పుతో బాగా శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

ఒక బౌల్‌లోకి చేప ముక్కలు తీసుకొని అందులో చింతపండు రసం, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి బాగా కలపాలి. కాసేపు వీటిని పక్కన పెడితే చేప ముక్కలకు మసాలా పట్టుకుంటుంది. 

ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి.

ఉల్లిపాయలు వేగాక ధనియాల పొడి వేయాలి. వెంటనే చేప ముక్కలు వేసి కలపాలి.

తరువాత కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి.

గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. కొర్రమీను ముక్కలు ఉడికిన 

తరువాత కొత్తిమీర వేసుకొని దించాలి. 


నేతిలి పకోడీ

కావలసినవి

నేతిలి(నెత్తళ్లు) చేపలు - అరకేజీ, పచ్చిమిర్చి - ఐదారు, నూనె - వేగించడానికి సరిపడా, కొత్తిమీర - ఒక కట్ట, పుదీనా - ఒక కట్ట, కరివేపాకు - కొద్దిగా, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, నిమ్మకాయలు - రెండు, మిరియాల పొడి - కొద్దిగా.


తయారీ

కొత్తిమీర, పుదీనా, కొన్ని పచ్చిమిర్చిని పేస్టులా చేసుకోవాలి. 

నేతిలి చేపలను శుభ్రం చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.

తరువాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్టు వేయాలి. 

కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, తగినంత ఉప్పు, జీలకర్రపొడి, ధనియాల పొడి వేసి, నిమ్మరసం పిండి బాగా కలపాలి.

ఇప్పుడు ఒక కప్పు సెనగపిండి, అరకప్పు బియ్యప్పిండి వేసి చేపలకు బాగా పట్టేలా కలపాలి. 

స్టవ్‌పై పాత్రపెట్టి నూనె పోసి బాగా వేడి అయ్యాక నేతిలి చేపల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నూనెలో వేగించాలి.

మిరియాల పొడి వేసుకొని సర్వ్‌ చేసుకుంటే నేతిలి చేపల పకోడీ టేస్టీగా ఉంటుంది.


జెల్లల పులుసు

కావలసినవి

జెల్లలు - ఒకకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, చింతపండు రసం - ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, మెంతిపొడి - అరటీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, జీలకర్ర - అరటీస్పూన్‌, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - రెండు, కొత్తిమీర - కొద్దిగా. కొబ్బరి తురుము - ఒక టేబుల్‌స్పూన్‌,  టొమాటో ప్యూరీ - ఒక కప్పు.


తయారీ

ఉల్లిపాయను మంటపై పెట్టి కాసేపు ఉడికించి, తరువాత మెత్తగా పేస్టు చేయాలి.

పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి.

పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్టు, పసుపు వేసి మరికాసేపు వేగించాలి.

తరువాత టొమాటో ప్యూరీ వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

ఇప్పుడు చింతపండు రసం పోయాలి. తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.

కారం, గరంమసాలా, మెంతిపొడి, కొబ్బరి తురుము, తగినంత ఉప్పు వేయాలి. 

మిశ్రమం ఉడుకుతున్న సమయంలో శుభ్రం చేసి పెట్టుకున్న జెల్లలు వేయాలి. 

మరో పదినిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-06-06T05:30:00+05:30 IST