ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు మోక్షమెన్నడో..?

ABN , First Publish Date - 2022-05-22T06:39:29+05:30 IST

జిల్లాలో రెండేళ్లుగా ప్రతిపాదనల దశ దాటని రాజయ్యపేట ఫిష్‌ ల్యాండిగ్‌ కేంద్రం ఏర్పాటుకు కదలిక వచ్చింది.

ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు మోక్షమెన్నడో..?
ఫిష్‌ల్యాండ్‌ సెంటర్‌కు అనువైన నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్ర తీరం

- రాజయ్యపేటలో ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

 - మొత్తం వ్యయం  రూ.24.77 కోట్లు 

- కేంద్ర ప్రభుత్వ వాటా విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

- రాష్ట్ర ప్రభుత్వ వాటాపైనే అనుమానాలు

(అనకాపల్లి, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రెండేళ్లుగా ప్రతిపాదనల దశ దాటని రాజయ్యపేట ఫిష్‌ ల్యాండిగ్‌ కేంద్రం ఏర్పాటుకు కదలిక వచ్చింది. సెంటర్‌ ఏర్పాటుకు తాజాగా కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో మత్స్యకారుల్లో ఆశలు చిగురించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదలపైనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కాగా ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉందని, ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించిన చెన్నైకి చెందిన ఐఐటీ నిపుణుల బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో రూ.24.77 కోట్ల అంచనా వ్యయంతో సెంటర్‌ ఏర్పాటుకు అనుమతి లభించింది. ఇందులో భాగంగా రెండు రోజుల కిందట స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, మత్స్యశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రం నుంచి సెంటర్‌ ఏర్పాటుకు ఆమోదం లభించినా, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ఉత్తర్వులు జారీ చేయకపోవడంపై అనుమానాలు మొలకెత్తుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న కారణంగా తన వాటా నిధుల కేటాయింపునకు రాష్ట్ర ఆర్థిక శాఖ సుముఖంగా లేదని సమాచారం.  

రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదలైతేనే...

ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.14.86 కోట్లను కేటాయించినా,  రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.9.91 కోట్లు కేటాయించేందుకు అంగీకరించాల్సి ఉంటుంది. సెంటర్‌ ఏర్పాటుకు అభ్యంతరం లేదని, తమ వాటా విడుదలకు కేంద్రం సిద్ధమైనా, రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదలపై స్పష్టత రాకపోవడంతో సెంటర్‌ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంటోంది. 

ఎదురు చూపులు ఇంకెన్నాళ్లు....

రాజయ్యపేటలో ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్‌ ఎప్పుడు ఏర్పాటువుతుందోనని ఈ ప్రాంత మత్స్యకారులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇది ఏర్పాటైతే చేపలవేటే ఆధారంగా జీవిస్తున్న రాజయ్యపేట, దొండవాడ, బోయపాడు, అమలాపురం పరిసర మత్స్యకార గ్రామాల్లోని సుమారు 5 వేలమందికి ప్రత్యక్షంగా, మరో 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. అంతేకాక గ్రామాల్లో మౌలిక వసతులు సమకూరనున్నాయి. ఒకేచోట మత్స్యకారులు చేపల ఆరబోతకు ఫ్లాట్‌ఫారాలు, మార్కెటింగ్‌, రవాణాకు అనువైన సిమెంట్‌ రహదారుల నిర్మాణాలు చేపడతారు. మత్స్యకారులు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, మరుగుదొడ్లు, వేలం కేంద్రాలు, చేపల నిల్వకు శీతలీకరణ గోదాములు అందుబాటులోకి వస్తాయి. రాజయ్యపేటకు సమీపంలో ఏడాది కిందటే ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్‌ కోసం రెవెన్యూ అధికారులు సుమారు ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, మత్స్యశాఖకు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పచ్చజెండా ఊపడంతో త్వరలోనే టెండర్లు పిలుస్తామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించామని మత్స్యశాఖ జిల్లా అధికారి లక్ష్మణరావు ’ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మరి ఈ ప్రతిపాదన ఎంతవరకు ఆచరణలోకి వస్తుందో వేచి చూడాల్సివుంది. 


Updated Date - 2022-05-22T06:39:29+05:30 IST