ప్రభుత్వ భూముల్లో చేపల చెరువులు

ABN , First Publish Date - 2021-10-30T06:16:26+05:30 IST

ఖాళీ భూములు కనిపిస్తే కబ్జా చేసేసే అధికార పార్టీ నాయకుల కళ్లు ఇప్పుడు కృత్తివెన్ను మండలంలోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిపై పడ్డాయి.

ప్రభుత్వ భూముల్లో చేపల చెరువులు
చెరువులు తవ్విన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న తహసీల్దారు, ఆర్‌ఐ

ఇంతేరులో అధికార పార్టీ నాయకుల భూదందా

200 ఎకరాల్లో చెరువుల తవ్వకం

అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే 

తిరగబడిన ఇంతేరు గ్రామస్థులు


ఖాళీ భూములు కనిపిస్తే కబ్జా చేసేసే అధికార పార్టీ నాయకుల కళ్లు ఇప్పుడు కృత్తివెన్ను మండలంలోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిపై పడ్డాయి. పెడన నియోజకవర్గ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరులు మండలంలోని ఇంతేరు గ్రామంలో ఉన్న ఈ భూమిని ఆక్రమించుకుని, చేపల చెరువులుగా  మార్చేస్తున్నారు. చెరువులు తవ్వడం పూర్తయిన తరువాత భీమవరానికి చెందిన వ్యాపారులకు లీజుకు ఇచ్చేలా ఒప్పందాలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని గూడూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు, పెడనకు చెందిన కీలక ప్రజాప్రతినిధి భర్త   కనుసన్నల్లో చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగుతోంది. 


ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : కృత్తివెన్ను మండలంలోని ఇంతేరు, ఒర్లగొందితిప్ప గ్రామాల పరిధిలోని 94 సర్వే నెంబరులో కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జడ్‌) పరిధిలోకి వచ్చే వందలాది ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇదంతా ప్రభుత్వ భూమిగానే రెవెన్యూ రికార్డుల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఇంతేరుగ్రామస్థులు ఈ ప్రాంతంలో అక్కడక్కడా చెరువులు తవ్వి, రొయ్య పిల్లల సాగుచేశారు. లాభసాటిగా లేకపోవడంతో వదిలేశారు. వీటిలో మడ చెట్లు పెరుగుతున్నాయి. ఇటీవల ఈ భూములపై కన్నేసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు గుట్టుచప్పుడు కాకుండా చెరువుల తవ్వకాలు ఆరంభించారు. గ్రామస్థులు ప్రశ్నిస్తే ఎక్స్‌కవేటర్లతో తొక్కించి చంపేస్తామని బెదిరింపు చర్యలకు దిగారు.


గ్రామస్థుల ఆగ్రహం

 అధికార పార్టీ నాయకులు 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమిస్తుండటంతో ఇంతేరు గ్రామస్థులు ఎదురుతిరిగారు. తమ గ్రామానికి చెందిన భూమిని ఆక్రమించి, చెరువులు తవ్వుతుండటంతో అడ్డుకున్నారు. తమపై బెదిరింపులకు దిగినవారిని తరిమికొట్టినంత పనిచేశారు. తవ్విన చెరువు గట్లను ఽధ్వంసం చేశారు. 200 ఎకరాలను అక్రమించుకునేందుకు ప్రణాళిక రచించిన అధికార పార్టీ నేతలు ఇప్పటికే 25 ఎకరాలకు పైగా భూముల్లో చెరువులు తవ్వారు. 2008వ సంవత్సరంలో ఈ భూముల్లో ఉన్న మడ అడవులను కొట్టి చెరువులుగా మార్చినందుకు ఐదుగురికి జైలు శిక్ష కూడా విధించారని, కొద్దిరోజులుగా అధికార పార్టీ నాయకులు దగ్గరుండి మరీ చెరువులు తవ్విస్తున్నారని, మరి వీరిపై కేసులు ఉండవా? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో 250కి పైగా పేద కుటుంబాలవారు ఉన్నారని, వారికి ఈ భూములను పంపిణీ చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


ఇవి ప్రభుత్వ భూములే : తహసీల్దారు

ఇంతేరు గ్రామంలోని భూములను కృత్తివెన్ను తహసీల్దారు మైనరుబాబు శుక్రవారం పరిశీలించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇవి ప్రభుత్వ భూములేనని, పైగా ఇవి సీఆర్‌జడ్‌పరిధిలో ఉన్నాయన్నారు. మడ అడవులు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో చేపల చెరువులు తవ్వేవారు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామన్నారు. 



Updated Date - 2021-10-30T06:16:26+05:30 IST