మత్య్సకార భరోసా.. పక్కదారి!

ABN , First Publish Date - 2021-06-12T04:23:18+05:30 IST

మత్య్సకార భరోసా.. పక్కదారి!

మత్య్సకార భరోసా.. పక్కదారి!
డొంకూరులో ఆందోళన చేస్తున్న మత్స్యకారులు

- అధికార పార్టీ నాయకుల అండతో అనర్హులకు చోటు

- పట్టించుకోని అధికారులు 

(ఇచ్ఛాపురం రూరల్‌) 

 ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పంచాయతీ చిన్నలక్ష్మీపురం గ్రామానికి చెందిన యర్ర జోగారావుకు సముద్రంలో వేటంటే ఏమిటో తెలియదు. ఇతనికి బోటు లేదు. వల లేదు. పంచాయతీలో ఉపాధి హామీ క్షేత్రసహాయకుడిగా పని చేస్తున్నాడు. అయినా గత నెలలో ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన వేట నిషేధ భృతి జాబితాలో ఈయన పేరు ఉంది. అగ్నికుల క్షేత్రయ కులానికి చెందిన ఈయనకు మత్స్యకార భరోసా ఎలా వర్తింపజేశారనేది చర్చనీయాంశమవుతోంది. 


ఇచ్ఛాపురం మండలం డొంకూరుకు చెందిన బి.జానకిరావుకు సముద్రంలో చేపలవేటే జీవనాధారం.  వేట నిషేధకాలం భృతి కోసం అందరిలాగే ‘మత్స్యకార భరోసా’కు దరఖాస్తు చేసుకున్నా.. జాబితాలో పేరు లేదు. ఇంతవరకూ భృతి రాలేదు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు వేట నిషేధం కావడంతో ఎటువంటి ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

...ఇలా ‘మత్స్యకార భరోసా’ పథకంలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో చాలా మంది మత్స్యకారులకు ‘భరోసా’ దక్కకపోగా.. అనర్హులకు ‘భృతి’ కల్పించడం గమనార్హం. ఉదాహరణకు ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పంచాయతీ డొంకూరులో 486 మందికి వేట నిషేధ భృతి అందజేశారు. ఇందులో 144 మంది అనర్హులు ఉన్నారు. బెంతుఒరియా కులానికి చెందినవారు ఇద్దరు, వివిధ రాష్ట్రాల్లో పనులు చేసుకుంటున్న అగ్నికుల క్షత్రియ యువకులు 50 మంది, రైతులు మరో 60 మంది, వివిధ వర్గాలకు చెందిన వారు మరో 10 మంది, కవిటి మండలానికి చెందిన ఆరుగురికి అధికార పార్టీ నాయకులు ‘మత్స్యకార భరోసా’ జాబితాలో చోటు కల్పించారు. వీరంతా సముద్రంలో చేపలవేటకు వెళ్లకపోయినా భృతి అందజేశారు. గ్రామంలో సుమారు 120  మంది  అర్హులైన మత్స్యకారులకు భృతి అందలేదు. ఈ నేపథ్యంలో కనీసం వేట అంటే ఏమిటో తెలియని మత్స్యకారులకు జాబితాలో చోటు కల్పించి.. తమకు అన్యాయం చేశారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి ఓటు వేయలేదనే కారణంతోనే తమకు భృతి అందజేయడం లేదని ఆరోపిస్తున్నారు. రెండు నెలలుగా ఎటువంటి ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అప్పులు చేసి బతుకుతున్నామని... తక్షణమే తమకు భృతి అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


కానరాని నిబంధనలు

వేట నిషేద భృతికి దరఖాస్తు చేసుకునేందుకు మత్స్యకారులు.. వేటాడే బోటు మత్స్యశాఖలో ముందుగా రిజిష్టర్‌ చేసుకోవాలి. ఆ బోటులో ఎంత మంది వేట సాగిస్తున్నారో వారి వ్యక్తిగత వివరాలు మత్స్యశాఖకు పంపించాలి. సంబంధిత అధికారులు గ్రామ సభ నిర్వహించి దరఖాస్తుదారులు సముద్రంలో వేట సాగిస్తున్నారా? లేదా అనేది పరిశీలిస్తారు. గ్రామసభలోనే దరఖాస్తు ఆమోదంపై నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ నిబంధనలేవీ అమలు కాలేదు. అధికారులు.. నాయకుల ఇళ్లల్లో కుర్చొని జాబితాలు తయారు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే నిజమైన మత్స్యకారులను పక్కన పెట్టి, వైసీపీ కార్యకర్తలకు జాబితాలో చోటు కల్పించారని బాధిత మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు భృతి అందజేయాలని   కోరుతున్నారు.


అనర్హులకు అందితే రికవరీ చేస్తాం 

మత్స్యకారులకు అందించిన వేట నిషేధ భృతిలో.. అనర్హులు లబ్ధి పొందితే, వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తాం.  ప్రస్తుతం అర్హులకే భృతి అందజేశాం. జాబితాలను మరోసారి పరిశీలించి.. అనర్హులు ఉంటే వారి నుంచి సొమ్ము రికవరీ చేసి.. ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తాం. 

- పి.వెంకట రవితేజ, ఎఫ్‌డీవో, ఇచ్ఛాపురం.


Updated Date - 2021-06-12T04:23:18+05:30 IST