ఎక్కడున్నారో..?

ABN , First Publish Date - 2022-07-07T05:54:52+05:30 IST

ఎక్కడున్నారో..?

ఎక్కడున్నారో..?
సముద్రుడికి పూజలు చేస్తున్న మత్స్యకార మహిళలు

ఇంకా లభించని నలుగురు మత్స్యకారుల ఆచూకీ

మెరైన్‌, నేవీ, కోస్ట్‌గార్డు బృందాల గాలింపు ముమ్మరం

శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ తీరప్రాంతంలో గస్తీ

నేడు మరో రెండు బృందాలతో గాలింపు

ఆచూకీ కనుగొనాలని సీఎస్‌కు చంద్రబాబు లేఖ

బాధితులకు పేర్ని నాని, కొల్లు రవీంద్ర పరామర్శ


సముద్రంలో వేటకు వెళ్లి  ఆరు రోజులు గడిచింది. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏమైపోయారో అంటూ గల్లంతైన నలుగురు మత్స్యకారుల కుటుంబసభ్యులు ఆశగా సముద్రంవైపే చూస్తున్నారు. మరోవైపు ఎలాగైనా మత్స్యకారులను కనిపెట్టాలని తీరప్రాంత భద్రత సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : సముద్రంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో కుటుంబసభ్యుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. గల్లంతైనవారి వద్ద ఉన్న సెల్‌ఫోన్ల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో భయాందోళన చెందుతున్నారు. బందరు మండలం క్యాంప్‌బెల్‌ పేట, చినకరగ్రహారానికి చెందిన విశ్వనాథపల్లి చినమస్తాన్‌, చిననాంచార య్య, చెక్కా నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావు ఈ నెల ఒకటో తేదీన ఐఎన్‌డీ-ఏపీ-కే2-ఎంవో-60 (ఫైల్‌ నెంబరు ఏపీ-3469) ఫైబర్‌ బోటులో వేటకు వెళ్లారు. అంతర్వేది వద్ద వీరు ఉన్న బోటు ఇంజన్‌ మరమ్మతులకు గురికావడంతో సముద్రంలో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని బోటు యజమాని బలగం ఏడుకొండులుకు సమాచారం అందించారు. ఈనెల 3వ తేదీ నుంచి వీరి నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. దీంతో వీరు గల్లంతైన విషయాన్ని కుటుంబసభ్యులు, బోటు యజమాని అధికారులకు తెలియజేశారు. దీంతో నేవీ, కోస్ట్‌గార్డు అధికారులు రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. నేవీ అధికారులు ఒక చాపర్‌ సహా కోస్ట్‌గార్డుకు చెందిన వీర, ప్రియదర్శిని అనే రెండు బోట్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

తీర ప్రాంతమంతా గాలింపు

నలుగురు మత్స్యకారులు, వారు ప్రయాణిస్తున్న ఫైబర్‌ బోటు కోసం శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ తీరప్రాంతం వెంబడి మెరైన్‌, నేవీ, కోస్ట్‌గార్డ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  మెరైన్‌ పోలీసుల ద్వారా అన్నిచోట్లా ఆరా తీస్తున్నామని గిలకలదిండి మెరైన్‌ సీఐ సీహెచ్‌ సతీష్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఉదయం గిలకలదిండి హార్బర్‌ నుంచి స్థానిక మత్స్యకారులు, మెరైన్‌ పోలీసులతో రెండు బోట్లలో రెండు బృందాలు బయల్దేరుతున్నాయని చెప్పారు. కాగా, మెరైన్‌ విభాగం ఉన్నతాధికారుల సూచనలతో కోస్ట్‌గార్డ్‌, నేవీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. 

సీఎస్‌కు చంద్రబాబు లేఖ

నలుగురు మత్స్యకారులను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు బుధవారం లేఖ రాశారు. నాలుగు రోజులుగా మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోందని, వారిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. 

పరామర్శలు

గల్లంతైన మత్స్యకారులు కుటుంబాలను ఎమ్మెల్యే పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం పరామర్శించారు. క్యాంప్‌బెల్‌ పేటలోని మత్స్యకార కుటుంబాలకు కొల్లు రవీంద్రనిత్యావసర సరుకులు, పేర్ని నాని ఆర్థిక సాయం అందజేశారు. పేర్ని నాని మాట్లాడుతూ మత్స్యకారుల కోసం ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసిందన్నారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ చేపల వేటకు వెళ్లేవారికి కనీసం లైఫ్‌ జాకెట్లు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. కాగా, గల్లంతైన మత్స్యకారులు తిరిగి ఇంటికి రావాలంటూ క్యాంప్‌బెల్‌ పేట మత్స్యకార మహిళలు బుధవారం సముద్రానికి పూజలు చేశారు. 






Updated Date - 2022-07-07T05:54:52+05:30 IST