నేవీ గేటు వద్ద మత్స్యకారుల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-07T06:51:54+05:30 IST

నేవల్‌ బేస్‌ ఏర్పాటుతో నిర్వాసితులుగా మారిన మత్స్యకారులను నిబంధనల పేరుతో శారదా నదిగుండా చేపల వేటకు వెళ్లనీయకుండా నేవీ అధికారులు ఇబ్బందులకు గురిచేయడం తగదని నేవీ నిర్వాసితులు, పెద్దలు వాపోయారు.

నేవీ గేటు వద్ద మత్స్యకారుల ఆందోళన
నిర్వాసితులతో చర్చలు జరుపుతున్న పోలీసు అధికారులు

 నిబంధనల పేరుతో వేటను అడ్డుకుంటున్నారని కొత్తపట్నం నిర్వాసితుల ఆరోపణ

 ఇరు వర్గాలతో పోలీసులు అధికారులు చర్చలు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని చెప్పడంతో తాత్కాలికంగా సమస్య పరిష్కారం

రాంబిల్లి, జూలై 6 : నేవల్‌ బేస్‌ ఏర్పాటుతో నిర్వాసితులుగా మారిన మత్స్యకారులను నిబంధనల పేరుతో శారదా నదిగుండా చేపల వేటకు వెళ్లనీయకుండా నేవీ అధికారులు  ఇబ్బందులకు గురిచేయడం తగదని నేవీ నిర్వాసితులు, పెద్దలు వాపోయారు. ఆధార్‌కార్డును చూపి  కొత్తపట్నంలోని మత్స్యకారులు నేవీలో ఉన్న శారదా నదిగుండా గతంలో వేటకు  వెళ్లేవారు.  అయితే మత్స్యకార భరోసా రూ.10 వేలు తీసుకున్నవారు తప్ప,  మిలిగిన వారు నేవీ లోపలికి రాకూడదని నిబంధనలను విధించి అధికారులు గేటు మూసివేశారు. దీంతో నిర్వాసిత మత్స్యకారులు, పెద్దలు, సీపీఎం నాయకులు నేవీ గేటు వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎలమంచి సీఐ వెంటకటరావు, ఎస్‌ఐ రాజారావులు సిబ్బందితో చేరుకొని నిర్వాసిత నాయకులు, నేవీ అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యను మత్స్యకారులు వివరించారు.  ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు  కొంత సమయం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు. దీంతో పాత పద్ధతిలోనే నిర్వాసిత మత్స్యకారులు నేవీలోని నదిలోకి వేటకు వెళ్లవచ్చుని అనుమతి ఇచ్చినట్టు మత్స్యకార నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ చోడిపల్లి సత్యనారాయణ, గ్రామ పెద్దలు యు.నాగేష్‌, చోడిపల్లి వెంకటేశ్వర్లు, ఎర్రయ్య, కోడ స్వామి, సీపీఎం నాయకులు దేముడునాయుడు, గంగారాజు, నిర్వాసిత మత్య్సకార పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T06:51:54+05:30 IST