వేట మొదలైనా తీరని కష్టాలు

ABN , First Publish Date - 2022-06-25T06:31:03+05:30 IST

సముద్రంలో చేపల వేట మొదలైనా మత్స్యకారుల కష్టాలు తీరడం లేదు.

వేట మొదలైనా తీరని కష్టాలు
ఫిషింగ్‌ హార్బర్‌లో అమ్మకానికి సిద్ధంగా రొయ్యలు

తగ్గిన రొయ్య ధర

కొనుగోళ్లకు ముందుకురాని ఎగుమతిదారులు

మత్స్యకారుల గగ్గోలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


సముద్రంలో చేపల వేట మొదలైనా మత్స్యకారుల కష్టాలు తీరడం లేదు. లక్షల రూపాయలు పెట్టుబడులు సమకూర్చుకొని ప్రాణాలకు తెగించి వేటకు వెళ్లి రొయ్యలు తీసుకొస్తే వారికి ఫిషింగ్‌ హార్బర్‌లో సరైన ధర లభించడం లేదు. కేవలం సముద్ర ఉత్పత్తులు కొనుగోలు చేయడానికే హార్బర్‌లో స్థలాలు తీసుకున్న ఎగుమతిదారులు సీజన్‌ మొదలైనా అడ్రస్‌ లేరు. చిన్న ఏజెంట్లను పెట్టుకొని ‘ముందు సరకు ఇవ్వండి...ధర సంగతి తరువాత చూసుకుందాం’ అంటూ బేరసారాలు ఆడుతున్నారు.


వాయేజ్‌కి రూ.50 వేలు నికర నష్టం

మరబోట్ల యజమానులు వాతావరణం, రొయ్యల లభ్యత చూసుకొని వేట కొనసాగించాలనే ఉద్దేశంతో పది రోజుల వాయేజ్‌తోనే సరిపెట్టుకొని వస్తున్నారు. రోజుకు సగటున మరబోటుకు 200 లీటర్ల డీజిల్‌ ఖర్చు అవుతుంది. లీటరు వంద రూపాయల చొప్పున ఒక్క డీజిల్‌కే రూ.20 వేలు వ్యయం అవుతుంది. పది రోజుల వాయేజ్‌ అయితే డీజిల్‌కు రూ.2 లక్షలు, సిబ్బంది భత్యానికి రూ.10 వేలు, పది టన్నుల ఐసు రూ.16 వేలు, గ్యాస్‌ సిలెండరు, స్పేర్‌ పార్టులు కలిపి మరో రూ.10 వేలు ఖర్చు అవుతాయి. మొత్తం చూసుకుంటే వేటకు వెళ్లి రావడానికి రూ.2.36 లక్షలు అవుతుంది. ఈ సీజన్‌లో రొయ్యలు మాత్రమే లభిస్తాయి. అక్కడక్కడా చిన్నచిన్న చందువాలు, గులివిందలు, పీతలు దొరుకుతాయి. అవి చాలా స్వల్పం. బోట్లకు చిక్కే రొయ్యలు నాలుగు రకాలు. బ్రౌన్‌, వైట్‌, ఫ్లవర్‌, టైగర్‌ అని వేరు చేస్తారు. మొదటి రెండింటికి ధర తక్కువ వస్తుంది. వాటి కంటే ఫ్లవర్‌కి కొంచెం అధికం, అన్నింటి కంటే టైగర్‌ రకానికి ఎక్కువ రేటు లభిస్తుంది. ఇవి చాలా స్వల్పసంఖ్యలోనే దొరుకుతాయి. వాయేజ్‌లో బోటుకు 20 కిలోలకు మించి రావు. ప్రస్తుతం హార్బర్‌లో టైగర్‌ రకం రొయ్యలకు కిలోకు రూ.900 ధర ఇస్తున్నారు. ఇంతకు ముందు ఇది రూ.1,100 ఉండేది. కిలోకు రూ.200 తగ్గించేశారు. ఫ్లవర్‌ రకం గతంలో కిలో రూ.500 ఉండగా...ప్రస్తుతం రూ.350 ఇస్తున్నారు. మొదటి రెండు రకాలైన బ్రౌన్‌, వైట్‌ రకాలకు రూ.300 నుంచి రూ.330 వరకు ఇస్తున్నారు. ఈ ధరలు గిట్టుబాటు కావని, పెంచాలని బోట్ల యజమానులు కోరుతున్నారు. అయితే కొద్దిమంది ఎగుమతిదారులు ఫిక్స్‌డ్‌ ధరలు చెప్పకుండా, ముందు సరకు ఇవ్వండి, తరువాత చూసుకుందాం అంటున్నారు. దీనిని మత్స్యకారులు నిరసిస్తున్నారు.

వేటకు వెళ్లిన ఒక్కో బోటుకు సుమారు 400 నుంచి 600 కిలోల రొయ్యలు లభిస్తున్నాయి. సగటున బోటుకు 500 కిలోలు వేసుకుంటే...కిలో సగటు రేటు రూ.350 చొప్పున  రూ.1.75 లక్షలు వస్తోంది. చిల్లర చేపలను బాస్కెట్ల లెక్కన అమ్మితే రూ.10 వేలకు మించి రావడం లేదు. అంతా కలిపితే పది రోజుల కష్టానికి రూ.1.85 లక్షలు వస్తోంది. పెట్టుబడి చూస్తే రూ.2.36 లక్షలు అవుతోంది. అంటే సుమారు రూ.50 వేలు పెట్టుబడి నష్టం వస్తోంది. పైగా పది రోజులు పది మంది కష్టానికి ప్రతిఫలం లభించడం లేదు. వీరికి కూలి కనీసం రూ.50 వేలు వేసుకున్నా..మొత్తంగా చూసుకుంటే లక్ష రూపాయల వరకు నష్టం వస్తోంది. 


దళారుల అడ్డగింత

ఎగుమతిదారులు కాకుండా హోటలియర్స్‌, ఇతర కేటరింగ్‌ వ్యాపారులు రొయ్యలు కొనడానికి ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుంటే...హార్బర్‌లో దళారులు వారిని అడ్డుకుంటున్నారు. తాము తక్కువ ధరకు సరకు ఇస్తామని వారిని లాడ్జీల్లోనే ఉంచేసి, ఇక్కడ బోట్ల యజమానులతో బేరసారాలు చేస్తున్నారు. దీనివల్ల కష్టపడిన మత్స్యకారులు కాకుండా దళారులు లాభపడుతున్నారు.


ఎగుమతిదారులే కొనాలి

సీహెచ్‌ వీర్రాజు, అధ్యక్షులు, విశాఖ డాల్ఫిన్‌ బోటు ఆపరేటర్ల సంఘం

మత్స్యకారులు సముద్రంలో వేటాడి తెచ్చిన రొయ్యలు కొంటామనే ఎగుమతిదారులు ఇక్కడ స్థలాలు తీసుకున్నారు. వారు ఇప్పుడు వనామీ రొయ్యల వ్యాపారం చేసుకుంటూ మా సరకు కొనడం లేదు. మత్స్య శాఖ అధికారులు వారందరినీ రప్పించి, మా సరకు గిట్టుబాటు ధరకు కొనేలా చర్యలు తీసుకోవాలి. 

Updated Date - 2022-06-25T06:31:03+05:30 IST