6 నెలల గర్భం.. అకస్మాత్తుగా మాయం.. నెటిజన్లకు ఊహించని షాకిచ్చిన మహిళ

ABN , First Publish Date - 2022-02-08T23:55:46+05:30 IST

గర్భంతో ఉన్న మహిళ అకస్మాత్తుగా తన గర్భం మాయమైపోయేలా చేస్తే.. ఆ సీన్ చూడటానికే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ఇది చూసిన వారికి.. శిశువుకు ఏమైనా జరిగిందేమోనన్న ఆందోళన కూడా కలుగుతుంది. ప్రస్తుతం అటువంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతూ నెటిజన్లు గగ్గోలు పెట్టేలా చేస్తోంది.

6 నెలల గర్భం.. అకస్మాత్తుగా మాయం.. నెటిజన్లకు ఊహించని షాకిచ్చిన మహిళ

ఇంటర్నెట్ డెస్క్: గర్భంతో ఉన్న మహిళ అకస్మాత్తుగా తన గర్భం మాయమైపోయేలా చేస్తే.. ఆ సీన్ చూడటానికే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ఇది చూసిన వారికి.. శిశువుకు ఏమైనా జరిగిందేమోనన్న ఆందోళన కూడా కలుగుతుంది. ప్రస్తుతం అటువంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతూ నెటిజన్లు గగ్గోలు పెట్టేలా చేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన టిక్‌టాక్ యూజర్ ట్యామీ హెమ్‌బ్రూ.. తన వీడియో ద్వారా నెట్టింట కల్లోలం రేపుతోంది. ప్రస్తుతం 6 నెలల గర్భంతో ఉన్న ఆమె.. వ్యాయామం చేసే క్రమంలో తన కడుపు కండరాలను ఒక్కసారిగా బిగపట్టడంతో అప్పటిదాకా ముందుకు వచ్చిన ఉదర భాగం ఒక్కసారిగా బల్లపరుపుగా మారిపోయింది. గర్భం లేని సమయంలో ఉన్నట్టు అయిపోయింది. ఆ వెంటనే ఆమె.. తన కడుపు మామూలు స్థితికి వచ్చేలాగా చేస్తుంది. ‘‘ఇన్నాళ్లుగా గర్భంతో ఉండి అలసిపోతే.. ’’ అంటూ ఓ క్యాప్షన్‌ కూడా జతచేసి ఈ వీడియోను రిలీజ్ చేసింది. అంతే..ఇది చూసిన వారందరూ విస్మయానికి గురయ్యారు.  ‘‘శిశువుకు ఏమీ కాలేదు కదా..’’ అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల పిండం ఎదుగుదలపై ప్రభావం పడుతుందేమోనంటూ మరి కొందరు అనుమానం వ్యక్తం చేశారు. 


ఇలాంటి కామెంట్స్ విపరీతంగా వచ్చిపడుతుండటంతో చివరికి హెమ్‌బ్రూ స్వయంగా రంగంలోకి దిగింది. తన ఎక్సర్‌సైజులో ఇదీ ఓ భాగమంటూ క్లారిటీ ఇచ్చింది. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు తమ ఉదరభాగాన్ని ఇలా బిగపట్టడం మంచిదని కూడా చెప్పుకొచ్చింది. అయితే.. హెమ్‌బ్రూకు మంచి ఫిట్‌నెస్ ఉండటం వల్లే ఇదంతా సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. ఉదరభాగం లోపలికి వెళ్లిన క్రమంలో పిండంతో పాటూ గర్భసంచి కూడా కొద్దిగా పైకి జరుగుతుందని, ఫలితంగా బిడ్డకు ఎటువంటి ఇబ్బంది కలుగదని చెబుతున్నారు. బరువులు ఏత్తేటప్పుడు వెయిట్ లిఫ్టర్ల ఛాతి పరిమాణం కాస్త పెరిగి.. ఉదరభాగం బల్లపరుపుగా ఎలాగైతే మారుతుందో హెమ్‌బ్రూ విషయంలోనూ అలాగే జరిగిందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Updated Date - 2022-02-08T23:55:46+05:30 IST