అసోంలో 'ఉగ్ర' దాడి.. ఐదుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2021-08-27T19:35:59+05:30 IST

అసోంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం రాత్రి పలు ట్రక్కులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి తగులబట్టడంతో..

అసోంలో 'ఉగ్ర' దాడి.. ఐదుగురు దుర్మరణం

గువాహటి: అసోంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం రాత్రి పలు ట్రక్కులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి తగులబట్టడంతో ఐదుగురు మృతి చెందారు. డిమా హసావో జిల్లాలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తమకు అందిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు డిమస నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని డిమా హసావో జిల్లా ఎస్‌పీ జయంత్ సింగ్ తెలిపారు. ట్రక్కుల్లోంచి కాలిపోయిన ఐదు మృతదేహాలను వెలికి తీశామని, వీరిలో ఎక్కువ మంది డ్రైవర్లేనని ఆయన చెప్పారు. ఇటుక, బొగ్గు లోడ్‌తో ట్రక్కులు ఉమ్రాంగ్సో నుంచి లంకకు వెళ్లుండగా ఉగ్రవాదులు దారికాచి రాత్రి 8 గంటల ప్రాంతంలో దాడికి దిగాయని, ఉగ్రవాదుల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.


డిమస గిరిజనులతో కూడిన సర్వసత్తాక, సతంత్ర దేశం డిమాండ్‌పై 2019లో డీఎన్ఎల్ఏ ఏర్పడింది. అసోలోని డిమా హసావో, కర్బి ఆంగ్లాంగ్, కచర్, నాగోవ్ జిల్లాలతో పాటు నాగాల్యాండ్‌లోని కొన్ని ప్రారాంతాల్లో డిమసా గిరిజనులు ఉన్నారు. కాగా, ఈ ఏడాది మేలో డీఎన్‌ఎల్ఏకు భారీ దెబ్బ తగిలింది. అసోం పోలీసులు, అసోం రైఫిల్స్ జరిపిన ఉగ్రవాద నిరోధక చర్యల్లో డీఎన్ఎల్ఏకు చెందిన ఆరుగురు అగ్రనేతలు హతమయ్యారు.

Updated Date - 2021-08-27T19:35:59+05:30 IST