ఐదు నెలలుగా డెంగ్యూ మరణాల్లేవ్‌

ABN , First Publish Date - 2022-05-17T13:52:21+05:30 IST

రాష్ట్రంలో ఈ ఏడాది గడిచిన ఐదు నెలల్లో డెంగ్యూ మరణాలు నమోదుకాలేదని, ప్రజలకు అవగాహన, దోమల నిర్మూలనలో 21 వేల మంది

ఐదు నెలలుగా డెంగ్యూ మరణాల్లేవ్‌

- నివారణ చర్యల్లో 21 వేల మంది

- మంత్రి ఎం.సుబ్రమణ్యం


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో ఈ ఏడాది గడిచిన ఐదు నెలల్లో డెంగ్యూ మరణాలు నమోదుకాలేదని, ప్రజలకు అవగాహన, దోమల నిర్మూలనలో 21 వేల మంది విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఓమందూరర్‌ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 2012, 2015, 2017 సంవత్సరాల్లో డెంగ్యూ మరణాలు అధికంగా ఉన్నాయని, 2017లో 65 మంది డెంగ్యూ లక్షణాలతో మృతిచెందారని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎవరూ మృతిచెందలేదని తెలివెల్లడించారు. ప్రస్తుతం డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పించేలా స్థానిక సంస్థలతో కలసి ఆరోగ్య సిబ్బంది ఇంటింటా ప్రచారం చేపట్టారన్నారు. గతంలో రాష్ట్రంలో 125 డెంగ్యూ జ్వరం పరిశోధన కేంద్రాలుండగా, వాటిని 300కు పెంచామని తెలిపారు. ప్రస్తుతం కృష్ణగిరి, కన్నియాకుమారి, ధర్మపురి జిల్లాల్లో డెంగ్యూ బాధితులు అధికంగా ఉన్నారని తెలిపారు. ప్రాథమిక దశలోనే జ్వర లక్షణాలు గుర్తించి చికిత్స అందించి నయం చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా నగరంలో దోమల నిర్మూలనకు ఏర్పాటుచేసిన ఫాగింగ్‌ యంత్రాలను మంత్రి సుబ్రమణ్యం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి శేఖర్‌బాబు, ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T13:52:21+05:30 IST