అందుకే అయోధ్య బరిలో యోగి నిలవబోతున్నారా?

ABN , First Publish Date - 2022-01-13T23:46:44+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నేత, ముఖ్యమంత్రి

అందుకే అయోధ్య బరిలో యోగి నిలవబోతున్నారా?

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నేత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రకటించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఆయనను ఈ స్థానం నుంచి పోటీ చేయించడానికి ఐదు కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో దాదాపు 175 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య బరిలో నిలపాలన్న బీజేపీ వ్యూహం వెనుక ఐదు కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. అవి ఏమిటంటే... రామాలయం, హిందుత్వ నేత, అవధ్‌పై ప్రభావం, ఓటర్లకు స్పష్టమైన సందేశం, అయోధ్య బీజేపీకి అత్యంత ముఖ్యమైనది కావడం.


రామాలయం నిర్మాణంతో సానుకూలత

దాదాపు 500 ఏళ్ళనాటి సమస్యకు సుప్రీంకోర్టు తీర్పుతో పరిష్కారం లభించింది. అనంతరం రామాలయ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా బీజేపీకి సానుకూలత కనిపిస్తోంది. సంఘ్ పరివార్‌కు ఇది కేంద్ర స్థానం కావడం కూడా మరొక కారణం. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని గోరఖ్‌నాథ్ పీఠానికి, అయోధ్యకు అవినాభావ సంబంధం ఉంది. యోగి ఆదిత్యనాథ్ గురువులు మహంత్ అవైద్యనాథ్, మహంత్ దిగ్విజయనాథ్ తమ తమ కాలాల్లో రామాలయం ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1949లో రామ జన్మభూమి ఉద్యమంలో మహంత్ దిగ్విజయనాథ్ నాయకత్వ పాత్రను పోషించారు. 


హిందుత్వ సిద్ధాంతాలకు ఊతం

యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య నుంచి పోటీ చేయించడం వల్ల బీజేపీ హిందుత్వ భావజాలం మరింత బలోపేతమవుతుంది. ఫలితంగా బీజేపీ హిందుత్వ నేతగా ఆయనకు మరింత ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. 


సమాజ్‌వాదీ పార్టీకి పట్టున్న ప్రాంతం

ఉత్తర ప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతంలో అయోధ్య ఉంది. ఈ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీకి మంచి పట్టు ఉంది. అయోధ్య నుంచి యోగి పోటీ చేస్తే ఈ ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలపై ప్రభావం పడుతుంది. దీనివల్ల బీజేపీ లాభపడుతుంది. 


మోదీ మాదిరిగానే...

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పవిత్ర పుణ్య క్షేత్రం వారణాసి నుంచి పోటీ చేసి, గొప్ప అనుబంధాన్ని ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా యోగి కూడా అయోధ్య నుంచి పోటీ చేస్తే, ఆ నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధాన్ని చాటవచ్చు. 


బీజేపీకి చాలా ముఖ్యమైన స్థానం

అయోధ్య నియోజకవర్గం బీజేపీకి చాలా ముఖ్యమైన స్థానం. ఈ నియోజకవర్గం నుంచి గతంలో జనతా దళ్, కాంగ్రెస్ గెలుస్తూ ఉండేవి. ఇప్పుడు బీజేపీకి పట్టు పెరిగింది.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అయోధ్యపై యోగి ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. రోడ్ల విస్తరణ, స్నాన ఘట్టాల సుందరీకరణ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. 


Updated Date - 2022-01-13T23:46:44+05:30 IST