
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే దేశ పురోగతికి, సమాన అభివృద్ధికి ఎటువంటి అవరోధాలు ఉండవని గ్రహించినందువల్లే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని జనం బలపరిచారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే అవినీతి, అరాచకత్వం, వంశపారంపర్య పాలన, కుల, మతతత్వ శక్తులకు ప్రోత్సాహం లభిస్తుందన్న విషయం ప్రజలకు బాగా తెలుసు. ఆ శక్తులను అందలం ఎక్కించి దేశాన్ని అధోగతి పాలు చేయడం ప్రజలకు ఇష్టం లేదని స్పష్టమయింది.
ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అనేక విషయాలను స్పష్టం చేశాయి. ప్రతిపక్షాలు, కుహనా మేధావులు ఎంత దుష్ప్రచారం చేసినా భారతీయ జనతా పార్టీకి ప్రజా బలం దిన దిన ప్రవర్థమానం అవుతున్నదనేది వాటిలో ప్రధానమైనది. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న మార్పులే ప్రజలను ఆ పార్టీవైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ప్రతి ఎన్నికలోనూ బిజెపి ఓటు బ్యాంకు పెరగడం, కొత్త ప్రాంతాలకు విస్తరించడమే ఇందుకు నిదర్శనం. 2017తో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఓటు శాతం 39.67 నుంచి 41.6 శాతానికి పెరిగింది. 37 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో కూడా బిజెపి తన అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. బిజెపి పట్ల ప్రజల్లో అభిమానం ఎందుకు రోజురోజుకూ పెరుగుతోంది? జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ ప్రభుత్వ వ్యతిరేకత అనేది బిజెపి పాలనకు వర్తించదని ప్రజలు ఎందుకు భావిస్తున్నారు?
ప్రజలు అలా అనుకోవడానికి కారణం బిజెపి అధికారంలో ఉంటే అభివృద్ధి, సుస్థిరత, శాంతి నెలకొంటాయని భావించడమే. ఈ దేశంలో ప్రతి మనిషి అస్తిత్వానికి ఒక విలువ ఏర్పడుతుందని గ్రహించడమే. ఉదాహరణకు గత ప్రభుత్వాల హయాంలో పేదరికం, నిరుద్యోగం పెచ్చరిల్లాయి. కుల మతాల ఆధారంగా ప్రజలను చీల్చే ప్రయత్నాలు జరిగాయి. మాఫియా, ఉగ్రవాద ముఠాల అరాచకత్వం ప్రబలింది. మహిళలకు భద్రత లేకపోవడం, భారతీయత అన్న పదానికి అర్థం లేకుండా చేయడం వంటి అనేక పరిణామాలు కొనసాగాయి. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటికీ స్థానం లేకుండా పోయింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశంలో రాష్ట్రాలు అభివృద్ధిబాట పట్టడం, ఆయా రాష్ట్రాల్లో బిజెపి ముఖ్యమంత్రులు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా నిరంతరం పనిచేయడం స్పష్టంగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్రాలు అత్యంత సమన్వయంతో పనిచేయడం ప్రజలు గమనించారు.
ఒకవైపు కేంద్రం రూ.లక్షల కోట్లతో అభివృద్ధి పథకాలను అమలు చేయడం, యూపీ వెనుకబాటుతనం నుంచి అభివృద్ధి వైపు పయనించడం, అవినీతికి ఆస్కారం లేకపోవడం జరుగుతోందన్న విషయం ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అర్థమైంది. అంతేకాక ఆదిత్యనాథ్ రాజ్యంలో ప్రతి వ్యక్తీ తనను తాను సురక్షితుడినని భావించారు. ముఖ్యంగా మహిళలు బిజెపికి ఈ ఎన్నికల్లో నీరాజనాలు పట్టడానికి ప్రధాన కారణం యూపీలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తమ జీవన పరిస్థితులు మెరుగుపడడమే. అందుకే మెజారిటీ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే దేశ పురోగతికి, సమాన అభివృద్ధికి ఎటువంటి అవరోధాలు ఉండవని గ్రహించినందువల్ల కూడా జనం బిజెపిని బలపరిచారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే అవినీతి, అరాచకత్వం, వంశపారంపర్య పాలన, కుల, మతతత్వ శక్తులకు ప్రోత్సాహం లభిస్తుందన్న విషయం కూడా ప్రజలకు తెలుసు. ఈ శక్తులను అందలం ఎక్కించి దేశాన్ని అధోగతి పాలు చేయడం ప్రజలకు ఇష్టం లేదని స్పష్టమయింది. ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో కూడా బిజెపిని కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువగా ఆదరించడం మారుతున్న ప్రజల మనోభావాలకు నిదర్శనం. కాంగ్రెస్ అనే కుళ్లిపోయిన సంస్థను వదుల్చుకోవాలని నిర్ణయించారని పంజాబ్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.
ప్రధాని మోదీ, బిజెపి పట్ల ప్రతిపక్షాలు, కుహనా మేధావి వర్గాలు ఎంత దుష్ర్పచారం చేశాయని? ఎన్ని అర్థసత్యాలు ప్రచారం చేశాయని? మోదీ హయాంలో మతతత్వం పెరిగిందని, రైతులు తీవ్ర కష్టాల పాలయ్యారని, లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, మహిళలు అత్యాచారాలకు గురయ్యారని, ధరలు నింగికి చేరాయని ఇత్యాది పచ్చి అబద్ధాలతో పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించారు. రెండేళ్లకు పైగా కరోనా పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేందుకు ప్రయత్నించినా, అంతర్జాతీయ పరిణామాలు మనకు వ్యతిరేకంగా మారినా చెక్కుచెదరకుండా, మొక్కవోని సాహసంతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత మోదీకి దక్కుతుంది.
ఎనిమిదేళ్ల మోదీ పాలనలో అనుసరించిన పేదలకు అనుకూల పథకాలే ఆయన పట్ల జనానికి అభిమానం పెంచాయి. అభివృద్ధి ఫలితాలు సామాన్యుడి వరకు చేరుకోవడం, దళారీ వ్యవస్థ కుప్పకూలిపోవడం మోదీ హయాంలోనే జరిగింది. ఉచిత రేషన్, పక్కా ఇళ్లు, వివిధ పథకాల ద్వారా తమ ఖాతాల్లో నగదు బదిలీ కావడం, స్వేచ్ఛగా, సురక్షితంగా వీధుల్లో తిరిగే వాతావరణం ఏర్పడడం, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పన పెరగడం స్పష్టంగా కనిపించాయి. అన్ని సంక్షేమ పథకాలు నూటికి నూరుశాతం ఫలితాలు సాధించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. డిజిటల్ ఇండియా ద్వారా పథకాలు విజయవంతమయ్యేలా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిశితంగా గమనిస్తే రైతులు, యువకులు, మహిళలు, మధ్యతరగతితో సహా అన్ని వర్గాలు బిజెపికి అనుకూలంగా ఓటు వేశారన్న విషయం స్పష్టమవుతుంది.
ప్రతిపక్షాలు ప్రచారం చేసినట్లు ఆయా వర్గాలు తీవ్ర కడగండ్లకు గురైతే బిజెపి ఓటు బ్యాంకు పెరిగేదే కాదు. ఇన్ని సీట్లు వచ్చేవే కావు. ప్రజాస్వామిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షాలు ఉండడం ఎంతో ఆరోగ్యకరం. కాని బిజెపి పట్ల, మోదీ పట్ల దుష్ప్రచారం చేయడం ద్వారా అవి తమ విశ్వసనీయత, ఆమోద యోగ్యతను తామే కోల్పోతే ఎవరేం చేయగలరు?
దేశంలో ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఈ ఎన్నికల్లో బిజెపి దెబ్బతింటుందని, దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ను ఏర్పర్చి ప్రధానమంత్రి పదవి దక్కించుకోవాలని కొందరు నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహం ఈ ఫలితాలతో నీరు కారింది. ఆధునిక భారతంలో ప్రజలు కులతత్వ, మతతత్వ, వారసత్వ పార్టీలను వదుల్చుకోవాలనుకుంటున్నారని వారు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.
రానున్న రోజులు ఈ దేశ భవిష్యత్‌కు ఎంతో కీలకమైనవి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించి, వాటిని నెరవేర్చే దిశగా దేశాన్ని నడిపించాలని. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధం చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. సంకుచిత రాజకీయాలతో కాలాన్ని వృధా చేసి అభివృద్ధి వేగం తగ్గిస్తే దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే మన విలువైన సమయాన్ని వృధా చేయవద్దని, మనకున్నది అమృతకాలమని మోదీ అన్నారు. మోదీ అనుసరించిన విధానాలను ప్రజలు ఆదరించారని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఆ విధానాలను మరింత వేగంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి.
(బీజేపీ జాతీయ కార్యదర్శి)