Dubai Law: పదేళ్లుగా గల్ఫ్ జైల్లో మగ్గుతున్న ఐదుగురు తెలుగు వారు.. అప్పీలుకు వెళితే పెరిగిన శిక్ష..

ABN , First Publish Date - 2022-07-19T13:23:57+05:30 IST

పరాయి దేశంలో.. చేయరాని నేరం చేశారు. హత్య కేసులో ఇరుక్కొని పదేళ్ల జైలుశిక్షకు గురయ్యారు. పైకోర్టుకు వెళితే శిక్ష తగ్గుతుందేమోనని అప్పీలు చేస్తే.. ఆ కోర్టు పదేళ్ల శిక్షను కాస్తా యావజ్జీవ శిక్షకు పెంచింది. దీంతో పదిహేనేళ్లకు పైగా జైల్లో మగ్గుతున్నారు.. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ప్రవాసీయులు.

Dubai Law: పదేళ్లుగా గల్ఫ్ జైల్లో మగ్గుతున్న ఐదుగురు తెలుగు వారు.. అప్పీలుకు వెళితే పెరిగిన శిక్ష..

దుబాయి చట్టం.. ఎంత కఠినం!

హత్య కేసులో ఐదుగురు సిరిసిల్ల వాసులకు యావజ్జీవం..

పదేళ్ల జైలు శిక్ష తగ్గించాలని పైకోర్టుకు వెళితే పెరిగిన వైనం

వారి విడుదల కోసం గత పదేళ్లుగా మంత్రి కేటీఆర్‌ ప్రయత్నాలు

స్వయంగా నేపాల్‌ వెళ్లి మృతుడి కుటుంబానికి నగదు సాయం

మాఫీనామా సంపాదించినా ఫలితం లేక.. కారాగారంలోనే..

బక్రీద్‌ సందర్భంగా 505 మందికి క్షమాభిక్ష.. వీరికి దక్కని చాన్స్‌

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పరాయి దేశంలో.. చేయరాని నేరం చేశారు. హత్య కేసులో ఇరుక్కొని పదేళ్ల జైలుశిక్షకు గురయ్యారు. పైకోర్టుకు వెళితే శిక్ష తగ్గుతుందేమోనని అప్పీలు చేస్తే.. ఆ కోర్టు పదేళ్ల శిక్షను కాస్తా యావజ్జీవ శిక్షకు పెంచింది. దీంతో పదిహేనేళ్లకు పైగా జైల్లో మగ్గుతున్నారు.. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ప్రవాసీయులు. వారిని విడిపించేందుకు స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పదేళ్లుగా ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నా.. కఠినమైన దుబాయి చట్టాలు అందుకు అవకాశం లేకుండా చేస్తున్నాయి. దీంతో తమవారు జీవితాంతం దుబాయి జైల్లో మగ్గిపోవాల్సిందేనా.. అని వారి కుటుంబసభ్యులు తీవ్ర వేదన చెందుతున్నారు. కాగా, ఇటీవల బక్రీద్‌ సందర్భంగా 505 మంది ఖైదీలకు దుబాయి రాజు క్షమాభిక్ష ప్రసాదించినా.. వీరికి మాత్రం అవకాశం దక్కలేదు. సిరిసిల్ల రూరల్‌ మండలానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవితో పాటు చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి, కోనరావుపేటకు చెందిన దుండుగల లక్ష్మణ్‌, మల్యాలకు చెందిన శివరాత్రి హన్మంతు, కొడిమ్యాలకు చెందిన సయ్యద్‌ కరీం.. ఉపాధి కోసం దుబాయికి వచ్చారు. కాగా, 2006లో దుబాయిలోని జబల్‌ అలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ సంస్థ ఆవరణలో నేపాల్‌ దేశస్తుడైన దిల్‌ ప్రసాద్‌రాయ్‌ అనే సెక్యూరిటీ గార్డు దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడ టన్నుల కొద్దీ ఉన్న ఇత్తడి విద్యుత్తు తీగలను పది మంది కలిసి దొంగిలించేందుకు ప్రయత్నించారని, అడ్డుకున్న దిల్‌ ప్రసాద్‌రాయ్‌ని వారంతా కలిసి హత్య చేశారనేది ఆరోపణ. ఈ ఆరోపణ ఎదుర్కొంటున్న నిందితుల్లో నలుగురు పాకిస్థానీయులు ఉండగా, మిగిలిన ఆరుగురు తెలంగాణకు చెందిన మల్లేశం, రవి, వెంకటి, లక్ష్మణ్‌, హన్మంతు, సయ్యద్‌ కరీ ఉన్నారు. ఈ 10 మందిని అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిలో నలుగురు పాకిస్థానీయులకు తొమ్మిదేళ్ల చొప్పున, తెలంగాణకు చెందిన ఆరుగురికి పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. 


అప్పీలుకు వెళితే పెరిగిన శిక్ష..

తెలంగాణకు చెందిన ఆరుగురిలో సయ్యద్‌ కరీం తన పదేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకొని తిరిగి వెళ్లిపోయాడు. మిగిలిన ఐదుగురు ఈ లోగానే.. శిక్ష తగ్గుతుందనే ఆశతో పైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. అయితే, ఈ నిర్ణయం వారి పాలిట అశనిపాతమైంది. కేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం (అరబ్బీ భాషలో ‘నజ్ల ఖజాయా’).. ఈ హత్య కేసును క్రూరమైన నేరం (జినయా)గా పరిగణించింది. మల్లేశం, రవి, వెంకటి, లక్ష్మణ్‌, హనుమంతులకు కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను 2015లో.. ఇస్లామిక్‌ షరియా చట్టంలోని తజారియా కింద యా వజ్జీవ కారాగార శిక్షకు పెంచింది. దోషులు సెక్యూరిటీ గార్డును అనేకసార్లు కత్తితో దారుణంగా పొడిచారని, అతడు అరవకుండా ఉండేందుకు నోట్లో ఇసుక పోశారని ధర్మాసనం పేర్కొంది. మృతుడి శరీరంపై దోషుల వేలిముద్రలు లభించాయని, నేరం నుంచి తప్పించుకునేందుకు కత్తిని పూడ్చిపెట్టడంతో పాటు అక్రమంగా సరిహద్దులు దాటేందుకు వారు ఒమన్‌ వైపు పారిపోయేందుకు ప్రయత్నించారని ఇవన్నీ తీవ్రమైనవని తెలిపింది. ఈ మేరకు వారికి ‘ముబ్బాద్‌’ కింద యావజ్జీవ కారగార శిక్ష విధించింది. అయితే దుబాయి లో ముబ్బాద్‌ శిక్ష పడ్డ దోషులు 25 ఏళ్ల వరకు విడుదల కావడం కష్టం. 


ఫలించని మంత్రి కేటీఆర్‌ ప్రయత్నాలుసాధారణంగా హతుడి కుటుంబసభ్యులకు దోషుల తరఫువారు దియా రూపంలో నగదు సాయం చేసి.. వారి సంతకంతో కూడిన మాఫీనామా సంపాదిస్తే కేసు నుంచి దోషులకు విము క్తి లభించే అవకాశాలుంటాయి. దీంతో ఐదుగురు సిరిసిల్ల జిల్లా వాసులు పదేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న కాలంలోనే వారి కుటుంబ సభ్యులు.. తమ వారిని విడిపించాలంటూ 2013లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నేటి మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నారు. ఈ మేరకు ఆయన పలు ప్రయత్నాలు చేసి నా ఫలించకపోవడంతో చివరికి స్వయంగా నేపాల్‌ కు వెళ్లి.. మృతుడి కుటుంబసభ్యులకు దియా కింద రూ.15 లక్షలు చెల్లించారు. వారి నుంచి మాఫీనామా పత్రాన్ని తీసుకొచ్చారు. కానీ, ఈలోగా వారి శిక్ష యావజ్జీవంగా మారడంతో వారిని విడిపించాలన్న కేటీఆర్‌ ప్రయత్నం ఫలించలేదు.


ఈ ఐదుగురు యావజ్జీవ కారాగార శిక్షకు గురైంది షరియాలోని తజారియా కింద కావడంతో దియా, మాఫీనామాకు అవకాశం లేకుండా పోయింది. వీరి నేరాన్ని జినయా (క్రూరమైనది)గా పైకోర్టు పరిగణించడమే ఇందుకు కారణం. ఒకవేళ రెండు దేశాల మధ్య పరస్పర ఖైదీ ల మార్పిడి ఒప్పందం మార్గంలో వెళ్లాలని చూసినా జినయా ఖైదీలను బదిలీ చేయడానికి వీల్లేదని దుబాయి చట్టాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఐదుగురి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే దుబాయిలోని ఒక మహిళ.. షరియా చట్టంపై అవగాహన లేకుండా ఈ కేసును తప్పుదోవ పట్టించిందని ఖైదీలు ఆరోపిస్తున్నారు. సాధారణంగా బక్రీద్‌, రంజాన్‌ పండుగల వేళ దుబాయిలోని ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంటారు. ఈ సారి కూడా బక్రీద్‌ నేపథ్యంలో 505 మందికి దుబాయి రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. సిరిసిల్ల వాసులు సైతం ఇందుకు దరఖాస్తు చేసుకున్నా.. అవకాశం దక్కలేదు.

Updated Date - 2022-07-19T13:23:57+05:30 IST