పంచ ప్రతిజ్ఞలు

ABN , First Publish Date - 2022-08-16T07:04:22+05:30 IST

దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, కుటుంబపాలన, ఆశ్రితపక్షపాతం నుంచి విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని.. అవినీతిపై సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అవినీతిపరులను ద్వేషించాలని ప్రజలకు సూచించారు. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ను...

పంచ ప్రతిజ్ఞలు

దేశాభివృద్ధి కోసం భారతీయులకు ప్రధాని మోదీ నిర్దేశం

స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ను

అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యం

దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, కుటుంబ పాలన

అవినీతి కేసుల్లో దోషులను, జైలుకు వెళ్లినవారిని

కీర్తించేందుకు కొందరు దిగజారడం విచారకరం

సమాజంలో అవినీతిపరులపై అసహ్యం పెరగాలి

గత ఎనిమిది సంవత్సరాల్లో రూ.2 లక్షల కోట్లు 

అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లకుండా ఆపగలిగాం

గత ప్రభుత్వాల హయాంలో బ్యాంకుల్ని లూటీ

చేసి పరారైనవారిని స్వదేశానికి రప్పిస్తున్నాం

పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ


‘‘అవినీతిపరులు దేశాన్ని చెదపురుగుల్లా తినేస్తున్నారు. దీనిపై పోరాడాలి. ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తూ నిర్ణయాత్మక దశకు చేర్చాలి. ఇవాళ నేను ఈ యుద్ధంలో పోరాడటానికి మీ మద్దతు, సహకారం కోరడానికే మీ ముందుకు వచ్చాను. ఈ యుద్ధంలో దేశం విజయం సాధిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను’’  

న్యాయస్థానంలో అవినీతి కేసుల్లో దోషులుగా తేలిన తర్వాత లేదా అలాంటి కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా.. వారిని కీర్తించేందుకు కొందరు ఎంతగానో దిగజారడం నిజంగా విచారకరం. సమాజంలో అవినీతిపరులపై అసహ్యం పెరిగేదాకా ఇటువంటివారి మనస్తత్వం బాగుపడదు.

పందాగ్రస్టు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ


న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, కుటుంబపాలన, ఆశ్రితపక్షపాతం నుంచి విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని.. అవినీతిపై సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అవినీతిపరులను ద్వేషించాలని ప్రజలకు సూచించారు. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఐదు ప్రతిజ్ఞలు చేయాలని ప్రధాని నిర్దేశించారు. ‘‘భారతదేశం ఇప్పుడు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ పెద్ద లక్ష్యం.. అభివృద్ధి చెందిన భారతదేశమే. అది తప్ప మరేమీ కాదు’’ అని స్పష్టం చేశారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సోమవారం ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. జాతినుద్దేశించి ప్రసంగించారు. సంప్రదాయ కుర్తా, చుడీదార్‌, నీలిరంగు జాకెట్‌ ధరించి, జెండా రంగులున్న తెలుపు తలపాగాను ధరించారు. దాదాపు 83 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో ఆయన.. అవినీతి, ఆశ్రితపక్షపాతం, వంశపాలన, సహకార సమాఖ్య, భిన్నత్వంలో ఏకత్వం, లింగ సమానత్వం, పరిశోధన, సృజన తదితర అంశాల గురించి ప్రస్తావించారు. స్వేచ్ఛా భారతంలో పుట్టి చారిత్రక ఎర్రకోట బురుజుల నుంచి ప్రియమైన దేశవాసుల వెలుగులను కీర్తించే అవకాశం  తనకు కలిగిందని.. స్వాతంత్ర్యానంతరం జన్మించి ఆ స్థాయికి చేరిన తొలి భారతీయుడిగా తాను నిలిచానని సగర్వంగా పేర్కొన్నారు. 


అవినీతిపై..

దేశాన్ని చెదపురుగులా పట్టి పీడిస్తున్న అవినీతిపై చేస్తున్న పోరాటంలో భారతదేశం ఒక నిర్ణయాత్మకమైన శకంలోకి అడుగుపెట్టిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, ఆధార్‌, మొబైల్‌ వంటి అన్ని ఆధునిక వ్యవస్థలనూ వాడుకుంటూ గత ఎనిమిదేళ్లలో రూ.2 లక్షల కోట్ల మేర అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా చేశామని, ఆ సొమ్మును దేశాభివృద్ధికి ఖర్చు చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులను లూటీ చేసి దేశం నుంచి పారిపోయిన వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడమే కాకుండా వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని.. కొందరు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అలాగే.. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం రాజకీయాల్లోనే కాక దేశంలోని అన్ని వ్యవస్థల్లోకీ వ్యాపించాయని, ప్రతిభను అణగదొక్కుతున్నాయని మోదీ ఆందోళన వెలిబుచ్చారు. కాబట్టి.. దేశ రాజకీయాలతోపాటు, అన్ని వ్యవస్థల నుంచి ఈ ఆశ్రితపక్షపాత నిర్మూలనకు జాతీయ జెండా సాక్షిగా ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. 


ఐదు ప్రతిజ్ఞలు..

వచ్చే రెండున్నర దశాబ్దాల్లో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు ఐదు ప్రతినలు పూనాలని ప్రధాని మోదీ నిర్దేశించారు. ఆ ఐదూ ఏంటంటే.. అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యం, వలసవాద ఆలోచనలను మనసు నుంచి తొలగించడం, మన మూలాలను చూసి గర్వించడం, ఐక్యత, పౌరుల్లో జవాబుదారీ తనం. ‘‘2047లో దేశం వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించుకునే సమయానికి ఈ పంచ ప్రతిజ్ఞలతో స్వాతంత్య్ర యోధుల కలలు సాకారం చేసే బాధ్యతను మనం స్వీకరించాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. అలాగే.. పోటీ తత్వం గల సహకార సమాఖ్య నేటి అవసరమని.. విభిన్న రంగాల్లో పురోగతికి రాష్ట్రాల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఏర్పడాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పుడు.. ప్రపంచం యావత్తూ ఏం చేయాలో నిర్ణయించుకోలేని సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు.. నిర్దిష్ట కాలపరిమితిలోనే మన దేశం 200 కోట్ల వ్యాక్సినేషన్ల మైలురాయిని చేరిందని గుర్తుచేశారు.




దేశీ శతఘ్నుల వందనం

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా సోమవారం నిర్వహించిన 21 శతఘ్నుల వందనంలో భాగంగా.. ఈసారి దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు ‘ఏటీఏజీఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ టౌడ్‌ ఆర్టిలరీ గన్‌ సిస్టమ్‌)’ హోవిట్జర్లను వినియోగించారు. ఈ విషయాన్ని మోదీ తన ప్రసంగంలో సగర్వంగా ప్రకటించారు. ‘‘మిత్రులారా! స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత.. దేనికోసమైతే ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నామో ఆ ‘మోత’ను ఇవాళ మనం విన్నాం. తొలిసారి ‘భారత తయారీ’ ఫిరంగి గర్జించి, త్రివర్ణ పతాకానికి వందనం చేసింది. ఈ శబ్దంతో భారతీయులందరూ స్ఫూర్తిపొందుతారు’’ అని ఆయన పేర్కొన్నారు.


స్వావలంబన..

తాము ప్రవేశపెట్టిన పీఎల్‌ఐ (ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాల) పథకం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం భారతదేశానికి వస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. వారు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకొస్తున్నారని.. తద్వారా కొత్త ఉపాధి అవకాశాలు రావడమే కాక, భారతదేశం తయారీ కేంద్రంగా రూపొందుతోందని, స్వయం సమృద్ధ భారతదేశానికి పునాదులు పడుతున్నాయ న్నారు. ఇంధన రంగంలో ఎంతకాలం ఇతర దేశాలపై ఆధారపడతామని ప్రశ్నించిన ప్రధాని.. ఇకనైనా స్వావలంబన సాధించాలని ప్రతినబూనారు. ఏ సందర్భంలో అయినా మ నం ఇతరుల వైపునకు చూడకూడదని.. స్వయం శక్తితో ఎదిగి, మన సామర్థ్యాన్ని మనమే పొందాలన్నదే మన ఆకాంక్ష కావాలని పిలుపునిచ్చారు. 


మహిళా శక్తి..

ఇటీవలి కాలంలో దేశంలో మహిళలపై దూషణాత్మక, అనుచిత పద ప్రయోగం సర్వసాధారణంగా మారిపోతోందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మన దైనందిన జీవితంలో స్త్రీలను కించపరిచే, అవమానించే ప్రతి ప్రవర్తనను, సంస్కృతిని వదిలించుకుందామని ప్రతినబూనలేమా? జాతి కలలను సాకారం చేసుకోవడంలో మహిళల ఆత్మగౌరవం మనకు అతిపెద్ద సంపద కానుంది. అన్నింటా నారీ శక్తి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటోంది’’ అన్నారు.  


జై అనుసంధాన్‌..

లాల్‌ బహదూర్‌ శాస్త్రి స్ఫూర్తిదాయక నినాదం ‘జై జవాన్‌- జై కిసాన్‌’ నేటికీ మన గుండెల్లో మారుమోగుతుంటుందని.. దానికి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ’జై విజ్ఞాన్‌‘ అనే మరో కొత్త నినాదాన్ని జోడించారని మోదీ గుర్తుచేశారు. ‘‘దానికి మేం అత్యంత ప్రాధాన్యమిచ్చాం. అయితే, ప్రస్తుత అమృతకాల దశలో దీనికి ‘జై అనుసంధాన్‌’ అనే నినాదాన్ని కూడా జోడించడం అత్యవసరం’’ అంటూ పరిశోధన, సృజనల ప్రాముఖ్యాన్ని వివరించారు. ఈ ‘అమృత కాలం’లో ‘సమష్టి కృషి’ (సబ్‌ కా ప్రయాస్‌) అవసరం.  130 కోట్ల మంది దేశ పౌరులు జట్టుగా ముందడుగు వేయడం ద్వారా భారతదేశం తన కలలన్నిటినీ సాకారం చేసుకుంటుంది.’’ అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముక్తాయించారు.


టెలీ ప్రాంప్టర్‌ లేకుండానే..

వరుసగా తొమ్మిదో ఏడాది ఎర్రకోటపై జెండా ఎగురవేసిన అనంతరం.. జాతినుద్దేశించి ప్రధాని మోదీ దాదాపు 83 నిమిషాలపాటు చేసిన ప్రసంగం టెలీ ప్రాంప్టర్‌ లేకుండానే సాగింది. ఈ ప్రసంగానికి ఆయన పాత పద్ధతిలో పేపర్‌ నోట్స్‌నే వాడుకున్నారు. 2014లో చేసిన తొలి ప్రసంగ సమయంలో కూడా ఆయన పేపర్‌;ర కొన్ని ముఖ్యాంశాలను రాసుకుని.. వాటి ఆధారంగా ప్రసంగం చేసినట్లు చెబుతారు.


డిజిటల్‌ ఇండియా..

మనమంతా ఇప్పుడు డిజిటల్‌ ఇండియా నిర్మాణాన్ని వీక్షిస్తున్నామని.. స్టార్ట్‌పలవైపు చూస్తున్నామని.. దీనికి కారణమైనవారంతా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు, గ్రామాలకు చెందిన పేద కుటుంబాల్లోని ప్రతిభావంతులేనని గుర్తుచేశారు. సమగ్ర ఆరోగ్య సంరక్షణ గురించి చర్చింకుంటున్న ప్రపంచమంతా నేడు మన యోగా, ఆయుర్వేదంతో పాటు భార త సమగ్ర జీవనశైలి వైపు చూస్తోందని వివరించారు. 

Updated Date - 2022-08-16T07:04:22+05:30 IST