ltrScrptTheme3

ఐదేళ్ల బాలుడు... డిప్యూటీ సీఎంకి కొత్త ఫ్రెండ్

Oct 8 2021 @ 17:15PM

న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోసిడియాకు తాజాగా ఓ అద్భతమైన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడితో కలిసి ఉన్న ఫొటోను మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. తన కొత్త ఫ్రెండ్ మూడు భాషలు.. ఫ్రెంచ్, సంస్కృతం, ఇంగ్లిష్‌లలో అనర్గళంగా మాట్లాడగలడని పేర్కొన్నారు. అందులో విచిత్రం ఏముందని అనుకుంటున్నారా? అయితే, ఆ ఫ్రెండ్ వయసు చెప్పాల్సిందే. డిప్యూటీ సీఎం కొత్త స్నేహితుడి పేరు హితేన్ కౌషిక్. వయసు ఐదేళ్లు మాత్రమే.  


సాధారణంగా ఐదేళ్ల వయసులో పిల్లలు అక్షరాలు నేర్చుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉంటే అల్లరి చేస్తూ ఉంటారు. అయితే, హితేన్ వీరందరికీ భిన్నం. ఐదేళ్ల ఆ చిన్నారి దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లను పొల్లుపోకుండా చెబుతాడు. అంతేకాదు, అమెరికా రాష్ట్రాల పేర్లు కూడా ఇట్టే చెప్పేస్తాడు. ఆ చిన్నారితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన మనీశ్.. తనకో బుల్లి స్నేహితుడు వచ్చాడని, అతడి వయసు ఐదేళ్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఫ్రెంచ్, సంస్కృతం, ఇంగ్లిష్ భాషలను అతడు అనర్గళంగా మాట్లాడతాడని, హితేన్‌ను కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉందంటూ హితేన్‌తో దిగిన ఫొటోలను షేర్ చేశారు.


‘గూగుల్ బాయ్’గా పేరుకెక్కిన హితేన్ డిప్యూటీ సీఎం ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. ‘‘మీ సహకారం, దీవెనలకు ధన్యవాదాలు సర్’’ అని పేర్కొన్నాడు. కాగా, హితేన్‌కు ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. అందులో అతడు తన టాలెంట్‌ను బయటపెడుతూ ఉంటాడు. హితేన్ పేరు ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.