పంచవన్నెలపైథానీపట్టు

ABN , First Publish Date - 2022-05-25T07:33:44+05:30 IST

పట్టు చీరల్లో పైథానీ పట్టుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి.

పంచవన్నెలపైథానీపట్టు

ట్టు చీరల్లో పైథానీ పట్టుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. మరాఠీ పెళ్లిళ్లలో మెరిసిపోయే ఈ చీరలు నేడు దక్షిణాది రాష్ట్రాల సంప్రదాయ వేడుకల్లో ధగధగలాడిపోతున్నాయి. 2 వేల ఏళ్ల నాటి పైథానీ... మొఘలులు, మరాఠాలతో పాటు నిజాముల మనసులనూ మెప్పించింది. పెళ్లిళ్లు, పండగ వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే, దేశ వ్యాప్తంగా పేరున్న పైథానీ చీరలనే ఎంచుకోవాలి. 

భారీ జరీ బార్డరు కలిగి ఉండే పైథానీ పట్టు చీరల తయారీ ప్రత్యేక పద్ధతిలో సాగుతుంది. నూలుకు రంగులు అద్దడం మొదలు అల్లిక వరకూ పూర్తిగా చేతులనే ఉపయోగిస్తారు. ఈ చీర తయారీలో అనుసరించే డిజైన్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బుటా కోసం ప్రత్యేక టెక్నిక్‌ను ఉపయోగిస్తారు కాబట్టి, ఈ చీర ముందూ, వెనకా రెండు వైపులా అందంగా కనిపిస్తుంది. తయారీ, అల్లిక, బుటాల ఆధారంగా ఈ చీరల్లో ఐదు రకాలుగా విభజించారు. అవేంటంటే...


బంగడి మోర్‌: మరాఠీలో బంగడి అంటే ‘గాజు’ అనీ, మోర్‌ అంటే ‘నెమలి’ అనీ అర్థం. గాజు ఆకారంలో నెమళ్ల అల్లిక సాగే  చీరలను బంగడి మోర్‌ పైథానీ శారీ అంటారు. ఈ రకం చీరలు శుభకార్యాలకు హాజరయ్యేటప్పుడు ధరించడానికి అనువైనవి. 

ఎక్‌ధోతీ వీవ్‌: సింగిల్‌ షటిల్‌ పద్ధతిలో అల్లిక కొనసాగించి తయారుచేసిన చీరలివి. వార్ప్‌, వెఫ్ట్‌ నూలు రంగులు కూడా భిన్నంగా ఉంటాయి. వీటికి నరాలి బోర్డర్‌తో పాటు, చిన్న చిన్న నాణేల ఆకారంలో బుటా ఉంటుంది. ఈ రకం పట్టు చీరలు చూడడానికి సింపుల్‌గా ఉంటాయి కాబట్టి, పూజలు, వ్రతాల్లో వాడుకోవచ్చు.

సంప్రదాయ రంగుల్లో: పైథానీ చీరల్లో కాలి చంద్రకళ (ఎరుపు అంచు ఉండే నలుపు చీర), రఘు (చిలకాకుపచ్చ), శిరోడక్‌ (తెలుపు).. ఈ మూడు రంగులు కచ్చితంగా ఉంటాయి.

బ్రొకేడ్‌ పైథానీ: కొన్ని పైథానీల బార్డర్‌ బ్రొకేడ్‌తో ఉంటుంది. బ్రొకేడ్‌ పనితనాన్ని బట్టి చీర ధర పెరుగుతూ ఉంటుంది. పెళ్లిళ్లకు పైథానీ చీర ఎంచుకునేటప్పుడు బ్రొకేట్‌ పైథానీని దృష్టిలో పెట్టుకోవాలి.

మునియా బ్రొకేడ్‌ పైథానీ: మరాఠీలో మునియా అంటే ‘చిలక’. ఈ రకం చీరల పవిటల్లో, బార్డర్లలో చిలకల అల్లికలుంటాయి. ఈ చిలకలన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. వీటిని తోతా-మైనా అనే పేరు కూడా ఉంది. ఇవి కూడా భారీ చీరలే కాబట్టి భారీ వేడుకల కోసం ఈ చీరలను ఎంచుకోవాలి.

Updated Date - 2022-05-25T07:33:44+05:30 IST