వైభవంగా ధ్వజారోహణం

ABN , First Publish Date - 2021-03-03T06:41:45+05:30 IST

శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం నిర్వహించిన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.

వైభవంగా ధ్వజారోహణం
ధ్వజారోహణం నిర్వహిస్తున్న వేదపండితులు - పెద్దశేషవాహనంపై స్వామి, అమ్మవార్లు

ప్రారంభమైన కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు


చంద్రగిరి, మార్చి 2: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం నిర్వహించిన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన సేవలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవర్లను తిరుచ్చి వాహనంపై అధిష్ఠించారు. 8.30 నుంచి 8.53 గంటల మధ్య మీన లగ్నంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్ల సమక్షంలో మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ వేదపండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, జేఈవో సదా భార్గవి, ఎస్‌ఈ జగదీశ్వరరెడ్డి, డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధనంజయుడు, సూపరింటెండెంట్లు రమణయ్య, మునిచెంగల్రాయులు, అర్చకులు కంకణ భట్టర్‌ బాలాజీ రంగాచార్యులు, అర్చకులు పార్థసారధి, శేషాద్రిచార్యులు, నారాయణాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ యోగానందరెడ్డి, ఏవీఎస్వో సురేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు: ఈవో

కొవిడ్‌ నేపథ్యంలో కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. ఈనెల ఆరో తేదీన గరుడసేవ జరుగుతుందని, పదో తేదీన ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 


తిరుమల శ్రీవారి లడ్డూలు

కల్యాణ వెంకన్న ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులపాటు తిరుమల శ్రీవారి లడ్డూలను ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంచారు. రోజుకు 3వేల లడ్డూలను విక్రయిస్తారు. 


పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడి వైభవం

బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలిరోజైన మంగళవారం రాత్రి పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడు కృష్ణావతారంలో ఆలయ ఆవరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఆలయంలో ఉత్సవర్లకు ఊంజల్‌ సేవ జరిగింది. 

Updated Date - 2021-03-03T06:41:45+05:30 IST