భగ్గుమంటున్న ఇంధనం

ABN , First Publish Date - 2021-02-26T05:49:00+05:30 IST

మునుపెన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచేస్తున్న కేంద్ర ప్రభుత్వం సామాన్య జనం నడ్డివిరుస్తోంది. మూడు నెలలుగాకేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విచ్చలవిడిగా పెంచు తున్నా ప్రతిపక్షాలు మాత్రం పత్తాలేకుండా పోతున్నాయి

భగ్గుమంటున్న ఇంధనం

సెంచరీకి చేరువలో చమురు ధరలు

వరుసగా ధరల బాదుడుతో జిల్లా వాసుల విలవిల

నేటి భారత్‌బంద్‌కు సిద్ధమవుతున్న వ్యాపార వర్గాలు 

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి25 (ఆంధ్రజ్యోతి): మునుపెన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచేస్తున్న కేంద్ర ప్రభుత్వం సామాన్య జనం నడ్డివిరుస్తోంది. మూడు నెలలుగాకేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విచ్చలవిడిగా పెంచు తున్నా ప్రతిపక్షాలు మాత్రం పత్తాలేకుండా పోతున్నాయి. చమురు ధరల పెంపుతో అన్నిరకాల వ్యాపారాలు, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతోంది. ఏకంగా 33 సార్లు చమురు ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం గత రికార్డులను బద్దలు కొట్టింది. గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.39 పైసలు కాగా అదే లీటర్‌ డీజిల్‌ ధర రూ.90.41కి చేరింది. అసలే కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యాపార వర్గాలు, వాహనదారులపై పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో మోయలేని భారం పడుతోంది. ప్రధానంగా ఆటో రిక్షాలు, ట్రాన్స్‌ఫోర్టు వాహనాలు, ద్విచక్ర వాహనాలు, వ్యవసాయ రంగంపై ధరల ప్రభావం కనిపిస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా ఆర్థికంగా నష్ట పోయిన భారీ వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు దఫాల కమర్షియల్‌ ట్యాక్స్‌ను రద్దు చేయగా కేంద్ర ప్రభుత్వం మాత్రం వరుసగా చమురు ధరలను పెంచుతూ జనానికి చుక్కలు చూపిస్తోంది. రోజుకు జిల్లాపై 5లక్షల వరకు అదనపు భారం పడుతునట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే శుక్రవారం నిర్వహించే భారత్‌బంద్‌ను విజయవంతం చేసేందుకు వ్యాపార వర్గాలు సిద్ధమవుతుండగా ప్రతిపక్ష పార్టీలు బంద్‌కు మద్దతునిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయడం లేదు.

చమురు ధరలు పైపైకి..

రోజురోజుకూ చమురు ధరలు పైపైకి పోతున్నాయి. డిసెంబరు 1 నుంచి ఫిబ్రవరి 25 వరకు 33 సార్లు చమురు ధరలు పెరిగాయి. డిసెంబరు 1న లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.65 పైసలు ఉండగా ప్రస్తుతం రూ.96.39 పైసలకు చేరింది. అలాగే లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.89 పైసలు ఉండగా ప్రస్తుతం రూ.90.41కి చేరింది. పెటోల్ర్‌పై గరిష్ఠంగా సుమారుగా రూ.10 పెరుగగా డీజిల్‌పై అదే మాదిరిగా ధరలు పెరిగాయి. మరికొద్ది రోజుల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏకంగా సెంచరీకి చేరువయ్యే అవకాశం ఉందని పెట్రోల్‌బంక్‌ యజమానులు పేర్కొంటున్నారు.  అవసరమైతే తప్ప.. ద్విచక్ర వాహ నంపై బయట కు వెళ్లేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. రెక్కాడితే కాని డొక్క నిండని ఆటో రిక్షా కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పొద్దంత పని చేసినా పూడగడవడం లేదంటూ వాపోతున్నారు. అలాగే పెరిగిన ధరలతో గిరాకీలు లేక తీవ్రంగా నష్ట పోతున్నామని లారీల యజమానులు ఆందోళన చేస్తున్నారు. వ్యవసాయ సాగు పనులకు ఉపయోగించే ట్రాక్టర్‌ అద్దెలు పెరిగిపోవడంతో పెట్టుబడిభారం మరింత పెరుగుతుందని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.

నోరు మెదపని ప్రతిపక్షాలు..

కొద్ది రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా ప్రతిపక్ష పార్టీల నేతలు నోరు మెదపడం లేదు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన తెలిపి ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్షాలు పత్తాలేకుండానే పోతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అడపాదడపగా సీపీఐ, సీపీఎంలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అలాగే కాంగ్రెస్‌ పార్టీ ఒక సారి మాత్రమే నిరసన తెలిపి కనిపించకుండానే పోయింది. ప్రధాన ప్రతిపక్షాలైన టీఆర్‌ఎస్‌, టీడీపీ, ఇతర పార్టీలు నిరసన కార్యక్రమాల జోలికి అసలు వెళ్లినట్లు కనిపించడం లేదు. కనీసం పత్రిక ప్రకటనలకైనా ముందుకు రావడం లేదు.

Updated Date - 2021-02-26T05:49:00+05:30 IST