పాలేరులో ఫ్లెక్సీ వివాదం

ABN , First Publish Date - 2021-07-27T04:30:09+05:30 IST

ఫ్లెక్సీలో నాయకుల ముద్రించిన ఫొటోల ప్రాధాన్యతాక్రమం విషయమై ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి

పాలేరులో ఫ్లెక్సీ వివాదం
కూసుమంచి పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన తెలుసుతున్న తుమ్మల వర్గీయులు

 తుమ్మల, కందాల వర్గీయుల మధ్య భగ్గుమన్న విభేదాలు

పోలీస్‌స్టేషన్‌ ఎదుట తుమ్మల వర్గం నిరసన

కూసుమంచి, జూలై 26:  ఫ్లెక్సీలో నాయకుల ముద్రించిన ఫొటోల ప్రాధాన్యతాక్రమం విషయమై ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ విషయంలో ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు తుమ్మల వర్గీయులపై పోలీసు కేసు నమోదుచేయడంతో తుమ్మల వర్గీయులు సోమవారం పోలీసుస్టేషన ఎదుట నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది.

ఏం జరిగిందంటే..

ఈనెల 24న కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కూసుమంచి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చనలో భాగంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.  ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి చెందిన కూసుమంచి ఎంపీటీసీ సభ్యుడు మాదాసు ఉపేందర్‌ ఫొటోను.. డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌ ఫొటో కింద ముద్రించారని, అంతేకాకుండా తన అనుమతి లేకుండా తన ఫొటోను ఎందుకు వాడారంటూ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్‌ స్థానిక నాయకులను ప్రశ్నించారు. అంతేకాకుండా కేటీఆర్‌ జన్మదిన కార్యాక్రమానికి ఎమ్మెల్యే రాకముందే తన ఫొటోను తొలగించాలని ఉపేందర్‌ తన అల్లుడు కొండ మహిపాల్‌ను పురమాయించడంతో వెంటనే మహిపాల్‌ ఓ బ్లేడు సాయంతో తన మామ ఉపేందర్‌ ఫొటో ఉన్నంతవరకు తొలగించారు. దీంతో తాముపెట్టిన ఫ్లెక్సీలో ఫొటోను తొలగించి చించివేశాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి వర్గీయుడైన టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు చాట్లపరుశురామ్‌.. తుమ్మల వర్గీయుడైన మహిపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే కూసుమంచి ఎస్‌ఐ నందీప్‌ మహిపాల్‌పై కేసునమోదు చేశారు. ఇదిలా ఉండగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అసలు ఫ్లెక్సీలే పెట్టొద్దంటూ ఆదేశించారని, కానీ ఫ్లెక్సీలు పెట్టడమే కాకుండా తన అనుమతి లేకుండా తన ఫొటోను ముద్రించారని, అలాగే ఆర్‌అండ్‌బీ అధికారుల అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టారని ఆరోపిస్తూ ఎంపీటీసీ ఉపేందర్‌.. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పరుశురామ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా.. పోలీసులు తుమ్మల వర్గీయులపైనే కేసు నమోదుచేసి, కందాల వర్గీయులపై కేసు నమోదుచేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

తుమ్మల వర్గీయుల ఆందోళన

ఎమ్మెల్యే కందాళ వర్గీయుడు పరుశురామ్‌ ఫిర్యాదు చేసిన వెంటనే కూసుమంచి పోలీసులు తమపై కేసునమోదు చేసి.. తమఫిర్యాదును మాత్రం పక్కన పడేశారంటూ తుమ్మల వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నియోజకవర్గానికి చెందిన రామసహాయం నరేష్‌రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్‌, తమ్మినేని కృష్ణయ్య, శాఖమూరి రమేష్‌, సుధాకర్‌రెడ్డి, మాదాసు ఉపేందర్‌, బారి వీరబద్రం, కేశవరెడ్డి, అర్వపల్లి జనార్దన్‌, బారి శ్రీను, కొండా మహిపాల్‌, విష్ణు, పాపారావు తదితరులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కూసుమంచి సీఐ సతీష్‌, ఎస్‌ఐ నందీప్‌ వారి చర్చించి.. ఉపేందర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తమ ఫిర్యాదుపై బుధవారంలోపు కేసునమోదు చేయకపోతే గురువారం భారీ ఆందోళన చేపడతామని తుమ్మల వర్గీయులు ప్రకటించారు. ఇలా మాజీమంత్రి తుమ్మల, ఎమ్మెల్యే కందాల వర్గీయుల మధ్య బహిర్గతమైన విభేదాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Updated Date - 2021-07-27T04:30:09+05:30 IST