పని చేయడానికి కార్యాలయాలు ఉండవా? మోదీ మాటల భావమేమి తిరుమలేశా!?

ABN , First Publish Date - 2022-08-27T22:48:22+05:30 IST

సానుకూల పని వేళలు, ఇంటి వద్ద నుంచే పని చేసే వాతావరణం, అనుకూల పని ప్రదేశాలు

పని చేయడానికి కార్యాలయాలు ఉండవా? మోదీ మాటల భావమేమి తిరుమలేశా!?

న్యూఢిల్లీ : సానుకూల పని వేళలు, ఇంటి వద్ద నుంచే పని చేసే వాతావరణం, అనుకూల పని ప్రదేశాలు తప్పనిసరి అని, వీటిదే భవిష్యత్తు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఉద్యోగ, కార్మిక వర్గంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇది గొప్ప సదవకాశమని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక మంత్రులు, కార్యదర్శుల 44వ జాతీయ సమావేశం ఆంధ్ర ప్రదేశ్‌లోని తిరుపతిలో 2022 ఆగస్టు 25, 26 తేదీల్లో జరిగింది. ఈ సమావేశం మొదటి రోజు మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ మాటలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.


ఈ రోజులు ఇక ఉండవు

ఉదయం 9 గంటలకు కార్యాలయానికి వెళ్లి, పని చేసుకుని, సాయంత్రం ఐదు గంటలకు తిరిగి ఇంటికి వెళ్లే రోజులు త్వరలో ముగిసిపోబోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అంత వేగంగా మారిపోతోంది. దీంతోపాటు ఉద్యోగుల అవసరాలు, ఆకాంక్షలు కూడా మారుతున్నాయి. ఫలితంగా సంస్థలు కూడా ఈ మార్పులకు అనుగుణంగా వ్యవహరించవలసిన పరిస్థితి వస్తోంది. 


కోవిడ్ సమయంలో నేర్చుకున్న పాఠాలు

ఈ విషయంలో కోవిడ్-19 మహమ్మారి మంచి పాఠాలను నేర్పింది. ఉద్యోగుల ఇళ్ల వద్ద నుంచి తమ పనిని చేయించుకోగలమనే విషయాన్ని చాలా సంస్థలు అప్పుడే గుర్తించాయి. మహమ్మారి విసిరిన సవాళ్ళను ఎదిరించి, నూతన మార్గాలను అనుసరించడం ప్రారంభించాయి. టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నకొద్దీ ఉద్యోగులు తమకు  నచ్చిన సమయంలో పని చేయడం, నచ్చిన పని ప్రదేశాన్ని ఎంచుకోవడం వంటి సదుపాయాలు లభిస్తాయని గుర్తించాయి. 


ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే...

ఉద్యోగులు తమకు నచ్చిన సమయంలో పని చేయడానికి అవకాశం ఉండటమే ఫ్లెక్సిబుల్ వర్కింగ్. పార్ట్-టైమ్ వర్క్, సాధారణ సమయం (రోజుకు 8 గంటలు) కన్నా తక్కువ సమయం పని చేయడం, వారంలో తక్కువ రోజులు పని చేయడం, రోజులో కొద్ది సేపు పని చేసి, విరామం తీసుకుని, మళ్లీ మరికొంత సేపు పని చేయడం, ఇంటి వద్ద నుంచి పని చేయడం, కొంత కాలం ఇంటి వద్ద నుంచి, కొంత కాలం కార్యాలయంలో పని చేయడం వంటివన్నీ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ పరిధిలోకి వస్తాయి. ఫ్లెక్సిబుల్ వర్కర్స్ తమ కుటుంబాలను వదిలిపెట్టి, సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసిన అవసరం ఉండదు. వెబినార్స్ వంటి ఆన్‌లైన్ సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు.




ప్రొడక్టివిటీ ఎక్కువ

నిర్ణీత పని వేళలు, పని దినాల్లో పని చేసేవారి ప్రొడక్టివిటీ కన్నా ఫ్లెక్సిబుల్ వర్కర్స్ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పైగా ఫ్లెక్సిబుల్ వర్కర్స్ తమ సంస్థల పట్ల ఎక్కువ విధేయంగా ఉంటున్నట్లు తెలిపాయి. సంస్థల యాజమాన్యాలకు కావలసింది కూడా ఇదే కదా!


వ్యక్తిగత ప్రయోజనాలు

నచ్చినపుడు పని చేసే ఉద్యోగులకు నిద్ర సక్రమంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. మనసు సకారాత్మకంగా (పాజిటివ్‌గా) ఉంటుంది. వీరు తమ పని, సొంత జీవితం సమతుల్యంగా ఉండేలా చూసుకోగలుగుతారు. తమ జీవితాన్ని అర్థవంతం చేసుకోగలుగుతారు. ఫలితంగా ఉద్యోగులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. అయితే కొందరు ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోం వల్ల తాము తమ సహోద్యోగులతో మాట్లాడుతూ, కొత్త విషయాలను నేర్చుకోవడం సాధ్యం కాదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు చెప్తున్నదాని ప్రకారం, కేవలం కార్యాలయం, పని ప్రదేశం గురించి ఆలోచించడం మానుకుని, ‘‘అత్యున్నత స్థాయి పనితీరును ప్రోత్సహించే ప్రదేశం’’ గురించి ఆలోచించాలి. 


మార్పు మొదలైంది

వీడియో కాలింగ్, క్లౌడ్ కొలాబరేషన్ వంటి కీలక సాంకేతిక సదుపాయాల వల్ల పని వాతావరణం ఇప్పటికే మారిపోయింది. చాలా సంస్థలు తమ కార్యాలయాలకు వెలుపల నుంచి సేవలు పొందుతున్నాయి. ఉద్యోగులు తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలనుకుంటారో, దానినిబట్టి వారు పని చేసే విధానం ఆధారపడి ఉంటోంది. కాబట్టి రాన్రానూ టెక్నాలజీ అభివృద్ధితోపాటు దానికి అనుగుణమైన జీవనశైలి ఆధారిత వైఖరి రూపొందుతుంది. 




అవసరాన్నిబట్టి...

ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పని చేయడాన్ని ప్రోత్సహించడానికి కూడా టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు కుదురుగా కూర్చొని, మనసు నిలకడగా ఉంచుకుని ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. అందుకు అనుగుణంగా ఫోన్లు, ఇతరుల సంభాషణలు వంటివేవీ లేకుండా ప్రశాంత ప్రాంతం (quiet zones)ను ఏర్పాటు చేయవచ్చు. మరికొన్నిసార్లు కొలీగ్స్‌తో సరదాగా ఆటలు ఆడుకుంటూ పని చేసే ఏర్పాట్లు చేయవచ్చు. కృత్రిమ మేధాశక్తి (Artificial Intelligence)తోకూడిన సెక్యూరిటీ గార్డ్స్, యాప్ కంట్రోల్డ్ మీటింగ్ రూమ్స్ , వేడి, వెలుతురును నియంత్రించే స్మార్ట్ సెన్సర్లు, వాయిస్, ఫేషియల్ రికగ్నిషన్ సర్వీసెస్, మానసిక స్థితిని గుర్తించే సెన్సర్లు వంటివాటిని ఏర్పాటు చేయవచ్చు. మరోవైపు హైపర్-రియలిస్టిక్ వర్చువల్ రియాలిటీ ఆఫీస్ ఎన్విరాన్‌మెంట్‌ను సృష్టించాలని ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోంది. దీనిలో వర్కర్స్ వీఆర్ హెడ్‌సెట్స్‌తో పరస్పరం సంప్రదించుకునే అవకాశం కల్పించాలని చూస్తోంది. 


ఆ మూడు ప్రధానం

క్లౌడ్ ప్లాట్‌ఫామ్, వీడియో కాన్ఫరెన్సింగ్, ఉద్యోగుల వద్ద ఉండే ల్యాప్‌టాప్ వంటి సొంత డివైస్‌లు ఫ్లెక్సిబుల్ వర్కింగ్‌ను సులభతరం చేస్తున్నాయి. క్లౌడ్ ప్లాట్‌ఫామ్ వల్ల ఉద్యోగులు డాక్యుమెంట్లను సులువుగా యాక్సెస్ చేయగలుగుతారు. వారు ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా డేటా స్టోరేజ్, కొలాబరేషన్ టూల్స్ అందుబాటులో ఉంటాయి. ఫిజికల్ హార్డ్‌వేర్ అవసరం లేకుండానే తమకు అవసరమైన ఏ సమాచారాన్నయినా యాక్సెస్ చేయగలుగుతారు. వీడియో కాన్ఫరెన్సింగ్‌కు కూడా క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులు కార్యాలయంలోని అధికారులు, సహోద్యోగులతో సులువుగా మాట్లాడుకోవడానికి వీలవుతుంది. క్లయింట్లు, కస్టమర్లతో కూడా సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ఉద్యోగులు తమ సొంత డివైస్‌లను వాడటం వల్ల వారికి, సంస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. 


మన దేశానికి చాలా అవసరం

ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే, మహిళా శక్తిని ఉద్యోగ వర్గంలోకి సంపూర్ణంగా తీసుకురావాలంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మన దేశానికి చాలా అవసరం. మొదటి మూడు పారిశ్రామిక విప్లవాల్లోనూ మనం చాలా వెనుకబడిపోయాం. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవంలోనైనా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి.  ప్రపంచం నేడు డిజిటల్ శకంలోకి ప్రవేశిస్తోంది. యావత్తు ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ షాపింగ్, ఆన్‌లైన్ ఆరోగ్య సేవలు, ఆన్‌లైన్ ట్యాక్సీ, ఆన్‌లైన్ ఫుడ్ అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ కృషికి, ప్రజల సహకారం తోడైతే ఈ రంగంలో మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపవచ్చు. 


                                                                                       - యెనుములపల్లి వేంకట రమణ మూర్తి



Updated Date - 2022-08-27T22:48:22+05:30 IST