త్వరలోనే భారత్ నుంచి సౌదీకి విమానాలు: భారత రాయబారి

ABN , First Publish Date - 2020-11-28T20:10:37+05:30 IST

అతి త్వరలోనే భారతదేశం నుంచి సౌదీ అరేబియాకు విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయని సౌదీలోని భారత రాయబారి డా. ఔసఫ్ సయీద్ వెల్లడించారు.

త్వరలోనే భారత్ నుంచి సౌదీకి విమానాలు: భారత రాయబారి

రియాధ్: అతి త్వరలోనే భారతదేశం నుంచి సౌదీ అరేబియాకు విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయని సౌదీలోని భారత రాయబారి డా. ఔసఫ్ సయీద్ వెల్లడించారు. ఇటీవల ఎంబసీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సయీద్ ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా, కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మార్చి నుంచి పూర్తిగా విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, వందే భారత్ మిషన్‌లో భాగంగా రెండు దేశాల మధ్య ప్రత్యేక విమానాలు మాత్రం నడుస్తున్నాయి. కానీ, భారీ సంఖ్యలో విమానాల రాకపోకలు ఇంకా మొదలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణకై చర్చలు జరుగుతున్నట్లు భారత రాయబారి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం దిశగా చర్చలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో త్వరలోనే ప్రవాసులకు తీపి కబురు అందనుందని తెలిపారు.


ఇక రెండు దేశాల మధ్య ప్రత్యేక విమానాలు తప్పితే వేరే విమానాలు నడవకపోవడంతో ప్రవాసులు సౌదీ వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కనుక విమాన సర్వీసులు ప్రారంభమైతే చాలా మంది హెల్త్ వర్కర్లు భారత్ నుంచి సౌదీ వెళ్లేందుకు మార్గం సుగమమం అవుతోంది. త్వరలోనే ప్రవాసులు ఈ విషయంలో గుడ్‌న్యూస్ వింటారని రాయబారి ఔసఫ్ సయీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటివరకు ఇండియాతో 22 దేశాలు ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకున్నాయి. ఈ దేశాల జాబితాలో అమెరికా, కెనడా, యూకే, యూఏఈ, ఉక్రెయిన్, టాంజానియా, రవాండా, ఖతార్, ఒమన్, నైజిరియా, నెదర్లాండ్స్, మాల్దీవులు, కెన్యా, జపాన్, ఇరాక్, జర్మనీ, ఫ్రాన్స్, ఈథోపియా, భూటాన్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, ఆఫ్గనిస్థాన్ ఉన్నాయి.     

Updated Date - 2020-11-28T20:10:37+05:30 IST