బాబు భరోసా

ABN , First Publish Date - 2022-07-22T06:34:15+05:30 IST

కలపర్రు టోల్‌ప్లాజా వద్ద దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు స్వాగతం పలికారు.

బాబు భరోసా
అయోధ్యలంకలో వరద నీటిలో ట్రాక్టర్‌పై వెళుతున్న చంద్రబాబు

వరద ప్రాంతాలలో చంద్రబాబు పర్యటన

బోటు, ట్రాక్టర్‌పై బాధితుల చెంతకు..

వరద నష్టాలను చూసి చలించిన బాబు

బురదలోనే.. పూరిపాకల్లోకి వెళ్లి పరామర్శ

అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని హామీ

ఫ్యాక్షన్‌ రాజకీయాలొద్దని జగన్‌కు హితవు

ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యారని ఫైర్‌

కలపర్రు నుంచి పోడూరు వరకు అఖండ స్వాగతం.. భారీ ర్యాలీ

ఎక్కడికక్కడ నీరాజనాలు పలికిన జనం 


వరద బాధితులకు టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా కల్పించారు. వరద సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైనా తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆచంట మండలం అయోధ్యలంకలో బాధితులను పరామర్శించేందుకు గురువారం విజయవాడ నుంచి ఏలూరు జిల్లా మీదుగా పశ్చిమ గోదావరి వచ్చిన చంద్రబాబుకు ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. 


భీమవరం/ఏలూరు/ఆచంట, జూలై 21(ఆంధ్రజ్యోతి): కలపర్రు టోల్‌ప్లాజా వద్ద దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏలూరు వద్ద బడేటి చంటి, ఉంగుటూరు వద్ద పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ గన్ని వీరాంజనేయులు, అలంపురం లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి, దువ్వలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పెరవలిలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సిద్ధ్దాంతం చేరుకునే సరికి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఎదురేగి వచ్చారు. మాట్లాడాలంటూ ఆయనను ప్రతీచోటా పట్టుబట్టారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళుతున్నానని, మాట్లాడడం సబబు కాదంటూ వారిని చంద్రబాబు వారించారు. అనుకున్న సమయంకంటే దాదాపు రెండు గంటలకుపైగా ఆలస్యంగా సాగిన చంద్రబాబు ప్రయా ణం మధ్యాహ్నానికి సిద్దాంతం చేరుకున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సహా ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కాన్వాయ్‌ వాహనం ఎక్కి అయోధ్య లంకకు పయనమయ్యారు. నడిపూడి, చినమల్లం, పెదమల్లం, కరుగోరుమిల్లి మీదుగా పోడూరు చేరుకున్నారు. నడిపూడి, చినమల్లంలో ప్రజలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ‘జగన్‌ కుక్క తోక వంకరన్నట్లుంది. అందుకే చాక్లెట్‌ ఇచ్చి గొలుసు కట్టేస్తారు జాగ్రత్త.. ఎక్కడిక్కడ నిలదీయండి. అల్లూరి స్ఫూర్తితో పోరాడండి.. అంటూ తెలుగుదేశం నేత చంద్రబాబు జిల్లావాసులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర అధోగతి పాలైందని అధికారం వస్తే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు’ అంటూ నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రభుత్వ హయాం లో నిర్మించిన మరుగుదొడ్లపైనా పన్నులు వేస్తున్నారు. ఇదేమి చెత్త ప్రభుత్వం.. పనికిరాని ప్రభుత్వం.. దద్దమ్మ ప్రభుత్వమంటూ మండిపడ్డారు. ప్యాక్షన్‌ రాజకీయాలు ఉభయ గోదావరి జిల్లాల్లో చేస్తే స్థానిక నాయకులంతా వడ్డితోసహా చెల్లించాల్సి వస్తుందంటూ చంద్రబాబు విరుచుకుపడారు. జనం మీద పన్నుల భారం పెంచుతున్నారని విడకకుండా బాదుడే బాదుడు అంటున్నారని సీఎంను ఉద్దేశించి వాఖ్యలు చేశారు.  మధ్యాహ్నం రెండు గంటలకు పంటులోకి చంద్రబాబు చేరుకున్నారు. ఆయన వెంట పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రులు పీతల సుజాత, దేవినేని ఉమ, చినరాజప్ప, ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణ, అంగర రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, వేటుకూరి శివ, నియోజకవర్గ ఇన్‌ చార్జిలు వలవల బాబ్జి, పొత్తూరి రామరాజు, కొక్కిరిగడ్డ జయరాజు  తదితరులు ఉన్నారు. పంటు అయోధ్యలంక చేరే సరికి మూడు గంటలు దాటింది. ట్రాక్టర్‌పై ఆయోధ్యలంకలో చంద్రబాబు పర్యటించి బాధితులను పరామర్శించారు. గోదావరి తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాలన్నీ బురదలోనే ఉన్నాయి. అయినా ఇవేమి పట్టించుకోకుండా బాధితులను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాహసం చేశారు. ఆచంట మండలంలో వరద ముంపు బారిన పడిన లంక గ్రామాలైన పల్లెపాలెం, అయోధ్యలంక, పుచ్చల్లంక, మర్రిమూల, పుచ్చల్లంకలో గురువారం ఆయన పర్యటించి బాధిత లంకవాసులను ఆప్యాయతతో పలకరించారు. మర్రిమూలలో రహదారులన్నీ బురదమయంగా ఉన్నప్పటికి ట్రాక్టర్‌పై గ్రామం అంతా తిరిగి వారి కష్టాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. గోదావరి వరద మిగిల్చిన దృశ్యాలను చూసి చంద్రబాబు చలించారు. కూలిన ఇళ్లను చూసి ట్రాక్టర్‌ దిగిపోయారు. బురదలోనే పూరి పాకల్లోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితుల గోడు విన్నారు. బాధితులకు కనీస వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తూర్పారబెట్టారు. అయోధ్యలంక గ్రామస్థులు వరద నష్టాలతో కూడిన వినతి పత్రాలను అందించారు. అరటి, తమలపాకులు, మిరప, కూరగాయలు వంటి పంటలు దెబ్బతిన్నాయని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతీ రైతు వేల రూపాయిలు నష్టపోయారు. ప్రభుత్వం మాత్రం రూ.2 వేలు మాత్రమే చేతిలో పెట్టి తప్పించుకుందంటూ చంద్రబాబు విమర్శించారు. అయోధ్యలంకలో 1,570 మంది ఉంటే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఒక బోటు మాత్రమే పెట్టారు. కనీసం భోజన సదుపాయం కల్పించలేదు. ముఖ్యమంత్రి విమానంలో తిరిగి వెళ్లిపోయారు. వరద బాగోగులు ఆయనకు పట్టడం లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించాలని స్పష్టం చేశారు. లేదంటూ పదే పదే వచ్చి ప్రభుత్వం స్పందించే చేస్తానంటూ స్పష్టం చేశారు. తొలుత కోడేరు నుంచి పంటుపై చంద్రబాబు, ముఖ్య నాయకులు, నేతలు, ఇతర పడవలపై కార్యకర్తలు, అభిమానులు వెన్నంటి సాగారు. మాజీ మంత్రి పితానిగోదావరి స్థితి, లంక గ్రామాల స్థితిని బాబుకు వివరించారు. అయోధ్యలంక పర్యటన అనంతరం చంద్రబాబుకు కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సోంపల్లికి పయనమయ్యారు. 



Updated Date - 2022-07-22T06:34:15+05:30 IST