వీడని వరద నీరు

ABN , First Publish Date - 2022-01-02T16:50:10+05:30 IST

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం జిల్లాలతో పాటు మొత్తం పది జిల్లాలకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం శనివారం ‘ఆరెంజ్‌ అలెర్ట్‌’ ప్రకటించింది. ఈ జిల్లాల్లో

వీడని వరద నీరు

- మూడు రోజులుగా నగర వాసుల ఇక్కట్లు 

- రెండు సబ్‌ వేల మూసివేత 

- ట్రాఫిక్‌ మళ్లింపు


అడయార్‌(చెన్నై): గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం జిల్లాలతో పాటు మొత్తం పది జిల్లాలకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం శనివారం ‘ఆరెంజ్‌ అలెర్ట్‌’ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కానీ, పెద్దగా వర్షం కురవకపోవడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అదేసమయంలో గత మూడు రోజులుగా నగరంలో కురిసిన ఆకస్మిక వర్షాలతో చెన్నై మహా నగరంలోని అనేక ప్రాంతాలు మరోమారు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా గురువారం  కురిసిన వర్షానికి చెన్నై నగరం నీటితో నిండిపో యింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. అన్ని ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో మోకాలి లోతు నీటితో నిండిపోయాయి. వెస్ట్‌ మాంబాళం, కేకేనగర్‌, వ్యాసార్పాడి, సాలిగ్రామం, వడపళని, కోడంబాక్కం, తిరువళ్ళికేణితో సహా అనేక ప్రాంతాల్లోని గృహాల్లోకి నీరు వచ్చిచేరింది. ముఖ్యంగా కేకే నగర్‌, వెస్ట్‌ మాంబాళం, కొరట్టూరు ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక ఇళ్లు జలదిగ్బంధంలోనే చిక్కుకుని వున్నాయి. రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు కుండపోత వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు చెన్నై నగరంతో పాటు రాష్ట్రంలో భారీ వరదలు సంభవించాయి. తర్వాత గత 25 రోజులుగా వర్షాలు పడలేదు అయితే, గురువారం ఉదయం నుంచి ఆకస్మికంగా మరో మారు ఎవరూ ఊహించని విధంగా భారీ వర్షం కురిసింది. దీంతో నగరం పూర్తిగా జలమయమైంది. అనేక ప్రాంతాలు ఇప్పటికీ వర్షపు నీటిలోనే వున్నాయి. ఈ వర్షపునీటిని తొలగించే పనుల్లో నగర పాలక సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమై రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇదిలావుంటే, రాష్ట్ర కోస్తా తీరు ప్రాంతానికి సమీపంలో ఏర్పడివున్న ఉపరితల ఆవర్తనద్రోణి ప్రభావం కారణంగా కోస్తాతీర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా డెల్టా జిల్లాలతో పాటు కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్ళూరు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురుస్తుందని తెలిపి, ఈ జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ను ప్రకటించింది. నగరంలో టి.నగర్‌లోని మ్యాడ్లీ సబ్‌వే, రంగరాజపురం ద్విచక్ర వాహన సబ్‌వేలను మూసివేసినట్టు చెన్నై నగర పాలక సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే, కేకే నగర్‌, రాజామన్నార్‌ శాలై, కేబీ దాసన్‌శాలై, టీటీకే 1వ క్రాస్‌ వీధి, తిరుమల పిళ్ళై రోడ్డు, బజుల్లా రోడ్డు, పెరియార్‌ రోడ్లలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరింది. ప్రధానంగా వెస్ట్‌ మాంబళం, అయోద్య మండపం, తంబయ్య రోడ్డు, ఆర్యగౌడ రోడ్డు, పోస్టల్‌ కాలనీ, కేకే నగర్‌ రాజా సహా పలు వీధుల్లో ఇళ్లు ఇంకా వర్షపునీటిలోనే ఉన్నాయి.

Updated Date - 2022-01-02T16:50:10+05:30 IST