flood: వరద పోయింది...బురద మిగిలింది

ABN , First Publish Date - 2022-07-26T02:14:23+05:30 IST

గోదావరి నది మహోగ్రరూపం దాల్చి గ్రామాలకు గ్రామాలనే ముంచివేయగా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మెరక ప్రాంతాలకు తరలిపోయి తమ ప్రాణాలను నిలబెట్టుకున్నారు.

flood: వరద పోయింది...బురద మిగిలింది

కుక్కునూరు: గోదావరి నది మహోగ్రరూపం దాల్చి గ్రామాలకు గ్రామాలనే ముంచివేయగా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మెరక ప్రాంతాలకు తరలిపోయి తమ ప్రాణాలను నిలబెట్టుకున్నారు. కానీ జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను రక్షించుకోలేకపోయారు. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద అత్యంత తీవ్రంగా రావడంతో చేతికందిన వస్తువులను వెంటపెట్టుకుపోగా మిగిలిన ఖరీదైన వస్తువులన్నీ వరదల్లో మునిగి బురదమయమయ్యాయి. ఒక్క రేపాకగొమ్ములోనే 500 కుటుంబాలు ఈ విధంగా సర్వస్వం కోల్పోయారు. వరద తగ్గుముఖం పట్టడంతో గ్రామంలోకి వెళ్లిన బాధితులకు కూలిపోయిన ఇళ్లు, బురదలో చిక్కుకున్న సామగ్రిని చూసి గుండె తరుక్కుపోయింది. పడుకునే మంచాల దగ్గర నుంచి వండుకునే గిన్నెలు, విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులు సమస్తం బురదమయం కావడంతో అవి కూడా కూలిపోయిన ఇళ్ల కింద బురదలో చిక్కుకుని ఉండటంతో వాటిని అతికష్టం మీద బయటకు తీసి ప్రస్తుతం తాము తలదాచుకుంటున్న ప్రాంతాలకు ట్రాక్టర్‌ల ద్వారా తరలిస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా ఇదే పరిస్థితి దర్శనమిస్తోంది. ఐదు రోజుల క్రితం వరద నుంచి బయట పడ్డ వేలేరుపాడులో నేటి వరకు చెత్తా చెదారాలను తొలగించలేదు. ఇళ్లల్లో పాడైన వస్తువులను రోడ్లపైనే గుట్టలుగా వేయడంతో వాటిని తొలగించకపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఒక్క జగన్నాధపురం మెయిన్‌రోడ్డులో మాత్రం చెత్తా చెదారాలను తొలగించిన అధికారులు వేలేరుపాడులో మాత్రం నేటికీ తొలగింపు కార్యక్రమం, శానిటేషన్‌ పనులను ప్రారంభించలేదు. 

Updated Date - 2022-07-26T02:14:23+05:30 IST