శ్రీరామసాగర్‌కు 1,62,000 క్యూసెక్కుల వరద

ABN , First Publish Date - 2020-09-24T08:42:40+05:30 IST

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొన సాగుతోంది. గోదావరి ద్వారా భారీగా వరద

శ్రీరామసాగర్‌కు 1,62,000 క్యూసెక్కుల వరద

32 గేట్ల ద్వారా దిగువకు విడుదల


నిజామాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ మెండోరా: శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొన సాగుతోంది. గోదావరి ద్వారా భారీగా వరద వస్తుండటంతో 32 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తోన్న వరదను గమనిస్తూ గేట్ల సంఖ్యను పెంచుతున్నారు. మాహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తుండడంతో సిబ్బంది ప్రాజెక్టు వద్దనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు ఈ నెల ఆరంభం నుంచే భారీ వరద వస్తోంది. మహారాష్ట్రతో పాటు జిల్లాలోనూ వర్షాలు పడటంతో ఈ వరద కొనసాగుతోంది. గోదావరితో పాటు మంజీరా నుంచి కూడా వరద వస్తుం డటంతో ప్రతీరోజు లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువ కు వదులుతున్నారు. ఈ వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటి  వరకు ప్రాజెక్టులోకి 185 టీఎంసీలకు పైగా వరద వచ్చింది. ఇప్పటి వరకు 85 టీఎంసీల వరదను ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో 90 అడుగు ల నీటిని ఉంచుతూ వరదను దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టులోకి బుధవారం 1,62,000 క్యూసెక్కుల వరద రాగా 32 గేట్లను ఎత్తి 1,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మిగతా నీటిని వరద కాలువ, ఇతర కాలువల ద్వారా దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్ర నుంచి వరద వస్తుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని ఈఈ రామారావు, డీఈ జగదీష్‌లు తెలిపారు. వరద తగ్గితే ప్రాజెక్టును పూర్తిగా నింపుతామన్నారు.


నిజాంసాగర్‌లో 5.856 టీఎంసీల నీటి మట్టం

నిజాంసాగర్‌, సెప్టెంబరు 23: నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 1405.00 అడుగులకు 1393.50 అడుగుల నీటి మట్టం ఉందని, 17.802 టీఎంసీలకు గాను 5.856 టీఎంసీల నీటిమట్టం నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 3736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. 


సింగూరులో 19.429..

నిజాంసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ అయిన సింగూరు ప్రాజెక్టులో 523.600 మీటర్ల గాను 521.350 మీటర్ల నీటి మట్టం, 29.917 టీఎంసీలకు గాను 19.429 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఎగువ ప్రాంతం నుంచి 8,245 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టులో వచ్చి చేరుతుం దన్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లో క్రమంగా నీటిమట్టం పెరుగుతూ వస్తు ందన్నారు.

Updated Date - 2020-09-24T08:42:40+05:30 IST