విపత్తు పునరావాస కార్యక్రమాల్లో స్థానిక అధికారులు, ప్రత్యేక శిక్షణ పొందిన కేంద్ర సిబ్బంది తలమునకలై ఉన్నప్పుడు అక్కడకు స్థానిక చోటా నాయకులు సహా శాసనసభ్యులు, మంత్రులు తమ అనుచరగణంతో పోవడం సరికాదు. తామేదో ఆదేశాలు ఇస్తున్నట్టు, చక్కబెడుతున్నట్టు కనిపిస్తూ సహాయకచర్యలనూ రాజకీయం చేస్తున్నారు. చిత్తశుద్ధితో రేయింబవళ్ళు పనిచేస్తున్న అధికారుల మనోస్థైర్యాన్ని వీరి అనవసర ఆదేశాలు, అధికప్రసంగాలు కృంగదీసే విధంగా ఉంటున్నాయి. కొందరు ఇంతటి సంక్షోభంలోనూ తమకు ప్రోటోకాల్ మర్యాదలు అందడం లేదని ఆగ్రహించడమూ చూశాం. ఈ రాజకీయ సందర్శకుల వల్ల పనులకు అడ్డంకి తప్ప ప్రయోజనం లేదు. గతంలో దివిసీమ ఉప్పెన లోనూ, ధవళేశ్వరం బ్యారేజీకి గండిపడినప్పుడు, సింగరేణి గనుల్లోకి గోదావరి నీరు ప్రవేశించినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు విపత్తు ప్రాంతాలకు తాను పోలేదు, మంత్రులను, ఇతర నాయకులను పోనివ్వలేదు. పూర్తి బాధ్యతలను సమర్థులైన అధికారులకు అప్పగించడం వల్ల ఉపశమన పనులు ఎంతో వేగంగా ఎటువంటి విమర్శలు లేకుండా సాగాయి. ఈ ఆపత్కాలంలో చిత్తశుద్ధితో సేవలు అందించిన సిబ్బందిని తగురీతిలో గౌరవించడం ద్వారా ఉద్యోగవర్గాల్లో మనోస్థైర్యం పెంచాలి.
యం.వి.జి. అహోబలరావు