జలగండం తప్పేదెప్పుడు !?

ABN , First Publish Date - 2020-12-04T04:52:00+05:30 IST

నెల్లూరు ఎంత అభివృద్ధి చెందుతున్నా భారీ వర్షాలు కురిస్తే అనేక ప్రాంతాలు నీట మునుగుతాయి.

జలగండం  తప్పేదెప్పుడు !?
భగత్‌సింగ్‌ కాలనీలో నీట మునిగిన ఇళ్లు(ఫైల్‌)

వరద ముప్పులో నెల్లూరు నగరం

వానంటేనే వణుకుతున్న పలు కాలనీలు

పెన్నా పొంగితే వేల ఇళ్లు మునకే!

అలాంటి చోటే పేదలకు స్థలాలు

కరకట్టలే పరిష్కారం

జాప్యం చేస్తే మరింత ప్రమాదం


నెల్లూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద నగరం.. పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రం... వ్యాపార, వాణిజ్యాలకు నిలయం. ఇదీ నెల్లూరు నగర విశిష్టత. కానీ ఎంత అభివృద్ధి చెందుతున్నా ఏం లాభం?. భారీ వర్షాలు కురిస్తే అనేక ప్రాంతాలు నీట మునుగుతాయి. పెన్నాకు వరదొచ్చిందంటే పలు కాలనీలు జలమయం. వేల మంది రోడ్డున పడతారు. ఈ నష్టం నుంచి కోలుకోవడానికి వాళ్లకు ఎంతో కాలం పడుతోంది. ఎప్పుడు వర్షాలు, వరదలు సంభవించినా ఇదే పరిస్థితి. అయినా ఈ జలగండాన్ని తప్పించేందుకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. వరదలొచ్చినప్పుడు హడావిడి చేయడం, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం తప్ప అసలు సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా వేలాది మంది సామాన్యులు వానంటేనే వణుకుతున్నారు.


ఎక్కడైనా నగరం మధ్య నుంచి నది వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతటి వరదొచ్చినా నగరంలోకి నీరు రాకుండా కరకట్టలు నిర్మించాలి. కానీ నెల్లూరు నగరంలో మాత్రం ఈ పరిస్థితి లేకపోవడంతో జల ముప్పు తప్పడం లేదు. భారీ వర్షాలు, పెన్నాకు వరదొచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. పెన్నా బ్యారేజీకి ఎగువ భాగంలో దక్షిణం వైపు, దిగువ భాగంలో ఉత్తరం వైపు ఉన్న కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. జయలలిత నగర్‌, పొర్లుకట్ట, పరమేశ్వరీనగర్‌, పుత్తాఎస్టేట్‌, శివగిరికాలనీ ప్రాంతాలు పెన్నాకు వరదొచ్చినప్పుడు నీటిలో మునుగుతున్నాయి. అన్నిటికన్నా ఎక్కువగా భగత్‌సింగ్‌ కాలనీ దెబ్బతింటోంది. ఆ కాలనీ సమీపంలోనే పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో లేఅవుట్లు వేశారు. వేల మంది లబ్ధిదారులకు వీటిని ఈ నెల 25న అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్లాట్లు ప్రస్తుత వరదలకు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీట మునిగేచోట స్థలాలు ఎలా ఇస్తున్నారన్నది ఒక ప్రశ్నయితే, ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవడం భద్రమా అన్నది మరో ప్రశ్న. స్థలాలు తీసుకున్నవారు కచ్చితంగా అక్కడ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. మరి ఈ ముంపు ప్లాట్లలో ఇళ్లు ఎలా నిర్మించుకోవాలన్నది కూడా ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. నెల్లూరు నగర పరిధిలో పెన్నా నదికి ఇరువైపులా కరకట్ట నిర్మించి రివిట్మెంట్‌ చేస్తేగానీ వరద ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. ఇటీవల ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆ పని త్వరగా కార్యరూపం దాచ్చాల్సిన అవసరముంది. ఇతర ప్రాజెక్టుల మాదిరిగా కరకట్టల నిర్మాణాన్ని ఆలస్యం చేస్తే మళ్లీ మళ్లీ ముంపు ముప్పు ఎదుర్కోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


రూ.500 సరిపోతుందా..?

నివర్‌ తుఫాన్‌ దెబ్బకు నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పెన్నాకు భారీగా వరద పోటెత్తడంతో జయలలిత నగర్‌, భగత్‌సింగ్‌ కాలనీల్లోని చాలా ఇళ్లు నీళ్లలో మునిగిపోయాయి. మోటార్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర వస్తువులు పనికిరాకుండా పోయాయి. దీంతో ఒక్కో కుటుంబానికి రూ.వేలల్లో నష్టం వాటిల్లింది. సాధారణంగా ఇలాంటి వైపరిత్యాలు  సంభవించినప్పుడు బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది. కానీ నెల్లూరు నగరంలో అటువంటి దాఖలాలు లేవు. పునరావాస కేంద్రాలకు వెళ్లిన వారికి మాత్రం రూ.500 ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ మొత్తం ఏ విధంగా సరిపోతుందన్నది ప్రశ్నగా మారింది. భగత్‌సింగ్‌ కాలనీలో ఇటీవల మంత్రులు పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఆదుకోవాలని వేడుకున్నారు. మరి అమాత్యులు వరద బాధితులను ఏ మేరకు ఆదుకుంటారో చూడాలి.

Updated Date - 2020-12-04T04:52:00+05:30 IST