గాలికి వదిలేశారా?

ABN , First Publish Date - 2022-08-13T05:48:09+05:30 IST

పోలవరం ప్రాజెక్టు పరిధిలో వందల గ్రామాలు నీట మునగనున్నాయి.

గాలికి వదిలేశారా?
పోలవరం చెక్‌ పోస్టు వద్దకు చేరిన గోదావరి వరద

బాధితుల గోడు వినిపించుకోరా..?

ముంపు మండలాల్లో రెండోసారి వరదొచ్చినా పట్టించుకోరా ?

మొదటి సాయంతోనే సరిపెడతారా

ఇక చాలు.. ఖాళీ చేసి పొమ్మన్నట్టుగా వ్యవహారం.. సర్కార్‌ వైఖరిపై నిరసన

కుక్కునూరు, వేలేరుపాడుల్లో నిర్వాసితుల నిర్వేదం.. వరుస వరదలతో నీటిపాలు


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

పోలవరం ప్రాజెక్టు పరిధిలో వందల గ్రామాలు నీట మునగనున్నాయి. ప్రాజెక్టు పూర్తికాక ముందే భారీ వరదలు తోడై ఇప్పటికే వరదలు చుక్కలు చూపిస్తున్నాయి. తీరని నష్టం మిగిల్చాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఉన్న కొంపా గూడు కొట్టుకుపోయాయి. కేవలం రెండు వేల రూపాయలు, కాస్తంత బియ్యం, వంట నూనె, పప్పులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత నిర్వాసి త కుటుంబాలన్నింటినీ గాలికొదిలేశారు. కొండెక్కినా, గుట్ల మీద టెంట్‌లు వేసుకున్నా, కాలే కడుపుతో ఉన్నా, గుక్కెడు నీళ్ళు దొరకకపోయినా.. గొంతెండు తున్నా, పసిపాపలు విలవిలలాడుతున్నా అధికార పక్షంలో ఒక్కరైనా సాయం చేస్తే ఒట్టు. గూడు కోల్పోయి కాలే కడుపులతో గొల్లుమంటున్నా విని పించు కోవడమేలేదు. వాస్తవా నికి గత నెలలో వచ్చిన తీవ్ర వరదలప్పుడు వారం తరువాతే అంతా మేలుకోగలిగారు. అప్ప టికప్పుడు రంగంలోకి దిగారు. అంతోఇంతో సాయం అందించే ప్రయత్నం చేశారు. అంతేతప్ప ఈ రెండు మండలాల్లో వరద బాధి తులకు పూర్తి భరోసా కల్పించలేకపో యారు. ఆఖరుకి గతంలో ఇస్తామన్న ప్రత్యే క ప్యాకేజీల వైపే వరద బాధితులు ఆసక్తి ప్రద ర్శించారు. ఇప్పటికిప్పుడు వచ్చిన వరదలు కాకుండా పాత వాటి సంగతి ఏం తేలుస్తారనే రీతిలోనే ఎదురుచూసినా.. వేడుకున్నా ఆ వైపున సర్కార్‌ ఇప్పటికీ స్పందించనూలేదు. వరద బాధితులను ఊరడించేందుకు ఈ మధ్యనే వేలేరు పాడు మండలం కన్నాయిగుట్టకు సీఎం జగన్‌ వచ్చారు. మీకేం భయంలేదు. అన్నీ నేనే చూసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్ళకు పరిహారం ఇస్తామని చెబుతూనే సెప్టెంబర్‌ నాటికి పూర్తి పరిహారం అందిస్తాం, అప్పుడిక నేరుగా నిర్వాసిత కాలనీలకు వెళ్ళొచ్చు అంటూ సెలవిచ్చారు. ఇదిగో అప్పటి నుంచే నిర్వాసిత కుటుంబాల్లో సరికొత్త ఆందోళన నెలకొంది. ఇప్పటికే పీకల్లోతు వరదల్లో మునిగి, ఉన్న ఆస్తులను కోల్పోయి దిక్కు మొక్కూ లేకుండా బతుకీడ్చుకొస్తుంటే దీని సంగతి పక్కనపెట్టి వచ్చే నెలలో జరగ బోయే తరలింపు సంగతిని తెరముందుకు తేవడం పైనే ఒకింత ఆందోళన, ఆగ్రహం తో ఉన్నారు. మొన్నీమధ్యనే కాస్త వరద తగ్గుముఖం పట్ట డంతో ఒకరి కొకరు కలుసు కుని, మాటామంతికి సాహ సించారు. అప్పట్లోనే జగన్‌ సర్కార్‌ ఎంతో చేస్తుందని ఆశించాం.. తీరా చూస్తే ఏమీ చేయకపోగా, ఇదిగో వచ్చే నెలలో అంతా ఇచ్చే స్తాం.. పోండంటున్నా రని ఒకరికొకరు ఓదార్పు తరహాలో సంభాషించుకున్నారు. కాని గడిచిన నెల రోజుల్లో రెండుసార్లు వచ్చిన గోదావరి వరదల్లో వందల కుటుంబాలు ఎదురీదలేక దాదాపు చతికిలపడ్డాయి. నిస్సహాయత వెంటాడుతున్నా తమకు రావాల్సిన పరిహారం వైపే ఆశలు పెంచుకున్నారు. ఈలోపే చేయాల్సింది చేయక పోగా లోలోన నిర్లక్ష్యంగానే ఉన్న సర్కార్‌ పైకి అంతా చేస్తా మంటూ గొప్పలు చెప్పుకునే స్థితికి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. ఒకసారిస్తే రెండోసారి ఇవ్వరా. నెలలో ఒకసారి మాత్రమే రావాలని రూలుందా. పదేపదే వస్తే సాయం మా త్రం చేయరా.. అవును చేయం అనే తంతులోనే అధికారుల వ్యవహారం సాగుతోంది. గడిచిన నెలలో వచ్చిన గోదావరి వరద కారణంగా బాధిత కుటుంబాలకు కాస్తంత ధైర్యం సమకూర్చేందుకు, ఆపదలో అన్నార్తుల్లా టీడీపీతో సహా అనేక స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి అన్ని గ్రామాల్లోనూ ఉన్న బాధితులను కలిసి వారికి కాస్తంత చేయూతనిచ్చాయి. మే మున్నామంటూ ధైర్యం పలికాయి. ఇదిగో మళ్ళీ మరోసారి మూడు రోజులుగా వరద గ్రామాలను చుట్టిముట్టింది. అధికా రులు ఈసారి నింపాదిగా ఉన్నారు. తక్షణ సాయం కోసం ఏ మాత్రం ఉపక్రమించలేదు. నెల రోజులపాటు వరద, బురద లోనే కాలక్షేపం చేసిన వందల కుటుంబాల్లో ఏ ఒక్క కుటుం బానికి కాస్తంత చెయ్యి ఇచ్చే విధంగా రెండోసారి సాయం చేసేం దుకు ఏ ఒక్కరూ ఉపక్రమించలేదు. ఉన్నంతలోనే మళ్ళీ బతుకీడ్చుకొస్తున్న కుటుంబాలన్నీ ఇప్పుడు ఎవరికీ చెప్పుకోలేక బావురమంటూనే ఉన్నాయి. 

అక్కున చేర్చుకోని సర్కార్‌

నిర్వాసిత కుటుంబాలపై ఎక్కడలేని ప్రేమ వలగబోసిన సర్కార్‌ వరదలొచ్చినప్పుడు బాధితులను అక్కున చేర్చుకోలేక పోతోంది. బాధిత కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వీరి లో అత్యధికులు గిరిజనులే. ప్రాజెక్టుకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వారు. గోదావరి వరదల్లో మరోసారి సర్వం కోల్పోయిన వారు. అయినప్పటికీ వీరందరినీ గాలికొదిలేశారు. మండల స్థాయిలో సైతం కాస్తంత భుజం తట్టి భరోసా కల్పించలేకపోతున్నారు. ఈ మధ్యనే వేలేరుపాడు సందర్శిం చిన కేంద్ర బృందంకు తమ గోడు చెప్పుకోవడానికి కొందరు ప్రయత్నించారు. రాత పూర్వకంగా ఇచ్చే పరిస్థితి లేక నిస్స హాయంగా మిగిలిపోయారు. అయినప్పటికీ గత నెలలో వచ్చి న వరద సంఘటననే ప్రస్తావిస్తూ తామంతా సాయం చేశా మని, ప్రాణ నష్టం లేకుండా చూశామని, సురక్షిత ప్రాం తాలకు చేరిన వారిని అన్ని విధాలా ఆదుకున్నామంటూ జిల్లా యంత్రాంగం నేరుగా కమిటీ బృందానికి వివరించే ప్రయత్నం చేసింది. కాని ఈ మూడు రోజులుగా వరదల్లో నలిగిపోతున్న వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన కుటుంబాలకు ఏ రీతిలో సాయపడాలో చెప్పలేదు. కార్యాచరణలో ఇప్పటికీ చూపించనూలేదు. 


Updated Date - 2022-08-13T05:48:09+05:30 IST