ముంపు ముప్పు

ABN , First Publish Date - 2021-08-03T06:20:16+05:30 IST

కృష్ణానదికి ఎగువ నుంచి వరద నీటి ఉధృతి మరింత పెరిగింది.

ముంపు ముప్పు
కృష్ణలంక తారకరామా నగర్‌లో నీటమునిగిన ఇళ్లు

కృష్ణానదికి గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి 

బ్యారేజ్‌ 70 గేట్లను ఎత్తిన అధికారులు

రాణిగారితోటలో ఇళ్లలోకి నీరు 

పునరావాస కేంద్రాలకు ప్రజలు

18 మండలాల్లో అప్రమత్తం


కృష్ణానదికి వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చొచ్చుకొస్తోంది. నివాసాలు, పంట పొలాలు ఇప్పటికే కొంత భాగం మునిగిపోయాయి. విజయవాడ కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల్లో నదిని ఆనుకొని ఉన్న నివాసాల్లోకి నీరు చేరడంతో అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. 


విజయవాడ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : కృష్ణానదికి ఎగువ నుంచి వరద నీటి ఉధృతి మరింత పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌కి సోమవారం 2లక్షల 47వేల 750 క్యూసెక్కుల నీరు వచ్చింది. పులిచింతల నుంచి 3లక్షల 14వేల క్యూసెక్కుల నీరు వస్తోందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి పులిచింతల నుంచి 2లక్షల 47వేల 750 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకుంది. దీనితోపాటు పాలేరు నుంచి 328, కీసర నుంచి 1,022 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద 30 గేట్లను ఆరు అడుగుల వరకు, 40 గేట్లను ఐదు అడుగుల వరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గుంటూరు కెనాల్‌తోపాటు జిల్లాలోని కాల్వలకు 9,689 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ ఫ్లో 2లక్షల 47వేల 750 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ ఫ్లో కూడా అదే పరిమాణంలో ఉంది. కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల్లో నదిని ఆనుకుని ఉన్న ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. బ్యారేజ్‌కు మరో 5లక్షల క్యూసెక్కుల వరకు నీరు రావొచ్చని అధికారులు ఇప్పటికే  అంచనాకు వచ్చారు. నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఘాట్ల వద్దకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ఫెర్రీ దగ్గర నుంచి తోట్లవల్లూరు వరకు ఉన్న ఘాట్లు, రేవుల వద్ద పోలీసు పహారా పెంచారు. సోమవారం సాయంత్రానికి విజయవాడ క్లబ్‌ వైపున ఉన్న శివాలయం వరకు వరద నీరు చేరుకుంది. రాత్రికి అది మరింత పెరిగింది. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు ఆంక్షలు విధించారు.


కృష్ణా తీరంలో హై అలర్ట్‌

కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతున్నందున తీర ప్రాంతంలోని 18 మండలాల్లో అధికారులు  హై అలర్ట్‌ ప్రకటించారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. పశ్చిమ కృష్ణాలో జగ్గయ్యపేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహసీల్దార్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, చినలంక, పెదలంక ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో కార్పొరేషన్‌, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద తీవ్రత ఉన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే పశ్చిమ కృష్ణాలోని వైకుంఠపురంలో ఇసుక బస్తాలను సిద్ధం చే శారు. గీతానగర్‌ కట్ట, డ్రెయినేజీ పంపింగ్‌ స్టేషన్‌ల మధ్య కరకట్ట గ్యాప్‌ను కూడా పూడ్చే పనులు చేపట్టారు. నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలైన భూపేష్‌గుప్తానగర్‌, కృష్ణానగర్‌, రణదివె నగర్‌, స్లూయిస్‌ గేట్‌ తదితర ప్రాంతాలలో అధికారులు అప్రమత్తమయ్యారు.


కృష్ణానది పాయల్లో వరద ప్రవాహం

తోట్లవల్లూరు : తోట్లవల్లూరు మండలంలోని కృష్ణానది పాయల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి వరద ఉధృతి పెరిగింది. సాయంత్రం నుంచి పాయలు నిండుగా ఉరకలెత్తుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు మునిగిపోతే నష్టపోతామని కలవరపడుతున్నారు.



Updated Date - 2021-08-03T06:20:16+05:30 IST