వరదనీటిలో కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి

Jul 25 2021 @ 01:08AM
గంటిపెదపూడి వద్ద గోదావరి పాయలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు

  • పి.గన్నవరంలో లంక గ్రామాల ప్రజలకు మొదలైన కష్టాలు

పి.గన్నవరం, జూలై 24: గోదావరి ఎగువ ప్రాంతాలనుంచి వరదనీరు భారీగా దిగువకు రావడంతో మండలంలోని గంటిపెదపూడి, ఊడిమూడి గ్రామపంచాయతీల పరిధిలోని నాలుగు లంకగ్రామాల ప్రజలు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. ఉదయం లంకగ్రామస్తులు రాకపోకలు సాగించినా మధ్యాహ్నం వరద ఉధృతికి తాత్కాలిక రహదారి కాస్త వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో నాటు పడవలు, మరబోట్ల పైనే రాకపోకలు సాగిస్తారు. ఒకే గడ్డపై ఉన్న బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడిలంక గ్రామాల్లో 900 కుటుంబాలు 4వేలు జనాభా ఉన్నారు. వీరికి కొన్ని దశాబ్ధల కాలం నుండి ఎన్ని ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం మాత్రం ఎన్నికల వాగ్ధానంగానే  మిగిలిపోయింది. వరదల సమయంలో లంకగ్రామాల్లో ఉన్న రైతులు, మహిళలు, విద్యార్థులు పడే కష్టాలు వర్ణాతీతం. వంతెన నిర్మాణం నిమిత్తం గతప్రభుత్వం రూ.49.50 కోట్లు మాంజురు చేసింది. ఈ ప్రభుత్వంలో ప్రక్రియ కొనసాగించినా ప్రస్తుతం ఆన్‌లైన్‌ టెండరు దశలో ఉందని, వచ్చే సీజన్‌లో వరదల తర్వాత వంతెన నిర్మాణానికి రూపకల్పన జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా లంకగ్రామాల ప్రజలకు రాకపోకలు నిమిత్తం ఇంజన్‌పడవలు ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్‌ బి.మృత్యంజయరావు తెలిపారు.

గతేడాది వరదలకాలంలో బోట్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సూచించారు. నదిపాయవద్ద వరద ఉధృతిని పరిశీలించిన ఆయన అక్కడనుంచి ఫోన్‌లో ఆర్డీవో వసంతరాయులతో ఎమ్మెల్యే మాట్లాడారు. లంకగ్రామాల ప్రజలు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన రెవెన్యూ అధికారులకు సూచించారు. ఆయనతోపాటు ఎంపీడీవో ఐఈ కుమార్‌, డిప్యూటీ తహశీల్దార్‌ బి.గోపాలకృష్ణ, ఆర్‌ఐ జి.సుబ్రహ్మణ్యం, మంతెన రవిరాజు, సర్పంచ్‌లు దంగేటి సత్యనారాయణ, ప్రసన్నకుమార్‌, సాధనాల రమేష్‌ తదితరులు ఉన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.