మురుగు.. పరుగు

ABN , First Publish Date - 2022-06-22T17:06:53+05:30 IST

నగరంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు కురిసిన వర్షం పలు ప్రాంతాలను వణికించింది. మాదాపూర్‌లో అత్యధికంగా 10.2 సెం.మీ, బాలానగర్‌లో 7.6 సెం.మీ

మురుగు.. పరుగు

పలు ప్రాంతాలను కుదిపేసిన వాన 

మాదాపూర్‌లో 10.2 సెం.మీ

బాచుపల్లిలో సెల్లార్లను ముంచేసిన వరదనీరు

బేగంపేటలో పొంగిన నాలా.. రోడ్లపై పారిన మురుగు


హైదరాబాద్‌ సిటీ: నగరంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు కురిసిన వర్షం పలు ప్రాంతాలను వణికించింది. మాదాపూర్‌లో అత్యధికంగా 10.2 సెం.మీ, బాలానగర్‌లో 7.6 సెం.మీ వర్షం కురిసింది. బాచుపల్లి, చందానగర్‌, రాజీవ్‌గాంధీనగర్‌, అల్విన్‌కాలనీ ధరణినగర్‌, బేగంపేట ప్రాంతాల్లో వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదలతో నాలాలు పొంగిపొర్లడంతో బేగంపేటలో మురుగునీరు రహదారులను ముంచేసింది. ఇళ్లల్లోకి చేరింది. బయటకు తోడేందుకు స్థానికులు రోజంతా అవస్థలు పడ్డారు. 

బాచుపల్లి, ఆల్విన్‌కాలనీ, బేగంపేట ప్రాంతాల్లో వరదనీటితో స్థానికులు రాత్రంతా నిద్రలేకుండా జాగరణ చేశారు. చందానగర్‌ స్టేషన్‌ అండర్‌ బ్రిడ్జి కింద మోకాళ్ల లోతు వరదనీరు నిలిచిపోవడంతో వాహనాలు సగంవరకు నీటమునిగాయి. బాచుపల్లి రాజీవ్‌గాంఽధీనగర్‌లో సెల్లార్లను వరద ముంచేయడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు కిందికి దిగలేక ఇబ్బందులు పడ్డారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో మంగళవారం సాయంత్రం వరకు మోటర్లతో బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేశారు. ఆల్విన్‌కాలనీలో వరదతో పాటు కెమికల్‌  నురుగులు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. రాత్రంతా కురిసిన వర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. నాలాల్లో వరద సాఫీగా వెళ్లేందుకు మొదలు పెట్టిన పనులు పూర్తికాకపోవడంతో నీరు ఇళ్లల్లోకి వస్తోందని పలుప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సరూర్‌నగర్‌లో మంగళవారం 1.7 సెం.మీ. లింగోజిగూడలో 1.5 సెం.మీ వర్షం కురిసింది. నగరంలో మరో రెండురోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 


16 మాన్‌సూన్‌ సేఫ్టీ టీమ్‌లు సిద్ధం

మురుగు సమస్యలుంటే కాల్‌ 155313

వర్షాకాలం నేపథ్యంలో వాటర్‌బోర్డు అప్రమత్తమైంది. వర్షాలకు మ్యాన్‌హోళ్ల ఓవర్‌ఫ్లో, రోడ్లపై వర్షపు నీళ్లు నిలవడం లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించడానికి నిరంతరం అందుబాటులో ఉండేలా 16 మాన్‌సూన్‌ సేఫ్టీ టీమ్‌లను సిద్ధం చేసింది. 24గంటలూ అందుబాటులో ఉండే ఈ టీమ్‌లు రోడ్లపై నిలిచే వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపడతాయి. మరో 16 మినీ ఎయిర్‌టెక్‌ వాహనాలను కూడా అందుబాటులో ఉండేలా వాటర్‌బోర్డు అధికారులు చర్యలు చేపడుతున్నారు.


మ్యాన్‌హోల్‌ మూతలు తెరవొద్దు : దానకిశోర్‌

వర్షాల నేపథ్యంలో నగరవాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్‌ మూతలను తెరవొద్దని వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్‌కోరారు. ఎక్కడైనా నీరు నిలిచినా, మ్యాన్‌హోల్‌ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నా, మురుగు సమస్యలుత్పన్నమైనా వాటర్‌బోర్డు కస్టమర్‌ కేర్‌ నెంబరు 155313కి ఫోన్‌ చేయాలని సూచించారు. మాన్‌సూన్‌ సేఫ్టీ టీమ్‌లను, వాహనాలను మంగళవారం ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎండీ దానకిశోర్‌ జెండా ఊపి ప్రారంభించారు. 


మద్యం మత్తులో గుంతలో పడి వ్యక్తి మృతి

దుండిగల్‌: తాగిన మైకంలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన దుండిగల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా, విచ్చుకొండ మండలానికి చెందిన గొడుగు హన్మంతు, అనసూయ భార్యాభర్తలు. ఆరు మాసాల క్రితం బతుకుదెరువు కోసం దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్‌కు వచ్చారు. ఈనెల 20న రాత్రి 8 గంటల సమయంలో భార్య పనిచేస్తున్న హోటల్‌ వద్దకు వెళ్లిన హన్మంతు ఆమెను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పటికే మద్యంమత్తులో ఉన్న అతను దారి మధ్యలో తెలిసిన బంధువు విఠల్‌ దగ్గరకు వెళ్లొస్తానని భార్యను ఇంటికి పంపాడు. రాత్రి 12 గంటలైనా  అతను రాకపోయేసరికి భార్య వెదుకుతూ విఠల్‌ ఇంటికి వెళ్లింది. అక్కడినుంచి వెళ్లి పోయాడని అతను చెప్పడంతో ఇద్దరూ కలిసి వెతికారు. ఇంటికి కొద్ది దూరంలో వర్షపు నీటి గుంతలో హన్మంతు బోర్లా పడి ఉండడం కనిపించింది. అప్పటికే అతను మృతిచెందినట్లు వారు గుర్తించారు. అనసూయ ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-22T17:06:53+05:30 IST